యండమూరి ఏది చేసినా కాస్త డిఫరెంటు… ఓ కథల సంపుటి అందింది తనకు… ముందుమాట రాయాలి, రాయాలంటే చదవాలి… కొత్త రచయిత… ఏదో నిర్లిప్తతతో చదవడం స్టార్ట్ చేసి, అదే బిగితో చదివేశాను అంటున్నాడు ఆయన… దాన్ని తన ఫేస్‌బుక్ వాల్ మీద పరిచయం చేశాడు…
అఫ్‌కోర్స్, రచయిత కూడా తనలాగే సీఏ చేశాడు కాబట్టేమో… పైగా ఆ రచయితపై తన రచనల ప్రభావం బాగా ఉందని గమనించిన ప్రేమ కాబట్టేమో… కానీ ముందుమాట రాయడమే కాదు, తన సోషల్ సర్కిల్‌కు నాలుగు మంచిమాటలతో పరిచయం చేయడం, అమ్మకాల లింక్ కూడా ప్రొవైడ్ చేయడం…. బాగుంది మాస్టారూ…
కామర్స్ చదివిన వాళ్లలో రచయితలు బహు తక్కువ. అందులోనూ చార్టెడ్ అకౌంటెంట్స్ రచయితలు మరీ తక్కువ..! ఆ సందర్భంగా చూస్తే, ఈ రచయిత మా జాతి వాడు. చార్టెడ్ అకౌంటెంట్.
Ads
ఈ పుస్తకం తాలూకు వివరాల్లోకి వెళ్లే ముందు బాపు గారి జోకు ఒకటి చెప్తాను. ఎవరో ఒక పెద్దాయన బాపుగారిని “ఓ కథకి బొమ్మ వేయటానికి మీరు ఎంత చేసుకుంటారు?” అని అడిగాడట. ఆయన తన ఫిగర్ చెప్పారు. పెద్దాయన బోల్డంత ఆశ్చర్యపోయి “బొమ్మకి అంతా?” అని విస్మయం చెందాడట. “బొమ్మ వేయటానికి కాదు. కథ చదివినందుకు” అన్నారట బాపుగారు.
సాధారణంగా ఎవరైనా తమ పుస్తకానికి ముందు రాయమన్నప్పుడు అలాగే ఫీల్ అవుతాము. అలా అని, కొత్త రచయితలని నిరాశ పర్చలేము. అటువంటి నిర్లిప్త భావనతోనే వారం ఆగాను. ఒక రోజు తొలి వాక్యం వ్రాయటం కోసం పుస్తకం చేతుల్లోకి తీసుకొని యధాలాపంగా చదవటం ప్రారంభించాను. మొదటి రెండు పేజీలు చదవగానే, కుర్చీలో రిలాక్స్‌డ్‌గా కూర్చున్నవాణ్ణి, ముందుకు వంగి నిటారుగా కూర్చుని తిరిగి మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించాను. అంత బావుంది ఈ ప్రారంభం..!
ఇది రచయిత మొదటి అని రచన చెప్పకపోతే, ఎవరో చేయి తిరిగిన లబ్ద ప్రతిష్ఠుడి రచన అనుకొని ఉండేవాణ్ణి. ఇంత సులభ శైలిలో, విశిష్టమైన శిల్పంతో. నాటకీయతతో. పాత్ర పోషణలతో తన తొలి రచన చేసిన ఒక రచయిత పుస్తకం చదవడం నా జీవితంలో ఇదే తొలిసారి.
నాలుగో పేజీలో “ఇంపై… కృష్ణశాస్త్రి కలంలో ఇంకై…” అన్న వాక్యం చూసి ఉలిక్కిపడ్డాను. ఇది నా నవలలో ఒక వాక్యం. ఆ తర్వాత ఈ నవల చదివే కొద్దీ ఈ రచయితపై నా రచనల ప్రభావం చాలా ఉందని ఉన్నది అని అర్థమైంది. మరి౦త చదివిన తర్వాత, ఈ నవలలో నేను కూడా ఒక పాత్రనా అని అనుమానం కూడా వచ్చింది.
అశ్వతి అంటే గుర్రానికి ఉన్నంత గ్రేస్ ఉన్న అమ్మాయట. నిజానికి ఈ కథానాయక కూడా అంత వ్యక్తిత్వం ఉన్న అమ్మాయే..! అంతకంటే మరిన్ని వివరాల్లోకి వెళ్ళను.
ఉత్తమ పురుషలో వ్రాయబడిన ఈ రచనలో, తనకి కొత్తగా పరిచయమైన అమ్మాయి గురించి ‘… ఇలాంటి కూతురు ఉంటే ఎంత బాగుంటు౦దో’ అనుకుంటాడు రచయిత. తర్వాత ‘… ఇంతకన్నా గొప్ప ఆత్మవ౦చన మరొకటి ఉండదు..’ అనుకుంటాడు. ఈ నిజాయితీ దాదాపు ప్రతి చాప్టర్లోను ఎక్కడో ఒకచోట ఈ పుస్తకంలో కనబడుతుంది.
నా ప్రభావం ఇతడిపై చాలా ఉంది. అది గర్వకారణం. ఈ రచయిత నాతో ముందు మాట రాయించుకోవటానికి కారణం కూడా అదే అని నేను అనుకుంటున్నాను….. యండమూరి వీరేంద్రనాథ్ ……. ఈ పుస్తకం కోసం: https://www.amazon.in/dp/B0D7MYVJNN?ref=myi_title_dp
Share this Article