రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఈరోజుకూ బోలెడు సమస్యలున్నయ్… అవి చక్కదిద్దే అధికారి లేడు… ఆ ధరణి సైటు ఈతరంలో సెట్ అయ్యే అవకాశాల్లేవు… ఎంచక్కా ఆదాయం తీసుకొచ్చే సిస్టంను కుప్పకుప్ప చేసేశారు… దాన్ని పూర్తిగా పక్కన పెట్టలేరు, అది సరిగ్గా పనిచేయదు… పైగా ఎల్ఆర్ఎస్, బీపీఎస్, బీఆర్ఎస్ అంటూ రకరకాల క్రమబద్ధీకరణ పథకాల్ని తీసుకొచ్చి, కేసీయార్‌తో సంతకాలు పెట్టించి… చివరకు పల్లెల్లోని లేఅవుట్లకూ ఎల్ఆర్ఎస్ వర్తింపజేసి ఉన్నతాధికారులు కేసీయార్ మీద ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకతను సంపాదించి పెట్టారు… లక్కీగా దుబ్బాక, గ్రేటర్ అనుభవాలతో కేసీయార్ ఒకసారి వెనకాముందు చూసుకుని దిద్దుకోవడం స్టార్ట్ చేశాడు… స్టిల్, ఆ రెవిన్యూ సమస్యలు అలాగే ఉన్నయ్… తాత్కాలికంగా మాత్రమే సద్దుమణిగినట్టు కనిపిస్తున్నయ్… అవనూ, ఎవరైనా ఉన్నతాధికారులు కావాలనే కేసీయార్ మీద వ్యతిరేకత పెరిగేలా తనతో తప్పుడు నిర్ణయాలు ప్రకటింపజేస్తున్నారా..? దాన్ని కేసీయార్ గమనించలేకపోతున్నాడా..?
ఆమధ్య ఓ ఉన్నతాధికారిని కేసీయార్ వదిలించుకోబోతున్నాడు, తనపై కోపంగా ఉన్నాడు అని బోలెడు వార్తలు వచ్చినయ్… ఈరోజుకూ ఆయన కొలువు చెక్కుచెదరలేదు… కేసీయార్ అంత బలంగా నమ్ముతున్నాడా ఆయన్ని..? నిజంగా కేసీయార్ వెనుక ఏదో జరుగుతున్నదీ అనే డౌట్లు వచ్చేలా మరో నిర్ణయం రాబోతోంది… అదే ఖాళీ స్థలాలపై పన్ను వేస్తాడట… ఈ ఎల్ఆర్ఎస్ పంచాయితీ ఇంకా అలాగే ఉంది… లక్షల మంది 1000 చొప్పున డబ్బులు కట్టి, క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేశారు కదా… ఇప్పుడిక ఆ డేటా ఆధారంగా ఖాళీ స్థలాల పన్ను వేయడానికి రంగం సిద్ధమైపోతోంది… ఇప్పటికే భూయజమానులు కేసీయార్ మీద గుర్రుమంటున్నారు… దాన్ని పెంచుకోవడం కోసమేనా ఈ కొత్త కొత్త పన్నులు..?
Ads
ఇప్పుడు ఖాళీగా ఉన్న ప్లాట్ల పేరిట కూడా ప్రభుత్వానికి పన్ను చెల్లించాలట… ఎందుకు..? ప్లాటును ఖాళీగా ఉంచినందుకు..! అసలు భూమిని ఖాళీగా ఉంచడాన్ని నేరంగా భావించి జరిమానా వేస్తున్నట్టుగా ఉంది ఇది… పర్ సపోజ్, ఓ యాదగిరి ఓ ప్లాటు కొన్నాడు, అది తన ఉద్యోగ విరమణ అనంతరం ఆదుకునే ఆస్తి అనుకున్నాడు… అలా వదిలేశాడు… ఇప్పుడు తను టాక్స్ కట్టాలి… భవిష్యత్తులో ఎల్ఆర్ఎస్ కూడా తప్పదు… ఓ సమ్మయ్య ఒక ప్లాటు కొన్నాడు, పిల్ల పెళ్లికి అలా ఉంచేశాడు, పెళ్లి కుదిరితే అమ్మి పెళ్లి చేస్తాడు, లేదా అదే కట్నంగా ఇస్తాడు… నో, నువ్వు భూమి ఖాళీ ఉంచుతావా ట్యాక్స్ కక్కు అంటారట ఇప్పుడు… ఇళ్లు కట్టుకునే స్థోమత లేదు, అలాగని ప్లాట్లను వదులుకోలేరు, దాంతో ఇక భూమిని ఖాళీగా ఉంచావు నువ్వు అని ముద్రేసి, పన్నులు కక్కిస్తారా..? ప్రజల్లో ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత పెరిగే ఇలాంటి ఆలోచనల్ని ఎవరు ఇస్తున్నారు ఈ ప్రభుత్వానికి..?
ఎంచక్కా మార్కెట్ రేటుకు దగ్గరగా రిజిష్టర్డ్ వాల్యూ పెంచితే చాలు, బోలెడు ఆదాయం… అలా చేసుకోకుండా, ఊరూరికీ ఈ ఎల్ఆర్ఎస్ బాగోతాలు ఏమిటో..? ఈ వేకెంట్ లాండ్ టాక్సులేమిటో…? ఊరూరా ఆమధ్య ఆస్తుల సర్వే చేయించింది దీనికేనా..? దీన్ని ప్రజలు హర్షిస్తున్నారా..? ఇప్పుడు నోటీసులు రాగానే అందరూ ఏం చేయాలి..? అర్జెంటుగా నాలుగు కూరగాయ మొక్కలు, నాలుగు పూల మొక్కలు నాటి, ఫోటోలు తీసి వ్యవసాయం చేస్తున్నట్టు డిక్లరేషన్లు ఇవ్వాలా..? ఉచిత కరెంటు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసి, దాన్ని కూడా జతచేయాలా..? బోర్ తవ్వకానికి అప్లికేషన్ పెట్టాలా…? లేదా ఇంటి నిర్మాణ అనుమతి తీసుకుని, నెలకు ఒక ఇటుక పేర్చుకుని, వారెవ్వా, మా ప్రభుత్వానికి జేజేలు, మా కేసీయార్‌కు జైజైలు అని పాటలు పాడుకోవాలా..? అవునూ, ఇంతకీ కేసీయార్‌ను పెనం మీద నుంచి పొయ్యిలోకి నెట్టేస్తున్నది ఎవరు..?!
Share this Article