అభినందన్… సరిగ్గా రెండేళ్ల క్రితం ఈ ఎయిర్ ఫోర్స్ పైలట్ వింగ్ కమాండర్ ఓ నేషనల్ హీరో… శత్రుదేశం బేషరతుగా తమకు చిక్కిన ఓ గగన సైనికుడిని భద్రంగా మనకు అప్పగించిన క్షణం… ఆ మెలితిరిగిన మీసాలు మీడియాలో, సోషల్ మీడియాలో హోరెత్తించిన సందర్భం… అందరికీ ఇప్పటికీ ఓ మిస్టరీయే… సాధారణంగా దేశాల నడుమ యుద్ధంలో సైనికులు పట్టుబడటం, వాళ్లను జైళ్లలో వేసి చిత్రహింసలు పెట్టడం పరిపాటే… ఇండియా సాగించిన బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్స్ ఓ యుద్ధమే… ఆ వెంటనే పాకిస్థాన్ కూడా భారీగా యుద్ధవిమానాలను ఇండియాపైకి పంపించింది… కీలక విమానస్థావరాన్ని ధ్వంసం చేయాలని ప్లాన్ వేసింది… ఆ సందర్భంగా జరిగిన యుద్ధవిమానాల దొమ్మీలో ఈ అభినందన్ ఫైటర్ కూలిపోయి, తను పీవోకేలో కూలిపోయి, స్థానికులకు దొరికిపోయాడు… కానీ ‘‘శాంతి సంకేతం’’ పేరిట పాకిస్థానీ ఇమ్రానుడు ఆ అభినందన్‌ను ఎందుకు విడిచిపెట్టాడు..? అసలేమైంది..? హిందూస్థాన్ టైమ్స్‌లో ఓ ఇంట్రస్టింగు స్టోరీ కనిపించింది… ఆ కథేమిటంటే..?
పీవోకేలో పడిపోయాక అభినందన్‌కు గాయాలయ్యాయి… స్థానికులు కొందరు కొట్టారు… తరువాత సైన్యానికి అప్పగించారు… అయితే రక్తగాయాలతో ఉండీ, స్థానికులు కొడుతున్నా చలించని అభినందన్ ఫోటోలు అప్పటికే వైరల్ అయ్యాయి… ఎయిర్ స్ట్రయిక్స్ అనంతరం పాకిస్థానీ స్పందనను కేంద్రం జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నది కదా… ఆ ఫోటోలు మోడీ దగ్గరకూ చేరాయి… తను ఫస్ట్ అజిత్ ధోవల్‌కు కాల్ చేశాడు… తరువాత ఇంటలిజెన్స్ చీఫ్‌కు కాల్ వెళ్లింది… తన సందేశం పాకిస్థానీ ముఖ్యులకు స్పష్టంగా, వేగంగా, వెంటనే చేరాలి… అదేమిటంటే..? ‘‘అభినందన్‌ను వెంటనే విడిచిపెట్టండి… మా ఆయుధాలు దీపావళి కోసం కాదు’’… అప్పటి ‘రా’ చీఫ్ అనిల్ ధస్మాన వెంటనే పాకిస్థానీ కౌంటర్ పార్ట్, ఐఎస్ఐ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అసిం మునీర్ అహ్మద్ షాకు కాల్ చేశాడు… ఇలాంటి సంభాషణల కోసం కొన్ని సెక్యూర్డ్ లైన్స్ ఉంటాయి… ప్రధాని మోడీ సందేశాన్ని చేరవేశాడు… ఒక సైనికుడి కోసం ఒక ప్రధాని ఈ స్థాయి బెదిరింపులకు దిగడం ఏమిటనేది ఐఎస్ఐ చీఫ్‌కు అర్థం కాలేదు… ఈ సందేశం పంపించాక కొద్దిసేపట్లోనే రాజస్థాన్ సెక్టార్‌లోని పృథ్వి క్షిపణుల గోదాముల తలుపులు తెరుచుకున్నాయి… అమెరికాలో అలారమ్ మోగింది…
Ads
నిజానికి సౌదీ అరేబియా కూడా పాకిస్థాన్‌కు హితవు చెప్పిందనే వార్తలు అప్పట్లో వెలువడ్డాయి… ఐఎస్ఐ చీఫ్ ప్రధాని మోడీ సందేశాన్ని ఇమ్రాన్ ఖాన్ చెవిన వేశాడు… అప్పటికే సర్జికల్ స్ట్రయిక్స్‌తో మొహం మాడిపోయిన తనకు వేరే ఏ దేశం నుంచీ సపోర్ట్ లభించలేదు… మోడీతో నేనే మాట్లాడతాను, లైన్ కలపండి అని ఇమ్రాన్ ఆదేశించాడు… కానీ మోడీ మాట్లాడటానికి ఇష్టపడలేదు… ఇక చేసేది లేక ఇమ్రాన్ వెంటనే ‘అభినందన్‌ను విడిచిపెడుతున్నట్టు’ పార్లమెంటులో ప్రకటించాడు… ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ఐఎస్ఐ చీఫ్ ‘రా’ చీఫ్‌కు ఓ సీక్రెట్ లెటర్ కూడా పంపించాడు… అన్నట్టుగానే అభినందన్‌ను భద్రంగా వాఘా బోర్డర్ దగ్గర ఇండియాకు అప్పగించారు… కథ సుఖాంతమైంది… ఫైనల్ ట్విస్ట్ ఏమిటంటే… సదరు ఐఎస్ఐ చీఫ్ అదే సంవత్సరం జూన్‌లో పదవీ విరమణ చేయించింది పాకిస్థాన్… అప్పటికి తను ఆ పోస్టులో చేరి కేవలం ఎనిమిది నెలలు మాత్రమే… తన స్థానంలో హార్ష్‌గా ఉండే లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్‌ను నియమించింది… అంటే… అభినందన్ ఇష్యూ టాకిల్ చేయడంలో ఐఎస్ఐ చీఫ్ దారుణంగా ఫెయిలైనట్టుగా ముద్ర వేశారా..? లేదా అభినందన్‌ను విడుదల చేయాల్సి వచ్చిందనే అక్కసును ఆయన్ని బకరా చేయడం ద్వారా తీర్చుకున్నారా..?!
Share this Article