విశాఖ ఉక్కును వంద శాతం ప్రైవేటీకరించాలనేది కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్… కేంద్ర ప్రభుత్వ ఆలోచన, అడుగులు కూడా అవే… అది జస్ట్, ఒక ఫ్యాక్టరీ కాదు… చాలా ఉద్వేగాలు దానిచుట్టూ అల్లుకుని ఉన్నయ్… అనాలోచితంగా దాని జోలికి పోతే ఫర్నేసులో తలకాయ పెట్టినట్టే… అయితే రెండు ప్రధాన రాజకీయ పక్షాల్లో తెలుగుదేశం ఎటూ మాట్లాడలేని దురవస్థ… స్వతహాగా చంద్రబాబు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, కొలువుల కోతలంటే దూకుడుగా ముందుకెళ్లే కేరక్టర్… 2004 వరకూ చూశాం కదా… ఒకవేళ ఇప్పుడు పొలిటికల్ ఫాయిదా తీసుకోవాలి అనుకున్నా సరే, కేంద్రంలోని బీజేపీ మీదకు అగ్రెసివ్‌గా వెళ్లే సీన్ లేదు… సో, తెర వెనుక ఏమైనా చేయాల్సిందే తప్ప, తెర మీదకు వచ్చి ఉక్కు యుద్ధాలు చేసేంత సీన్ కనిపించడం లేదు…
ఇక వైసీపీ… తను రాజకీయంగా ఇరకాటంలో పడింది… తన ప్రతిపాదనలతో కేంద్రం అలాగే మొండిగా వెళ్తే ఏం చేయాలి..? తను మోడీతో ఫైట్ చేసే సీన్ ప్రస్తుతానికి లేదు… ఈ విషయంలో జగన్, చంద్రబాబు సేమ్‌టుసేమ్… అటు మోడీ సర్కారు సంగతి చూద్దామంటే… ప్రభుత్వ రంగ సంస్థల్ని అడ్డికిపావుశేరు చొప్పున కార్పొరేట్లకు కట్టబెట్టే సంకల్పసిద్ధులు… వాళ్లకు విశాఖ ఉక్కు అయినా ఒకటే… ఎల్ఐసీ, ఎయిర్ ఇండియా, బీఎస్ఎన్ఎల్, గెయిల్ కూడా ఒకటే… నిర్లిప్తంగా ఉండటం జగన్‌కు కుదరదు… విశాఖ ఉక్కును కాపాడటానికి ఏం చేశాడనే ప్రశ్న రాజకీయంగా తీవ్ర నష్టం తీసుకొస్తుంది… పైగా ఈ మొత్తం బాగోతం వెనుక జగన్ అండ్ బ్యాచ్ ఉన్నారనే ఆరోపణల్ని ఆల్రెడీ విశాఖ పరిరక్షణ ఉద్యమకారులు మొదలుపెట్టేశారు… ప్రత్యేకించి ఆదానీకి మోడీ, జగన్ ఇద్దరూ సన్నిహితులే… అందుకని వెంటనే మంత్రి గౌతమ్ రెడ్డి ద్వారా ‘‘అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే విశాఖ ఉక్కును తీసుకుంటుంది’’ అని జగన్ ఓ ప్రకటన ఇప్పించాడు…
వాస్తవానికి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ రికార్డుల్లో ఉండే ఆస్తి విలువ వేరు, మార్కెట్ విలువ వేరు… అక్కడే ఈ లావాదేవీలు, అమ్మకం ప్రయత్నాల్లో భారీ స్కాములు చోటుచేసుకుంటాయి… విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ భూముల విలువే లక్ష కోట్ల పైన… ఫ్యాక్టరీని స్క్రాపుగా అమ్ముకున్నా బోలెడు సంపద… కానీ ఏపీ ప్రభుత్వానికి దాన్ని ఓన్ చేసుకుని నడిపించే సీన్ ఉందంటే నమ్మడం కష్టం… దానికి కేప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ లేవు, కోల్ లేదు, ప్రతిదీ మార్కెట్లో కొనాలి… పోటీ స్టీల్ ప్లాంట్లతో పోలిస్తే ఇదే పెద్ద శాపం… సో, రాజకీయంగా తను కార్నర్ కాబోతున్నాడనే విషయం అర్థమై జగన్ మోడీకి ఓ లేఖ రాశాడు… అయ్యా, సారూ… ప్రైవేటీకరణ వద్దు, కాస్త కరుణించండి మహాప్రభో… ఈ సూచనలు పాటించి, దాన్ని ఉద్దరించండి అనేది దాని సారాంశం… ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్మడమే పాలసీగా వ్యవహరించే మోడీ ప్రభుత్వం దీన్ని పాటిస్తుందా లేదా చూడాలి… మరి ఏమిటి ఆ సూచనలు… (ఫ్యాక్టరీ లాభనష్టాలపై… అప్పుల పరిమాణంపై, పేరుకున్న నష్టాలపై భిన్నమైన లెక్కలున్నయ్… వాస్తవం ఏమిటో యాజమాన్యానికే తెలియాలి…)
Ads
- ప్రస్తుతం స్టీల్ రంగం క్రమంగా కోలుకుంటున్నది కాబట్టి చేయూతనిస్తే ఈ ఫ్యాక్టరీ కూడా లాభాల్లో పడుతుంది…
- ఈ రంగంలో ఉన్న ఇతర సంస్థలతో విశాఖ స్టీల్ ప్లాంట్ పోటీ పడే విధంగా సొంత గనులు కేటాయించాలి. ఇది ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఒడిషాలో ఒక ఇనుప ఖనిజం గని ఉంది. అది సంస్థ పునరుద్ధరణలో ఎంతో దోహదకారిగా నిలుస్తుంది…
- సంస్థ స్వల్పకాలిక, దీర్ధకాలిక రుణాలను ఈక్విటీలుగా మార్చడం వల్ల సంస్థపై రుణాలు తిరిగి చెల్లించే ఒత్తిడి తగ్గించడంతో పాటు, రుణాలపై వడ్డీల భారం కూడా తగ్గుతుంది…
- ఆ రుణాలను బ్యాంకులు ఈక్విటీలుగా మారిస్తే, వడ్డీ భారం పూర్తిగా పోవడంతో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్, విశాఖ) కూడా స్టాక్ ఎక్సేంజీలో లిస్ట్ అవుతుంది. ఆ ప్రక్రియతో స్టాక్ మార్కెట్ ద్వారా ప్రజల నుంచి నిధుల సేకరణకు అవకాశం కూడా ఏర్పడుతుంది.
పైపైన స్థూలంగా చూస్తే జగన్ సూచనలు వర్కబుల్ అనిపిస్తుంది… కానీ బ్యాంకు రుణాల్ని వాటాలుగా మార్చడం, కేప్టివ్ మైన్స్ కేటాయించడం అనుకున్నంత ఈజీగా సాగే యవ్వారం ఏమీ కాదు… పైగా ఒకవేళ మోడీ ప్రభుత్వం ఓ పాలసీగా ఒక్కో ప్రభుత్వరంగ సంస్థలనూ అమ్మేస్తున్నట్టే, దీన్ని కూడా ఖతం చేయాలనే సంకల్పంతో ఉంటే… జగన్ సూచనల్ని మోడీ ఎంతవరకు పట్టించుకుంటాడనేది ప్రశ్నే… నిజంగానే తెర వెనుక బాగోతం ఏదీ లేకపోతే జగన్ సూచనల్ని అమలు చేయడానికి మోడీ ప్రయత్నించాలి… కానీ తన మనస్తత్వం వేరు, ఇలాంటి అంశాల్లో ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగానే వెళ్తుంటాడు తను… నోట్ల రద్దు నుంచి, ఇంధనం ధరల నుంచి, డొల్ల ఆత్మనిర్భరాల నుంచి ఈ పీఎస్‌యూల అమ్మకం దాకా తన వ్యవహార ధోరణి చూస్తుంటే… జగన్ లేఖకు పెద్దగా పాజిటివ్ స్పందన ఆశించడం కష్టమే… ‘‘విభజన చట్టం మేరకు మాకు ఓ స్టీల్ ప్లాంటు ఇవ్వాలి కదా, ఈ ప్లాంటు అప్పులు మీరు భరించి, మాకు ఇవ్వండి’’ వంటి మంత్రి గౌతమ్ ప్రకటనలు మోడీకి ఒక్క ముక్క కూడా ఎక్కవు… మరి జగన్ ఏం చేయబోతున్నాడు..?!
Share this Article