ఎన్నికలన్నాక ఓసారి గెలవొచ్చు, మరోసారి ఓడిపోనూ వచ్చు… వరుసగా గెలుస్తూ వస్తున్న సీటులో కూడా ఒక్కోసారి పల్టీ కొట్టొచ్చు… చాలా కామన్… అయితే అనుకోని విజయాలు ఎలా వార్తల్లోకి ప్రధానంగా వచ్చేస్తాయో… కొన్ని అపజయాలు కూడా అలాగే చర్చకు వస్తాయి… ఎస్, పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ ఓడిపోతే అది పెద్ద వార్తే… ఒక సిద్దిపేటలో హరీష్రావు ఓడిపోతే అది పెద్ద వార్తే… హైదరాబాదు ఓల్డ్ సిటీలో ఒవైసీ ఓడిపోతే కూడా పెద్ద వార్తే అవుతుంది… అలాగే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే కూడా పెద్ద వార్తే… అది ఎంపీ సీటో, ఎమ్మెల్యే సీటో కాదు… ఆ ఏరియాల్లో ఏ ఎన్నికలు జరిగినా ఆ గ్రిప్ కంటిన్యూ అవుతుందా లేదా అని చూస్తారు పరిశీలకులు… సదరు నాయకుడి బలాన్ని మళ్లీ అంచనాలు వేస్తారు, కారణాలు వెతుకుతారు… ఇప్పుడు కుప్పం నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్నది అదే…
కుప్పం నియోజకవర్గం అంటేనే చంద్రబాబుకు పెట్టనికోట… అక్కడ తనను ఓడించడానికి గతంలో కాంగ్రెస్ ఎప్పుడూ సీరియస్ ఎఫర్ట్ ఏమీ పెట్టలేదు… కానీ జగన్ గత రెండు దఫాల్లోనూ కుప్పం మీద కాన్సంట్రేట్ చేశాడు… కానీ ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలుపును ఆపలేకపోయాడు… కానీ కుప్పంలో బాబును ఓడించాలనే ఓ నైతిక తృప్తి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో దక్కింది జగన్కు… మొత్తం 89 పంచాయతీలకు గాను 74 పంచాయతీలను వైసీపీ ఎగరేసుకుపోయింది… కేవలం 14 పంచాయతీలతో టీడీపీ చతికిలపడిపోయింది… దీనివల్ల రాజకీయంగా చంద్రబాబుకు తక్షణం వచ్చే నష్టం ఏమీ లేదు గానీ… పరువు పోయినట్టయింది… రాజకీయంగా మరో సెట్ బ్యాక్ అనే ముద్రపడింది… చివరకు తన సొంత స్థానంలోనూ జనం చంద్రబాబును నమ్మడం లేదని ప్రచారం చేయడానికి వైసీపీకి ఓ చాన్స్ దొరికింది… ఆల్రెడీ చంద్రబాబు మీద వైసీపీ నేతలు వెటకారాలు, వ్యాఖ్యలు, విమర్శలు స్టార్ట్ చేశారు… ఇక సోషల్ మీడియా చెప్పనక్కర్లేదు… అసలే జగన్ ఫ్యాన్స్, తెలుసు కదా…
Ads
అబ్బే, ఈ ఫలితాలేమైనా చంద్రబాబు పట్ల జనాదరణకు ఏమైనా సంకేతమా..? పంచాయతీ ఎన్నికలు ఎప్పుడూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయి అని ఎవరైనా వాదిస్తే అది అర్ధసత్యమే అవుతుంది… ప్రతిసారీ అలా జరగాలని ఏమీలేదు… అంతెందుకు..? చంద్రబాబే చెబుతున్నాడు కదా… మేం పుంజుకున్నాం, వైసీపీకి పోటాపోటీ ఇస్తున్నాం, ప్రజల్లో మార్పు మొదలైంది అని..! అంటే స్థానిక ఎన్నికల్లోఆశించినదానికన్నా నాలుగు సర్పంచి స్థానాల్ని ఎక్కువ గెలిస్తే, అది ప్రజల్లో మార్పుకు సంకేతం అయినప్పుడు… కుప్పంలో అంత దారుణంగా ఓటమిని ఎదుర్కోవడం కూడా టీడీపీ పట్ల ప్రజల వ్యతిరేకత ఇంకా పెరుగుతోంది అనడానికి సంకేతమని అంగీకరించినట్టేనా..?! నిజానికి కుప్పంలో ఓటమిని ఏ కోణంలోనూ, ఏ పడికట్టు పదాల్లోనూ బాబు సమర్థించుకోలేడు… కష్టం… అందుకే టీడీపీ క్యాంప్ సైలెంట్ అంతెందుకు..? తన పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి కవరేజీ ఓసారి పరిశీలిస్తే… ఆంధ్రజ్యోతి అసలు ఆ వార్త జోలికే వెళ్లలేదు… అదంతే తనకు నచ్చని పరిణామాన్ని రిపోర్ట్ చేయదు… వార్తను వార్తలాగా రాయాలి కదా అంటారా..? ఆంధ్రజ్యోతి అలాంటి ఏ ప్రమాణాల్లోనూ ఇమడదు… యజమాని ఇష్టం, పాత్రికేయ ప్రాప్తం… అంతే… ఈనాడు వైసీపీ వ్యాఖ్యల్ని సంక్షిప్తంగా రాసుకుని, చేతులు దులిపేసుకుంది… ఏమాటకామాట… సాక్షి కవరేజీ కూడా పరమ పేలవంగా.., ఆఁ ఏదో మావాళ్లు గెలిచారటలే అన్నట్టుగా రాసుకుంది… అది మరోరకం తిక్క..!!
Share this Article