Sampathkumar Reddy Matta……… బాయి బొడ్డెమ్మ – కోజాగర పున్నమ……. #ఇది_శరదుత్సవ_సంబురం…
పీటబొడ్డెమ్మ, చెక్కబొడ్డెమ్మ,
పందిరిబొడ్డెమ్మ, పెండబొడ్డెమ్మ,
Ads
చల్లుడుబొడ్డెమ్మ, గుంటబొడ్డెమ్మ
బొడ్డెమ్మ తాత్త్వికరూపాలు రకరకాలు.
వీటిలో మరో ముఖ్యరూపం…బావి బొడ్డెమ్మ.
ఊరు చావడికాడ లేదంటె మూడుతొవ్వలకాడ
నడితొవ్వల బావిరూపంలో తవ్వేదే బావిబొడ్డెమ్మ.
ఇది ప్రాణికోటి జీవనాధారమైన జలగౌరికి సంకేతం.
కొందరు అమావాస్యనాడు, కొందరు తదియ నెలపొడుపుకూ
బొడ్డెమ్మ బాయితవ్వుతరు. గడ్డపారకు,పారకు, స్థలగౌరియైన
భూదేవికి పూజచేసి బాయిదవ్వే మొగపిల్లగాండ్లకు కంకణం కట్టి
బాయి మొదలుపెడుతరు. తూర్పుపడమర సూర్య చంద్రగద్దెలు
ఉత్తరదక్షిణాలు చిన్నగంగ పెద్దగంగ గద్దెలు మొదటగా వేసుకుని
ఆ వాడకట్టుకు ఇంటికొకటిగా 9 11 13 16 19 21 గద్దెలు వేస్తరు.
గద్దెల పని పూర్తయిన తర్వాత ఐదుగురు అంటతకంటే ఎక్కువ
బాలికలు, మహిళలు మంగళహారతులతో ఊరిబయటకు వెళ్లి
వనగౌరి ఎలబద్రి చెట్టుకు నీళ్లువోసి,పసుపుకుంకుమల పూజించి,
కంకణం కట్టి హారతులిచ్చి, చెట్టు పెకలించి తెచ్చి బావిలో పెడ్తరు.
ఇక రోజూ గద్దెలను పుట్టమన్ను లేదా జాజుతో అలుకుపూతజేసి
పసుపుకుంకుమలు, పచ్చముగ్గు,సుద్దతోటి ముగ్గులు వేస్తరు.
గద్దెలకు పూలుచల్లి, బావిలోపల వెంపలిచెట్టుకు నీళ్లు పోస్తరు.
దీనితో బాయిబొడ్డెమ్మ రూపమైన బొడ్డెమ్మ బాయి సిద్ధమౌతది.
మాపటికి బాయిని అలంకరించి పుష్పగౌరిగ బతుకమ్మలు పేర్చి
ఆట పూర్తయిన తర్వాత అదే బాయిలో బొడ్డెమ్మలు వేసివస్తరు.
తిరిగి పొద్దునపూట ఆ బతుకమ్మలు తొలగించి ముగ్గులువేస్తరు.
క్రమమంతా ఆఖరు రోజుదాకా అదే నియమంతో నడుస్తుంటది.
జగిత్యాల,వేములవాడ,మెట్టుపల్లి, ఆర్మూరు కాడ మొదలుజేస్తే
కడెం, ఖానాపురం, నిర్మల్, ఉట్నూరు, ఆదిలాబాదుతోబాటుగా
మహారాష్ట్రలోని నాందేడు, యవత్మాలు, చంద్రాపూరు ఆపైనున్న
జిల్లాలు, ప్రాంతాలు అంతటా ఈ బాయిబొడ్డెమ్మదే సంప్రదాయం.
అంతటా పితృ అమావాస్యతోటి మొదలై దుర్గాష్టమితో బతుకమ్మ
వేడుకలు ముగుస్తయి. కానీ పై ఈ ప్రాంతాలలో మాత్రం వేడుకలు
దసరా తర్వాత, పున్నం తర్వాత పదిరొజులపాటు కొనసాగుతయి.
దసరకు కోజాగర పున్నానికి మధ్య గంగకిందివైపున సద్దులైతయి.
కానీ గంగవతల ప్రాంతమంతా దసరా తర్వాత, పున్నం తర్వాతనే
సద్దుల బతుకమ్మ వేడుకలు సంప్రదాయబద్ధంగా జరుపుకుంటరు.
రోజూ మాపటికి, అలికి ముగ్గులుపెట్టిన బొడ్డెమ్మ బాయిచుట్టూ
ఆ వాడకట్టు ఆడిబిడ్డల ఆటపాటలు అర్ధరాత్రివరకూ నడుస్తయి.
ఆడీపాడి బతుకమ్మలను రోజూ బొడ్డెమ్మబావిలోనే ఓలలాడిస్తరు.
దసరకు చిన్నసద్దులు, ఆఖరునాడు పెద్దసద్దులు రెండూచేస్తరు
గోండు, కొలాములు దసరనాడే బాయిబొడ్డెమ్మను తవ్వుకుంటరు.
ఈ తంతులొ ప్రాచీనమైన స్థానికాచారాలు తీరుతీరుగా ఉంటాయి.
చిన్నసద్దులు అంటే దసరానాడు మాపటికి జంబిపూజల తర్వాత
బతుకమ్మతో, నైవేద్యాలతో బాయిదగ్గరికి వచ్చి ఈ జలగౌరమ్మకు
జమ్మి ఆకులు ఇచ్చి నమస్కరిస్తరు. తదుపరి ఆటాపాటా ఉంటది.
దోసకాయ పలారం నాకు – దోసెడుపాటలు నీకు అని వేడుకజేస్తరు.
కోజాగర పున్నమనాడు బొడ్డెమ్మ బాయిలో ఇత్తడి తాంబాలం పెట్టి
దాన్నిండా పాలుబోసి, చందమామ నడినెత్తిమీదికి వచ్చేపొద్దుదాక
బతుకమ్మలు కోలాటాలతో బ్రహ్మాండంగ శరదుత్సవం జరుపుతరు.
ఆటపాటల తర్వాత పాలలో చంద్రదర్శనం చేసుకునుడన్నది శ్రేష్టం.
ఇక ఆ మరునాటి నుండి మంచిరోజుచూసుకుని ఊరు వంతనతో
శని, సోమ లేదా బేస్త వారాల్లో ఏదో ఓ రోజున పెద్దసద్దులు చేస్తరు.
పెద్దసద్దుల బతుకమ్మ వేడుకజేసి, వాగులో బతుకమ్మలను అంపి
సద్దులుగా వెంట తీస్కపోయిన గారెలు, బూరెలు, దోసకాయలు, బుడుమపండ్లు, పెరుగన్నం, పరమాన్నం వాయినం ఇచ్చుకుంటరు.
విందులు విడుపుల తదుపరి విధిగా ఇంటికొకరు చొప్పున పిడికెడు ఇసుకను సైకతగౌరమ్మగా తీసుకవచ్చి బాయిగద్దెలమీద చల్లుతరు.
సరాసరి ఊరంతా బాయిబొడ్డెమ్మ కాడికి వచ్చి, ఆఖరుగ ఆడిపాడి
ఒక గురిగిలో రూపాయి బిల్లలువేసి ఆ ధనగౌరిని బావిలోన నిలిపి,
స్థల, జల, వన, ధన గౌరమ్మల రూపమైన బావికి హారతులు ఇచ్ఛి,
ఎవరి గద్దెలను వారే, అందరూ కలిసి బొడ్డెమ్మ బాయిని పూడుస్తరు.
ఇంటికిచేరి తినితాగి, మరోసారి పూడ్చిన బాయికాడ చేరి ఆడామగ
తమతమ ఆటపాటలతో అర్థరాత్రిదాక రకరకాలుగ సందడిజేస్తరు.
ఇంతటితో ఈ ఏడు బాయి బతుకమ్మ వేడుక పరిసమాప్తమవుతది.
ఈ ప్రాంతపు పరిభాషలో బొడ్డెమ్మకూ బతుకమ్మకూ భేదంలేదు.
బొడ్డెమ్మకు పరరూపమైన బతుకమ్మనూ బొడ్డెమ్మగానే పిలుస్తరు.
బొడ్డెమ్మ బతుకమ్మ పండుగ దాదాపు రెండునెలలు జరిపే వేడుక.
ప్రాచీనాచార పరంపరకు ఒకానొక సజీవమైన సాంస్కృతిక శకలం.
క్రమక్రమంగా రూపురేఖలు మార్చుకున్న శరదుత్సవ సంబురమిది.
ఇది… మన బతుకమ్మ – మన సాంస్కృతిక చరిత్ర…….. ~డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
Share this Article