సంస్కృతంలో విశాఖదత్తుడి “ముద్రా రాక్షసం” బాగా పేరు ప్రఖ్యాతులు పొందిన కావ్యం. దాదాపు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం నాటి రచన. అనేక భారతీయ భాషల్లోకి అనువాదమయ్యింది. కొన్ని వాస్తవిక ఘటనలు, కొంత కల్పనతో అల్లిన కావ్యమది. తెలుగు పలచపడి, సంస్కృతం అంటరానిది అయ్యింది కాబట్టి ఆ కావ్యంలో గొప్పదనం మనకనవసరం. ముద్రా రాక్షసం అంటే అచ్చు తప్పులు, పొరపాట్లు ఎంత అనర్థమో అన్న విషయానికే పరిమితమవుదాం. పుస్తకాలు ముద్రిస్తే, జనం వేలకు వేల ప్రతులు ఎగబడి కొని, చదివిన ఒక స్వర్ణ యుగం ముగిసింది. అప్పట్లో పుస్తకమంతా అచ్చయిన తరువాత ఒకటికి పదిసార్లు అక్షరమక్షరం చదివి, తప్పొప్పుల పట్టిక చివర జతచేసేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయం పోయింది. ఒకవేళ ఉన్నా- అన్నీ తప్పులే కాబట్టి- ఒప్పుల పట్టిక ఒక పేజీ వేస్తే సరిపోతుంది.
అచ్చు యంత్రం రావడానికంటే ముందు – అంటే దాదాపు అయిదు శతాబ్దాల క్రితం వరకు తాటి ఆకుల మీద దబ్బనం లాంటి ఘంటంతో రాసేవారు. పొడవైన తాటి ఆకులు సమంగా కోసి, నీళ్ళల్లో కొన్ని రోజులు నానబెట్టి, రెండు చివర్ల కన్నాలు వేసి ఎండిన తరువాత వాటిని ఉపయోగించుకునేవారు. అంధుల బ్రెయిలీ లిపిలో అక్షరాలు ఉబ్బి పైకి ఉంటాయి. తాళపత్రాల్లో లోపలికి గుచ్చుకుని ఉంటాయి. గిన్నెలమీద పేర్లు చెక్కినట్లు పొడుస్తున్నట్లుగా ఒక్కొక్క అక్షరానికి కనీసం ఇరవై, ఇరవై అయిదు సార్లు గుచ్చాలి. ఇది చెప్పినంత సులభం కాదు. వేళ్లు కాయలు కాచి, బొబ్బలెక్కి, గాయాలయ్యేవి. నాలుగు జెరాక్స్ కాపీలంటే ఇప్పుడు మనకు సెకెనులో పని. పోతన భాగవతం నాలుగు కాపీలు తాళపత్రాల్లో తీసుకోవాలంటే పదిమంది ఘంటాలు పట్టి రెండేళ్లు దీక్షగా కూర్చుంటేనే అయ్యేది. అందుకే దాదాపు బ్రిటిషువారు రావడానికి ముందువరకు మన చదువు సంధ్యలన్నీ ఒకరి నుండి ఒకరికి మౌఖికంగానే సాగింది. మెదడులో జ్ఞాపకం ఉన్నదే జ్ఞానం. బయట ఉన్నది కేవలం రెఫెరెన్స్. అదే భారతీయ పురాతన విద్యా విధానం బలం. కీలకం. అందుకే ఇంగ్లీషువాడు రాగానే మొదట ఆ జ్ఞాపకశక్తి ఆధారిత విద్యా జ్ఞానం మీద దెబ్బ కొట్టి మార్కులు, ర్యాంకుల చిన్న చిన్న చట్రాల్లోకి మన మెదళ్లను కుదించాడు.
ఛందోబద్దమయిన సాహిత్యంలో కాలప్రవాహంలో ఎక్కడన్నా, ఎవరయినా తప్పు చెప్పినా, రాసినా- యతి ప్రాసలు, గణాల్లో అక్షరాల సంఖ్య, పంక్తి విభజన ప్రకారం- వాటితో కొద్దిపాటి పరిచయం ఉన్నవారు కూడా సవరించుకునే అవకాశం ఉంది. నన్నయ, తిక్కన, పోతన, అన్నమయ్య, రామదాసులాంటి వారి మాట ఎలా ఉండేదో? వచనం ఎలా ఉండేదో? మనకు తెలియదు. వారు మాట్లాడిన ప్రతి మాట అమృతతుల్యమై ఉండి ఉండవచ్చు. కానీ సాధారణ సంభాషణ ఎంత గొప్పగా ఉన్నా- కొంతకాలం తరువాత దాన్ని గుర్తు పెట్టుకుని యథాతథంగా చెప్పడం ఎవరికయినా సాధ్యం కాదు. అదే పద్యమో, పాటో, కీర్తనో అయితే ఎన్ని వేల ఏళ్లయినా అలాగే అప్పజెప్పవచ్చు. వాటి ప్రధాన ఉద్దేశం కూడా నిజానికి అదే.
Ads
చెప్పేవారి, రాసేవారి అజ్ఞానం, అజాగ్రత్త వల్ల ఎన్నెన్నో ప్రమాదాలు జరిగాయి. అసలు సంఖ్య పక్కన సున్నాలు కలిపి వందల కోట్ల రూపాయలు డ్రా చేసిన ఒక మోసగాడిని పట్టుకోవడానికి అమెరికా ప్రభుత్వానికి తలప్రాణం తోకకు వచ్చింది. ఈ వాస్తవ కథ ఆధారంగా catch me if you can అని ఇంగ్లీషులో ఏకంగా ఒక సినిమా వచ్చింది. మన సంతకం బతికి ఉండి మనమే చేసినా చాలాసార్లు బ్యాంకులు మనల్ను అనుమానిస్తూ ఉంటాయి. కానీ- బ్యాంకులు ఎలాంటి సంతకాలు లేకుండా ఇచ్చేవారికి వేల కోట్లు ఇచ్చి తూరుపు తిరిగి సూర్య నమస్కారాలు చేస్తూనే ఉంటాయి.
అమెరికాలో సిటీ బ్యాంక్ వారు కొంతమంది క్లయింట్లకు 58 కోట్ల రూపాయలు బదిలీ చేయాలి. పేరు గొప్ప ఆన్ లైన్ వ్యవహారాల్లో 58 కోట్లకు బదులు పొరపాటున అక్షరాలా ఆరున్నర వేల కోట్ల రూపాయలు బదిలీ అయ్యింది. అయ్యయ్యో పెద్ద తప్పు జరిగింది- మాకు వెనక్కు రావాల్సిన ఆరు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు దయతలిచి వెంటనే ఇవ్వండి అని సిటీ బ్యాంక్ అందరినీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడింది. కలియుగమిది. ధర్మం ఒంటి కాలిమీద నడుస్తుంది కాబట్టి- పావు భాగం మంది మాత్రం వెనక్కు ఇచ్చారు. ముప్పావు భాగం మంది వాడేసుకున్నాం- ఇవ్వలేం అని బ్యాంకు మీదే రివర్సులో కేసులు వేసి గెలిచారు. విధిలేక సిటీ బ్యాంకు పైకోర్టు అయిన ఫెడరల్ కోర్టులో కింది కోర్టు తీర్పులను సవాలు చేసింది. అమెరికా చట్టాల ప్రకారం సిటీ బ్యాంక్ గెలిచే అవకాశాలు తక్కువ అని నిపుణుల అభిప్రాయం. సున్నాలే కదా అని కొడితే- సున్నమే మిగులుతుంది. మన దగ్గర ఈ ప్రమాదం జరగదు. అటు సూర్యుడు ఇటు పొడిచినా బ్యాంకు డబ్బు అనవసరంగా మన ఖాతాల్లో పడదు. మన బ్యాంక్ ఖాతా డబ్బే వేరే అకౌంట్లో పడుతూ ఉంటుంది. లేదా మన ఖాతా ఉన్న బ్యాంకే రాత్రికి రాత్రి మునిగి అదృశ్యమవుతూ ఉంటుంది. ఆన్ లైన్ లో ఏమయినా జరగవచ్చు…… By… -పమిడికాల్వ మధుసూదన్
Share this Article