‘‘ఆ నిందితులు ఎంతటి వారైనా సరే, ఎంత ఒత్తిడి వచ్చినా సరే… ఒక్క లాయర్ కూడా వాళ్ల బెయిల్ కోసం గానీ, వాళ్ల తరఫున గానీ వాదించకూడదు… ఒకవేళ వాదిస్తే ఆయా బార్ అసోసియేషన్లు వారిని బహిష్కరించాలి… ఈ సవాల్‌కు లాయర్ల సంఘాలు సిద్ధమేనా..?’’ ఈ వాక్యం ఎక్కడో కనిపించింది… సూటి ప్రశ్న… అది సరైన డిమాండేనా, కాదా అనే చర్చను వదిలేస్తే…! అసలు లాయర్ల వృత్తి ఏమిటి..? నిందితుడైనా సరే, నిర్దోషులైనా సరే వాళ్ల తరఫున కోర్టుల్లో వాదిస్తారు… అంతిమ తీర్పు చెప్పాల్సింది కోర్టులు… అలాంటిది ఇక లాయర్లనే నరుక్కుంటూ పోతే, అది ఏ అరాచకానికి దారితీయబోతోంది…? పైగా ఈ సంఘటనలో హంతకులు, సూత్రధారులు అధికార పార్టీ నేతలు… అందుకే లాయర్ల భయంలో, వారి ఆందోళనలో న్యాయం ఉంది… అందుకే ఆ కిరాతక సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా లాయర్లు ఉద్యమిస్తున్నారు… వామనరావు, నాగమణి దంపతుల పాశవిక హత్య తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది… జాతీయ స్థాయిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా తీవ్రంగా ఖండించింది… నిష్పాక్షిక దర్యాప్తు జరిగే పరిస్థితులు లేనందున స్వతంత్ర దర్యాప్తు కావాలని అడుగుతోంది… తెలంగాణ పోలీసులకు నిజంగా ఇది ఓ పరీక్ష… ఎందుకంటే..?
భయానకంగా, బీభత్సంగా ఉన్న ఈ ఫోటోను వాడుతున్నందుకు క్షమించాలి… కానీ తీవ్రత అదే… హైకోర్టు కూడా సూమోటోగా కేసు టేకప్ చేసింది… ప్రభుత్వ విశ్వసనీయత పట్ల సందేహాల్ని వ్యక్తం చేస్తూ ఫలానా తేదీలోపు కేసు పూర్వాపరాలు, తీసుకున్న చర్యలపై నివేదిక అడిగింది… కొన్ని సీరియస్ కామెంట్సే… హెచ్చార్సీ సీరియస్ అయ్యింది… తెలంగాణ సమాజంలోనూ ఈ న్యాయవాదుల హత్య పట్ల తీవ్ర ఆగ్రహం, వాళ్ల మీద సానుభూతి వ్యక్తమవుతున్నయ్… ఈ హత్యల వెనుక ఉన్న ఓ టీఆర్ఎస్ మండల స్థాయి నాయకుడు, పుట్టా మధు అనుచరుడు, కుంట శ్రీనివాస్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు… పుట్టా మధు ప్రమేయం, పాత్ర మీద ఆధారాలు దొరికినట్టు కూడా మీడియా లీకులు వినిపిస్తున్నయ్… మధు మేనల్లుడు బిట్టు శ్రీను కారునే హంతకులు వాడారు, కానీ ఎఫ్ఐఆర్లో తన పేరెందుకు లేదని మీడియా ప్రశ్నిస్తోంది… పోలీసులు ఏదో ఊరిలో పంచాయితీలు, వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన హత్య అని చెబుతున్నారు… మంథని ఏరియాలో వామనరావు వాదిస్తున్న కేసులు, టీఆర్ఎస్ ముఖ్యుల ట్రాక్ రికార్డు తెలిసినవాళ్లెవరూ దీన్ని నమ్మడం లేదు… ప్రజాగ్రహం గమనించిన టీఆర్ఎస్ సదరు హంతకుడిని సస్పెండ్ చేసింది… నిజానికి పార్టీ నుంచి బహిష్కరించాల్సింది… ఈ సంఘటనలో మావాళ్లున్నా, ఎవరున్నా ఏమాత్రం ఉపేక్షించబోం అనే ఓ స్పష్టమైన ప్రకటన అధికార పార్టీ నుంచి రావల్సింది… కానీ చిన్న చిన్న అంశాలకే గాయిగత్తర అలవాటైన పార్టీ ముఖ్యులందరూ సైలెంట్ గా ఉన్నారు దేనికో..? తద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నది పార్టీ..?! అన్నింటికీ మించి కేసీయార్ తన పాలసీని ఓసారి సమీక్షించుకోవాలి… అదేమిటంటే..?
Ads
పాలన వ్యవహారాలకు సంబంధించి తమ ఎమ్మెల్యేలే తమ నియోజకవర్గాల్లో సుప్రీం అనే ధోరణి… వెనకేసుకురావడం, చివరకు పోలీసులను కూడా వాళ్లు కోరినట్టే బదిలీలు చేయడం, నియమించడంతో ఏం జరుగుతోంది..? పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలు, ఎమ్మెల్యేలు అమిత బలసంపన్నులైపోయారు… పోలీసులు వాళ్లకు అనివార్యంగా ప్రైవేటు బలగాల తరహాలో మారిపోతున్నారు… ఎక్కడికక్కడ నయా సంస్థానాలు ఏర్పడుతున్నయ్… ఇది అనేక విపరిణామాలకు దారితీయబోతున్నది… లాయర్ల జంట హత్యపై కేసీయార్ నుంచి చాలా సీరియస్ రియాక్షన్ కనిపిస్తేనే, అది మొత్తం తన పార్టీ నాయకులకు ఓ స్పష్టమైన సంకేతం ఇచ్చినట్టు అవుతుంది… ఇలాంటి క్రిమినల్ నేచర్ ఉన్న నేతల్ని నా పార్టీ సహించదు అనే ఓ స్పష్టత తెలంగాణ సమాజానికి కూడా ఇచ్చినట్టయ్యేది… కానీ ఈ ప్రయత్నమేమీ కనిపించడం లేదు…
ఈ లాయర్ల దంపతులు హంతకులకు, వారి సపోర్టర్లకు ఏయే కేసుల కారణంగా సీరియస్ టార్గెట్ అయ్యారనే చర్చలోకి ఇక్కడ వెళ్లడం లేదు… అనేక కారణాలుండొచ్చు, పలు కేసుల్లో ఈ జంట వాదిస్తున్నందువల్ల, కొన్ని కేసులు వాళ్లే వేసినందువల్ల తమకు శిక్షలు తప్పవనే అంచనాకు, తమ పునాదులు కదులుతున్న సందేహాలకు వచ్చినట్టున్నారు నేరస్థులు… వామనరావు దంపతులు ప్రశ్నించేవాళ్లు, ప్రశ్నించేవాళ్ల తరఫున వాదించేవాళ్లు… అందుకే ఏ నేర సామ్రాజ్యానికి టార్గెట్ అయ్యారు… వాళ్లెవరు..? అసలు వాళ్లు వాదిస్తున్న కేసులేమిటి..? వాటి కథేమిటి..? వాటినీ తవ్వాల్సిన అవసరముంది..? అప్పుడే ఈ హత్యలకు అసలు కారకులు పట్టుబడతారు… పెద్ద డొంకే బయటపడుతుంది… అందుకని దీన్ని కేవలం ఓ జంట హత్య కేసులాగా పరిగణిస్తే చాలదు… దీని విస్తృతి అధికంగా కనిపిస్తోంది… నాలుగు రోజుల హడావుడి, తరువాత సైలెన్స్ అన్నట్టు గాకుండా… న్యాయవాదుల సంఘాలే దీన్ని ఓ లాజికల్ ఎండ్ వైపు పుష్ చేయాలి…!!
Share this Article