నవ్వొచ్చింది… ఆయనెవరో వెంకటేశ్వరరెడ్డి అనే లీడర్ సీఎం జన్మదినాన, అంటే వచ్చే 17వ తేదీన… భారీ ఎత్తున, అంటే భారీ బహిరంగ సభ తరహాలో… ఏకంగా ఎల్బీ స్టేడియంలో కేసీయార్ జన్మదిన వేడుకలు నిర్వహించబోతున్నాడట… నవ్వొచ్చింది దానికి కాదు… లీడర్ల కోసం అనుచరులు ఇలాంటి ‘కథలు పడటం’ కొత్తేమీ కాదు.., ఒకప్పుడు కేసీయార్‌కే ధమ్కీలు ఇచ్చిన తలసాని ఇప్పుడు కేసీయార్ ప్రతి బర్త్ డేను పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహిస్తుంటాడు… పాలిటిక్స్ అంటే అంతే… కానీ ఈ ఎల్బీనగర్ బర్త్ డే వేడుకల సందర్భంగా బ్రహ్మాండమైన యాగం నిర్వహించబోతున్నారట… మరి అందులో నవ్వొచ్చేది ఏమిటీ అంటారా..? ఈ దేశ నంబర్ వన్ ధనికుడికి చెందిన ప్రముఖ తెలుగు వెబ్సైటు ఏం రాసిందో యథాతథంగా చదవండి ఓసారి… ‘‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇదే చివరి పుట్టిన రోజు అవుతుందని భావిస్తున్న టీఆర్ఎస్ నేతలు.. ఈసారి ఆయన పుట్టినరోజు వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించాలని భావిస్తున్నారు. ఇక కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఆదిశ్రావణ యాగం నిర్వహించబోతున్నారు…‘‘‘ (ముఖ్యమంత్రి కేసీయార్ చివరి పుట్టినరోజు అని రాయడం దుర్మార్గం… ముఖ్యమంత్రిగా చివరి పుట్టినరోజు అవుతుందేమో, టెక్నికల్‌గా తప్పు కాదు కదా అంటారా..? కాకపోవచ్చు, కానీ అపశకునం ధ్వనించే ప్రమాదమే ఎక్కువగా ఉంది…)
ఇక్కడ రెండు మూడు విషయాలున్నయ్… కేసీయార్ చేస్తే సాదాసీదా యాగాలు ఉండవ్… అయుత చండీయాగం చేసినోడు, మొన్న బగాలాముఖి పూజలు చేయించాడు తప్ప ఇక చిన్నాచితకా యాగాల జోలికి పోవడం లేదు, పోడు… యాగాలు చేయించడంలో ఆయన రేంజ్ వీర లెవల్… ఇక ఆ లెవల్‌కు తగ్గడు… చేయిస్తే గీయిస్తే మళ్లీ యాదాద్రి ప్రారంభం సందర్భంగా ఏ సుదర్శన యాగమో చేయిస్తాడు… చిన జియ్యర్‌కు అదీ చేయించడం చేతకాదు కాబట్టి మళ్లీ ఎవరినో వేరేవాళ్లను ఆశ్రయించాల్సిందే… సరే, మరి ఈ లీడర్లు చెబుతున్న ఎల్బీనగర్ ఆదిశ్రావణ యాగం ఏమిటి స్వామీ అని ఏ అర్చక స్వామిని ప్రశ్నించినా నవ్వుతున్నారే తప్ప జవాబు ఇవ్వడం లేదు… చివరకు తాపీగా చెప్పారు… ఇప్పటివరకూ అలాంటి యాగం పేరు మేమే వినలేదు అని..!
Ads
మరి ఎవరూ వినని ఆ యాగాన్ని ఎవరు చేయిస్తున్నారు..? నో డౌట్… అలాంటివాటికి కేసీయార్ స్వయంగా హాజరు కాడు… ఆయన పేరిట ఎవరైనా చేయించుకుంటే అది వాళ్ల ఇష్టం… కేసీయార్ ఒక పూజ, ఒక యాగం తను స్వయంగా చేయించాలంటే తను చాలా లెక్కలు చూస్తాడు… ఆ లెక్కల మేరకు సిన్సియర్‌గా చేస్తాడు… మొన్న శత్రువిజయం కోసం వామాచార పద్ధతిలో, రహస్యంగా నిర్వహించిన బగాలాముఖి పూజ నిజానికి మామూలుగా మనం చూసే యాగాలకు పూర్తి రివర్స్ పూజ… పూజ చివరలో అవశేషాల్ని తీసుకుని, విహిత పద్ధతిలో నదీప్రవాహంలో నిమజ్జనం కోసం సతీసమేతంగా కాలేశ్వరం వెళ్లాడు… అయితే తరువాత కేసీయార్ భార్య శోభ, బిడ్డ కవిత, మరికొందరు మహిళా కుటుంబసభ్యులు ప్రత్యేకంగా వారణాసి వెళ్లారు… దేనికి వెళ్లారనేది చాలామంది అర్చకులకే అంతుచిక్కని లెక్క…
వారణాసి వెళ్లిన టీం ఏ హరిశ్చంద్ర ఘాట్‌కో, అస్సి ఘాట్‌కో వెళ్లి, గంగ నీళ్లు నెత్తిన జల్లుకుని, విశ్వనాథుడిని దర్శించుకుని రాలేదు… ఎక్కువగా ఎవరూ వెళ్లని దశాశ్వమేధ ఘాట్ వెళ్లారు… సంకటమోచన హనుమాన్ గుడికి వెళ్లారు… ఎవరి సూచనల మేరకు, ఏ పూజా విశేషం కోసం ఈ పర్యటన సాగిందో తెలియదు గానీ… ఈ ఎల్బీనగర్ యాగం సంగతేమిటీ అంటారా..? ఆదిశ్రావణం లేదు, సోమశ్రావణం లేదు… బహుశా ఆయుష్ యాగం కావచ్చు… ఒక మనిషి ఆరోగ్యాన్ని, ఆయుష్షును కాంక్షిస్తూ చేసే యాగం… చాలామంది ధనికులు తమ, తమ కుటుంబసభ్యుల బర్త్ డేల సందర్భంగా చేయిస్తూ ఉంటారు… అకస్మాత్తుగా ఈ బగాలాముఖి పూజలు ఏమిటి..? ఈ ఆయుష్ యాగాలేమిటీ అంటారా..? ఏమో, ఆరోగ్యం అంత బాగా లేదేమో మరి..!!
Share this Article