నానో శాటిలైట్… అంటే మరీ సూక్ష్మ ఉపగ్రహం… వచ్చే 28న ఇస్రో ప్రయోగించబోయే ఓ రాకెట్ ద్వారా పలు ఉపగ్రహాలతోపాటు అది కూడా కక్ష్యలోకి వెళ్లబోతోంది… సో వాట్ అంటారా..? ఉంది..! దీని పేరు సతీష్ ధావన్ నానో శాటిలైట్… గుడ్, భారతీయ స్పేస్ రీసెర్చ్ విషయంలో గొప్ప పేరు, ఆ పేరు పెట్టుకోవడంలో తప్పులేదు… ఇది స్పేస్ కిడ్స్ అనే సంస్థ ప్రయోగించబోయే రెండో ఉపగ్రహం… గతంలో కూడా కలాంశాట్ పేరిట ఓ నానో శాటిలైట్‌ను పంపించింది… ఈసారి మోడీ ఫోటోను ఈ ఉపగ్రహం మోసుకుపోతుందట కక్ష్యలోకి..! ఆయన ఫోటోతో ఫాయిదా ఏమిటి..? విధేయత ప్రకటన…! బిస్కెట్..!! సరే, పోనీ, ఎవరి తిప్పలు వాళ్లవి, మార్కులు కొట్టేయడంలో…! ఉపగ్రహం దిగువ భాగంలో ఇస్రో చైర్మన్ శివన్, సైంటిఫిక్ సెక్రెటరీ ఉమామహేశ్వరన్ పేర్లు రాస్తారట… ఇదీ వోకే… మరి వాళ్లు సహకరించకుండా శాటిలైట్ పంపించడం ఎలా..? కృతజ్ఞత ప్రకటన అన్నమాట…! ఒక భగవద్గీతను పంపిస్తారట… వోకే, కొన్ని విదేశీ ఉపగ్రహాలు బైబిల్‌ను తీసుకుపోవడం అలవాటే… వీళ్లూ అదే స్పూర్తిగా తీసుకున్నారనుకుందాం… ఇస్రోయే రాకెట్ నమూనాను చెంగాళమ్మ తల్లి ఎదుట పెట్టి పూజలు చేస్తుంటే, ఈ భగవద్గీత పంపించడంలో పెద్ద కథేముంది..? ఎవరి నమ్మకం వాళ్లది… గుడ్…
ఎటొచ్చీ విస్మయాన్ని కలిగించింది ఏమిటంటే..? 25 వేల పేర్లను అంతరిక్షంలోకి పంపించడం..! పేర్లు పంపిద్దాం అనుకున్నారట, నెట్లో అడిగారట… వారం రోజుల్లో 25 వేల మంది తమ పేర్లు పంపించారట… అందులో 1000 మంది విదేశీయులట… సదరు సంస్థ బాధ్యుడు గొప్పగా చెబుతున్నాడు… పేర్లదేముంది..? ఓ స్కూల్ వాళ్లు తమ పిల్లల పేర్లన్నీ ఇచ్చారు… అది ఓ పెద్ద కథ కాదు కదా… అసలు పేర్లను అంతరిక్షంలో పంపించడం ఓ పెద్ద టాస్క్‌గా చెప్పుకోవడమే నవ్వొచ్చేది… అసలు దీని వల్ల ఫాయిదా ఏముంది..? ‘‘అంతరిక్ష శాస్త్రంపై అవగాహన పెరగడానికి’’ అంటాడు ఆ పెద్ద మనిషి… నానో శాటిలైట్ ఉపయోగాలు, తయారీకి పెట్టిన ఎఫర్ట్, రాబోయే తరం ఉపగ్రహాలు గట్రా బోలెడు కొత్త పరిజ్ఙానాన్ని తమ సైట్ ద్వారా పంచుకుంటే సరిపోదా ఏం..? నిజానికి స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలను కూడా భాగస్వాములను చేస్తూ నానో శాటిలైట్ రూపొందించింది సంస్థ… మంచి పేరే ఉంది దీనికి… కానీ మరీ ఈ పేర్లు పంపించడం వంటి ఫాయిదా లెస్ పనులు దేనికో, పిల్లలను ఇలాంటి ఆనవాయితీల వైపు అలవాటు చేయడం దేనికో దానికే తెలియాలి… సర్లెండి, మనిషికో పిచ్చి, సంస్థకో పైత్యం…
Ads
న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ పేరిట ఓ పబ్లిక్ సెక్టార్ యూనిట్ రూపొందించి, రాకెట్ ప్రయోగాల్ని పూర్తిగా ఓ కమర్షియల్ ఆపరేషన్‌గా మార్చేసిన తరువాత జరగబోతున్న మొదటి ప్రయోగం ఇది… అదీ అసలు విశేషం… మరో ఉపగ్రహం గురించి కూడా చెప్పుకోవాలి నిజానికి… దాని పేరు ఆనంద్… ఇది ఓ స్టార్టప్ కంపెనీ… తనూ ఓ ఖగోళ పరికరాన్ని పంపించబోతోంది… అడవుల్లో కార్చిచ్చులు… గ్యాస్, వాటర్ లీకేజీలు, పంట తెగుళ్లు, పొల్యూషన్ లెవల్స్ కనిపెట్టాలనేది తమ లక్ష్యమని చెబుతున్నా సరే… అది నమ్మబుల్‌గా ఏమీ లేదు… ఇంకేదో ప్రయోజనముంది… ఇలాంటివి 30 పరికరాల్ని పంపించి, అనుసంధానం చేసి, భూగోళం మొత్తమ్మీద నిఘా వేస్తామని చెబుతున్నా అదీ రిలయబుల్ కాదు… కొన్ని బయటికి చెప్పబడని ప్రయోజనాలుంటయ్… అలాంటివాటిల్లో ఇదీ ఒకటి…!!
Share this Article