సాధారణంగా లెఫ్ట్, బీజేపీ అంటేనే ఉప్పూనిప్పూ టైపు కదా… సహజంగానే ఒకటి కుడి, ఒకటి ఎడమ… అనేకానేక రాజకీయ అంశాల్లో ఒకటి తూర్పు, ఒకటి పడమర… ఎరుపుకూ కాషాయానికీ ఎప్పుడూ పడదు… ఇలా చెప్పుకుంటూ పోతే ఒడవదు, తెగదు… అంత వైరుధ్యం… రాజకీయ ప్రత్యర్థి అనే స్థాయిని కూడా దాటేసిన వైరం… కేరళలో కసకసా నరుక్కోవడమే… బెంగాల్లో కూడా గతంలో అలాగే ఉండేది … కానీ ఇప్పుడు విశేషం ఏమిటంటే..? ఆ రెండూ కలిసి పనిచేస్తున్నాయి… లెఫ్ట్, రైట్ కలిసి లెఫ్ట్ రైట్ కొడుతున్నయ్… ఎర్రజెండాలు కాషాయజెండాలతో జతకట్టి, జోడు పరుగుకు సై అంటున్నయ్… అవును, బెంగాల్లోనే… వింతగా అనిపించినా సరే క్షేత్ర స్థాయిలో రాజకీయాలు పరిశీలిస్తున్న స్వంతంత్ర జర్నలిస్టులు దాన్నే రిపోర్ట్ చేస్తున్నారు… మొన్న సీపీఐ పత్రిక ప్రజాపక్షం ఓ కాలమ్ పబ్లిష్ చేసింది… అది సాగర్ నీల్ సిన్హా అనే ఇండిపెండెంట్ జర్నలిస్టు బెంగాల్ ప్రస్తుత రాజకీయ స్థితిగతులపై రాసిన వ్యాసం అది… కొన్ని ఆసక్తికరాంశాలున్నయ్… అది సీపీఐ పత్రికే కదా, తనే అనుమతించిన ఆ వ్యాసం ఏమంటున్నదంటే… ‘‘ఈసారి బీజేపీ, వామపక్షాలు భిన్నమైన రీతిలో పనిచేస్తున్నయ్… అయితే అది నాయకుల స్థాయిలో, పార్టీల స్థాయిలో కాదు… దిగువ శ్రేణుల స్థాయిలో… దీనికి కారణం మమతా బెనర్జీ వ్యతిరేకత… ఈ గాలి గట్టి వామపక్ష వోటర్లను సైతం బీజేపీ వైపు నెడుతున్నది… మమతను గద్దె దింపాలంటే లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికన్నా బీజేపీయే సరైనది అని భావించడమే దీనికి మూలం…
నిజానికి చాలా అంశాల్లో టీఎంసీ, లెఫ్ట్ భావజాలం ఒకటే… వైఖరి ఒకటే… కానీ మమతను గద్దె దించాలనేదే ప్రధాన అంశంగా మారింది…’’ ఇలా సాగింది ఆ వ్యాసం… నిజమే… లెఫ్ట్, బీజేపీ క్షేత్ర స్థాయిలో ఒక్కటవుతున్నయ్… అది ఈ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే కాదు… ఆమధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లోనే ఈ మార్పు ఆరంభమైంది… మమత రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయంటే… వేల గ్రామాల్లో లెఫ్ట్, బీజేపీ అభ్యర్థులు కనీసం నామినేషన్లు కూడా వేయలేని దురవస్థ… దాడులు, కేసులు, దౌర్జన్యాలు… అంతకుముందు సీపీఎం ధోరణీ అలాగే ఉండేది కానీ, మమత వాళ్లకే పాఠాలు చెప్పే లెవల్‌కు తీసుకుపోయింది… అనివార్యంగా లెఫ్ట్, బీజేపీ కలిసి టీఎంసీని ఎదుర్కున్నయ్… అందరికీ మమతే ప్రత్యర్థి… కాదు, శత్రువు… ఆమెను గద్దె దించితే తప్ప ప్రజాస్వామిక వాతావరణం నెలకొనదు… మనం మనం తరువాత తన్నుకుందాం, కానీ ముందయితే మమత అనే కామన్ భూతాన్ని తరిమేద్దాం అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో దిగువ స్థాయిలో లెఫ్ట్, బీజేపీ భుజం భుజం కలుపుతున్నయ్…
Ads
పేరుకు కాంగ్రెస్‌తో కూటమి కట్టినా సరే.., లెఫ్ట్ సానుభూతిపరులు బీజేపీ ద్వారానే మమతను దింపాలనే భావనలో ఉన్నారు… మమతకు కూడా చావోరేవో ఈ ఎన్నికలు… జనంలో వ్యతిరేకత ఉంది… పైగా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు ఎదురుతంతున్నయ్… ఒక్కో ముఖ్యనాయకుడే పార్టీని వీడి బీజేపీలోకి జంపైపోతున్నారు… ‘‘ఈసారి నేను ఓడిపోతే బతకనేమో’’ ‘‘బెంగాలీకే అధికారం’’ వంటి కొత్త నినాదాలు ఆమె ఎదుర్కొంటున్న ప్రతికూల గాలులను, ఫ్రస్ట్రేషన్‌ను చెప్పకనే చెబుతున్నయ్… కొన్ని సర్వేలు సీట్లు తగ్గినా సరే, ఎలాగోలా స్వల్ప మార్జిన్‌తో మమత అధికారాన్ని నిలుపుకుంటుందని అంటున్నయ్… కానీ గ్రౌండ్ రిపోర్టులు మాత్రం ‘‘మార్పు గాలులు’’ కనిపిస్తున్నాయని పేర్కొంటున్నయ్… మమత డబ్బు పంపిణీ మార్గాలను కేంద్రం బ్లాక్ చేయడం ఆల్ రెడీ స్టార్టయింది… వేల మంది సీఆర్పీఎఫ్ బలగాల్ని దింపబోతున్నారు… ఈసారి ఎన్నికల్లో స్ట్రాంగ్ యాంటీ-మోడీ ఫైటర్ మమత గనుక ఓడిపోతే మాత్రం జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు ఇంకా మారిపోవడం ఖాయం…!!
Share this Article