బీజేపీ ఆ పనిచేయకపోతే ఆశ్చర్యపడాలి… వరంగల్లో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటి మీద దాడి చేశారు… రాళ్లు విసిరారు… ఉద్రిక్తత, అరెస్టులు, నిరసనలు, ఖండనలు… సరిగ్గా బీజేపీ ఈ చాన్స్ కోసమే చూసింది, ట్రాపులో టీఆర్ఎస్ పడిపోయింది… ఒక చిన్న నిప్పురవ్వ కావాలని చూస్తోంది బీజేపీ… దాన్ని స్వయంగా ధర్మారెడ్డి అందించాడు… అయోధ్య రాముడి మీద టీఆర్ఎస్ శ్రేణులు చేసే ప్రచారం ఖచ్చితంగా ఆ పార్టీకి నెెగెటివ్గా మారుతోంది… ఐనాసరే, టీఆర్ఎస్ కేడర్ వదలడం లేదు… సాక్షాత్తూ కేసీయారే బీజేపీ మీద పోరాడలేక కత్తీడాలు కింద పడేసినా సరే, ఇంకా కేడర్ బీజేపీ మీద గుర్రుమంటూనే ఉంది… అయితే వరంగల్లో బీజేపీకి చాన్స్ ఇచ్చింది మాత్రం ధర్మారెడ్డే… బీజేపీలు వసూలు చేసే చందాలకు లెక్కాపత్రం ఏదీ లేదు అని తనే కెలికాడు… ఇక దొరికిండు అనుకుని బీజేపీ అందుకుంది… ఎంత రచ్చ జరిగితే దానికి అంత మేలు… అయోధ్య రాముడిని టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది అనే చర్చ జనంలోకి వెళ్లాలి, టీఆర్ఎస్ హిందుత్వ వ్యతిరేకిగా ముద్రవేయాలి… అదీ దాని ప్లాన్… వెళ్లి, వెళ్లి టీఆర్ఎస్ అందులో ఇరుక్కుంటోంది… టీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్లి బీజేపీ ఆఫీసు మీద పడ్డారు… లాఠీచార్జీలు, అరెస్టులు, ఓ లీడర్ ఆమరణదీక్ష… వరంగల్లో సెగ రగిలించారు… అయోధ్య విరాళాల పేరిట జనంలో తిరుగుతున్న బీజేపీ సంయమనం పాటించాలి నిజానికి… ఎందుకంటే ఆ గుడి విరాళాల సేకరణ రాజకీయం కోసం కాదు… దాని సంకల్పం వేరు, దాని ఉద్దేశం వేరు… కానీ బీజేపీ ఇలాంటి దాడులతో గాడితప్పిస్తోంది…
కేటీయార్ అనివార్యంగా ఓ ప్రకటన చేయాల్సి వచ్చింది… ‘‘ప్రజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపించాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ తీరుని ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాల్సిన అవసరం ఉన్నది… టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఓపిక నశిస్తే, బీజేపీ కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నా… బీజేపీ భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది… మా ఓపిక కి ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బీజేపీని హెచ్చరించాం… అయినా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకు పోతున్నాం… టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బీజేపీ మర్చిపోకూడదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం…’’ ఇదీ తన ఖండన… బహుశా ఇదే టెంపోతో బీజేపీ నుంచి కౌంటర్ స్టేట్మెంట్, ప్రతిఘటన రావచ్చు… ఇలా ఢిల్లీలోనేమో రాజీలు… ఫీల్డులో డిష్యూం డిష్యూం… క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ బీజేపిని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తోంది… అసహనం బయటపెడుతోంది… బీజేపీ కోరుకునేది కూడా అదే… అదే జరుగుతోంది… కాకపోతే ఈ అయోధ్య విరాళాల మీద గాకుండా బీజేపీని తిట్టిపోయడానికి బోలెడు అంశాలు దొరుకుతయ్… వాటిని వదిలేసి అయోధ్య విరాళాల మీదే వ్యతిరేక ప్రకటనలకు దిగుతున్నారు… కానివ్వండి, కానివ్వండి, తద్వారా రాజకీయ లబ్ధి పొందుతాం, వదిలేయబోం అంటున్నది బీజేపీ… ఫాఫం, మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లోలాగే కాంగ్రెస్ మాత్రం బ్లాంక్ ఫేసు పెడుతోంది…!
Ads
Share this Article