ఫాఫం సాక్షి..! రోజురోజుకూ దానికి ఓ దశ, ఓ దిశ లేకుండా సాగిపోతున్నది… నిన్న ఫ్యామిలీ పేజీలో షబ్నమ్ ఉరిశిక్ష మీద వచ్చిన ఓ పెద్ద స్టోరీ నిజానికి విభ్రమ కలిగించింది… అందులో కొన్ని వాక్యాలు చదవండి ముందుగా… ‘‘భారతదేశంలో ఉరికి ఎదురుచూస్తున్న 12 మంది స్త్రీలు వెనుకబడిన, మైనారిటీ వర్గాలకు చెందినవారే కావడం నేరానికీ-శిక్షకూ-వెనకబాటుతనానికీ ఉన్న లంకె చర్చకు వస్తోంది… ‘ఉరిశిక్ష’ అని ఈ దేశంలో చర్చ జరిగినప్పుడల్లా ఆ ఉరిశిక్ష ‘ఎవరికి’ పడింది అనేది పెద్ద గమనార్హం అవుతుంది… చట్టం, న్యాయం అందరికీ సమానమే అని అనుకుంటాం, చెబుతుంటారు గాని చట్టం, న్యాయం అందరికీ సమానమేనా అని సందేహం వచ్చే గణాంకాలు ఎదురుగా ఉంటాయి… ఈ దేశంలో చకచకా శిక్షలు అమలయ్యేది బలహీనుల మీదేననీ, ఉరిశిక్ష అమలయ్యేది కూడా బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల మీదేనని ఆలోచనాపరులు గణాంకాలు చూపిస్తే వాటిని కాదనే జవాబు ఎవరి దగ్గరా లేదు… అలాగని ఈ ఆలోచనాపరులు నేరాలకు శిక్షలు వద్దని చెప్పడం లేదు. శిక్షల అమలులో వివక్ష ఉంది అని మాత్రమే చెబుతుంటారు. ఇప్పుడు ఉరిశిక్ష వార్తలలో ఉన్న షబ్నమ్ ఒక స్త్రీ కావడం, ఆమెకు క్షమాపణ దక్కకపోవడం, ఆమెలా ఈ దేశంలో ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్న 12 మంది స్త్రీలు కేవలం బలహీన, మైనారిటీ వర్గాల వారే కావడంతో వీరంతా ‘అడ్డంకులు లేని పూర్తి శిక్ష’కు యోగ్యులుగా భావించే భావజాలం ఉందని గ్రహించాల్సి వస్తుంది…’’
Ads
అంటే… అగ్రవర్ణాలకు శిక్షలు పడటం లేదు, పడినా శిక్షలు అమలు వేగంగా ఉండదు, ఇక్కడా వివక్షే… ఉరి కోసం ఎదురుచూస్తున్న వాళ్లంతా వెనుకబడినవాళ్లు, మైనారిటీలే… అందుకే ‘అడ్డంకులు లేని పూర్తి శిక్షకు యోగ్యులు’ అయ్యారు… ఈమె స్త్రీ, క్షమాపణ దక్కలేదు… అంటూ ఆమె పట్ల ఓ కృత్రిమ సానుభూతిని ప్రోది చేసే ఓ విఫల ప్రయత్నం కనిపిస్తోంది… కాకపోతే అదీ అత్యంత గందరగోళంగా…! అదేదో సూటిగా, పదుగురికీ అర్థమయ్యేలా ఆమె పట్ల పాజిటివ్ స్టాండ్ తీసుకుని రాయొచ్చుగా…! ఒకవైపు ఉరిశిక్ష వద్దనడం లేదు అంటుంది ఈ పత్రిక… మరోవైపు ఈ శిక్షలు పడేది అంతా మైనారిటీలకు, వెనుకబడినవాళ్లకు మాత్రమే అంటుంది… అసలు ఉరిశిక్ష పడేదే వర్ణవివక్షతో అని తేల్చేస్తుంది… వెనకబడినవాళ్లకే చకచకా శిక్షలు అమలవుతాయి ఇక్కడ అని రాస్తూనే… 12 మంది ఉరిశిక్షకు ఎదురుచూస్తున్నారు అని రాస్తుంది… చకచకా శిక్షలు అమలు చేస్తుంటే వాళ్ల శిక్షలు వాయిదా ఎందుకు పడుతున్నట్టు మరి..? కోర్టులు నిందితుల కులాన్ని చూసి శిక్షలు ఖరారు చేస్తున్నాయని మొత్తం న్యాయవ్యవస్థనే నిందిస్తున్నట్టుగా ఉంది ఇది…! పత్రిక స్టాండర్డ్ అలా తయారైంది…!! ఇలా రాసుకుంటూ పోతే కసబ్‌ను కూడా పాపం మైనారిటీ, వెనుకబడిన కుటుంబం, ఉరితీయడం పాపం అనేట్టుగా ఉంది… ఇక్కడ షబ్నమ్ ఓ ఉగ్రవాదికన్నా తక్కువేమీ కాదు,.. ఇంతకీ ఆలోచనపరులు అంటే ఎవరో..!!
తను డబుల్ ఎమ్మే… ఓ ఆరో తరగతి డ్రాపవుట్, సా మిల్ వర్కర్‌తో లవ్వు… ఇద్దరి వర్గాలూ వేర్వేరు… ఆమె కుటుంబం ఈ పెళ్లి వద్దన్నది… అంతే… కన్నవాళ్లు, తోబుట్టువులను ఏడుగురిని ప్రియుడితో కలిసి దుర్మార్గంగా నరికి చంపేసింది… అప్పటికే ఆమె గర్భిణి… ఈరోజుకూ ఆమెను అక్కడి స్థానిక మైనారిటీ సమాజం ప్లస్ బంధువులు అసహ్యించుకుంటున్నారు… ఆమెను ఉరితీస్తే ఆమె శవాన్ని కూడా తీసుకోబోం అని వాళ్లు చెబుతున్నారు… అదీ ఈ వ్యాసంలోనే రాశారు… ఆమెలో పశ్చాత్తాపం కూడా ఏమీలేదు… ఇందులో ఈమె నేరానికీ వెనుకబాటుతనానికీ నడుమ లంకె ఏమిటో సాక్షి పత్రికే చెప్పాలి… ఈ శిక్ష ఖరారులో వర్ణవివక్ష ఏమిటో కూడా చెప్పాలి… ప్రతి లీగల్ ఆప్షన్ వాడుకుంటూనే ఉన్నారు కదా… ఆమె పట్ల సానుభూతి ఎందుకుండాలి ఈ సమాజానికి..? దిగువ కోర్టు నుంచి సుప్రీం దాకా… రాష్ట్రపతి దాకా… ఏ దశలోనూ ఎవరూ ఆమె పట్ల కనీస కనికరం కూడా చూపలేదు… ఆమె చేసిన నేరం తీవ్రత అది… మరెందుకు శిక్ష ఖరారులోనే ఏదో వివక్ష ఉన్నట్టు, కోర్టులు పక్షపాతం ప్రదర్శిస్తున్నట్టుగా ముద్రలేయడం…!?
Share this Article