పెట్రోల్ గంగా జలం!
——————–
అరవై ఏళ్ల కిందటి తెలుపు నలుపు చిత్రం గుండమ్మ కథ. తెలుగు సినిమాకు శాశ్వత పరిమళ గంధాన్ని అద్దిన చిత్రం. విలువల వలువలు కట్టిన చిత్రం. ప్రతి పాటలో సంగీత సాహిత్యాలు తెలుగు తేనెలు చిలికిన చిత్రం. అందులో హాస్య నటుడు రమణా రెడ్డి చేత మాటల రచయిత డి వి నరసరాజు చెప్పించిన మాట-
“పాలల్లో నీళ్లు కాక, పెట్రోల్ కలుపుతారా? చిక్కటి పాలు తాగితే అరగక కడుపు మందంతో చచ్చిపోరూ?”
Ads
ఒక హోటల్లో పాలు పొసే ముందు ఆ పాల క్యాన్లో వీధి కొళాయిలో నీళ్లు కలిపే సన్నివేశంలో మాట ఇది. పాలల్లో నీళ్లు కలపడం అనాదిగా ఉన్నట్లుంది. అందుకే పాలు- నీళ్లలా కలిసిపోవాలని సామెత పుట్టింది.
కొన్ని కలిస్తే అందం. ఆరోగ్యం. కొన్ని కలిస్తే వికారం. అనారోగ్యం. అనర్థం. పాలల్లో నీళ్లు కలపడాన్ని సమర్థించుకున్నాడు రమణా రెడ్డి. పాలల్లో పెట్రోల్ కలపకూడదని మాత్రం ఖచ్చితంగా చెప్పాడు. ఈ మాటనే పెట్రోల్ బంకులవాళ్లు పరమ ప్రమాణంగా తీసుకున్నట్లున్నారు. పెట్రోల్లో నీళ్లు కలుపుతున్నారట. కాకపోతే నేరుగా కాదు. పెట్రోల్లో పది శాతం ఇథనాల్ కలపడానికి అధికారికంగా అనుమతులేవో ఉన్నాయి. ఆ ఇథనాల్లో బాగా నీళ్లు కలుపుతున్నారు. దాంతో నెమ్మదిగా వాహనాల ఇంజన్లు తుప్పు పడుతున్నాయట.
పైకి ఇదంతా మోసం, మాయ, కుట్రలా వినియోగదారుడిని నిలువునా ముంచడంలా కనిపిస్తుంది. లోతుగా చూస్తే అనేక శాస్త్రీయ, ఆర్థిక, హార్దిక, తాత్విక విషయాలు దాగి ఉన్నాయి.
1. మనిషి దాహం తీర్చేది నీరు. వేడెక్కిన వాహనాల దాహం ఎవరు తీర్చాలి? దాంతో ప్రకృతి సహజంగా, అసంకల్పితంగా వాహనాలు నీటిని కోరుకున్నాయి.
2. రోగి పాలే కోరాడు. వైద్యుడు పాలే చెప్పాడు. వాహనం నీళ్లే కోరింది. పెట్రోల్ బంక్ వాడు నీళ్లే పోశాడు.
3. పెట్రోల్ ద్రవం. నీళ్లు కూడా ద్రవమే. పళ్లూడగొట్టుకోవడానికి ఏ రాయయితే ఏమి? ట్యాంక్ లో పోయడానికి ఏ ద్రవమయితే ఏమి?
4. శుభ్రమయిన నీరే సకల ప్రాణికోటికి ఆధారం. ఆరోగ్యం. వాహనాలకయినా అంతే.
5. ఇంజన్ తుప్పు పట్టకుండా ప్రత్యేకమయిన అల్యూమినియం లోహంతో తయారు చేస్తారు. పిస్టన్ ఒరిపిడిలో లోహం అరగకుండా కందెన వేస్తారు. దాంతో ఇరవై ఏళ్లయినా ఇంజన్ పని చేస్తూ ఉంటుంది. నీళ్లు తగలడం వల్ల ఇంజన్ తుప్పు పట్టి వెంటనే ఆగిపోతుంది. చెడిపోతుంది. దాంతో మనం కొత్త వాహనం కొంటాం. వాహనాల తయారీదారులు పెట్రోల్ బంకులవాళ్లు ఇలా కుమ్మక్కయ్యారని అనుమానిస్తే మన కళ్లు పోతాయి. ఇదొక అసంకల్పిత జల ఇంధన మిశ్రమ రసాయన ప్రతి చర్య- అంతే.
6. డాక్టరు కత్తితో గుండెను కోస్తే వైద్యం. మనం కత్తి పట్టి గుండెను కోస్తే హత్య. పెట్రోల్ బంకువాడు నీళ్లు కలిపితే శాస్త్రం. మనం కలిపితే కుశాస్త్రం.
7. పెట్రోల్లో ఇథనాల్ కలుస్తుందని, ఆ ఇథనాల్లో నీళ్లు కలుస్తాయని ఎందరికి తెలుస్తుంది? ఇప్పటికి తెలిసింది ఇది. పెట్రోల్లో ఇంకా ఎన్నెన్ని కలిసి ఉన్నాయో భవిష్యత్తులో తెలియకపోవు.
8. పెట్రోల్ రేట్లు గంట గంటకు ఎందుకు పెరుగుతున్నాయో ఇన్నేళ్లకు తెలిసింది. డిస్టిల్డ్ వాటర్ చాలా అమూల్యమయినవి. ప్రియమయినవి. అంత విలువయిన జలం కలపాలి కాబట్టి- పెట్రోల్ రేటు పెంచక తప్పడం లేదు.
9. లీటరు పెట్రోల్లో పది శాతం ఇథనాల్లో నాలుగు చుక్కల గంగా జలానికే ఇంత రేటు ఎందుకు? అన్న ప్రశ్నకు విలువ ఉండదు. ఎందుకంటే- గంగకు విలువ కట్టలేము కాబట్టి……. By………. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article