ఎక్కడో విన్నట్టు ఉంది కదా ఈ కథ… యుద్ద నేపథ్యంలో రెండు భిన్న కుటుంబాల మధ్య జరిగిన పెద్ద సంక్షోభాన్ని సరిగ్గా నాలుగేళ్ల కింద డీ రీస్ అనే అమెరికన్ నల్ల జాతి అమ్మాయి నిజాయితీగా కోటి రూపాయల పెట్టుబడి పెట్టి మంచి వ్యాపారం చేసారు. సినిమాలో నిజాయితీగా నవల రాసిన తెల్ల జాతి అమ్మాయికి టైటిల్ కార్డులో కృతజ్ఞతలు కూడా ఇచ్చిన నిజాయితీ… కట్ చేస్తే సుక్కూ అని సుకుమారంగా పిలిపించుకునే సుకుమార్ అనే పెద్ద కాపీ డైరెక్టర్ సానా బుచ్చిబాబు అనే తన శిష్యుడి ద్వారా… సగౌరవంగా ‘ఉప్పెన’ ను వదిలారు. చిరంజీవి ఆ థర్డ్ రేట్ సినిమాను ఒకటే పొగుడుతూ బుచ్చిబాబును ఆకాశానికి ఎత్తేశాడు… సైరా సినిమా చేస్తున్న కాలంలోనే మితృడు సాయిచంద్ ఈ సినిమా చేస్తున్నా అని చెప్పారు, కథ గురించి ఏమీ చెప్పలేదు కానీ కాకినాడలో ఉన్న రోజుల్లో మాటల మధ్య ఈ సినిమా ప్రస్తావన వచ్చింది… నాకిష్టమైన విజయ్ సేతుపతి, సాయి ఇద్దరూ ఉన్నారు కాబట్టి సినిమా మొదటి రోజే చూసా. నిజాయితీగా చెబుతున్నా… అదొక కాపీ సినిమా అని అనుకోలేదు. కులం వ్రణం, రాచపుండులా తిష్టవేసిన ఈ కాలంలో పెద్దింటి అమ్మాయి దగ్గర పడుకుంటే మగతనాన్ని కోసేసే క్రూరం నన్ను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.
అదొక పెద్ద ఇష్యూ అనిపించలేదు. కంచక చర్ల కోటేశు, మంధని మధుకర్, మిర్యాలగూడ ప్రణయ్ వెనక బీజమూ క్షేత్రమూ, వాటి పవిత్రతా ఉన్నాయి. హిల్లరీ జోర్డాన్ నవల గొప్పగా మానవీయంగా ఆర్తితో ఉంది. హీరో మర్మావయవాలను కోసేసినా తన మొగుడికి సగర్వంగా నీ ద్వారా నీ ‘మగతనం’ మూలంగా కన్న కొడుకు వీడే అని చెప్పి ఇంట్లోకి ఆహ్వానించింది. ఇక మన సుకుమార్ శిష్యుడు ఏం చేసాడు. కాకినాడ బీచ్ లో సి గ్రేడ్ స్క్రీన్ ప్లే రాసుకుని, వాడికి ఆశీర్వాదం అనే పేరు తగిలించి, పైగా ఇది అలగా జనాల సినిమా కనుక ముద్దుగా ఆశీ అని పిలుస్తూ… రాసిన కథలే, చెప్పిన డైలాగ్ లే చెప్పి, మనకో అబద్దపు వంటకాన్ని ఇచ్చాడు. దాదాపు తొమ్మిది పది నెలలు సినిమా తెర చూడని మనిషి ఉదారంగా ఇప్పటికే వంద కోట్లు ఇచ్చేసి ఉంటారు.
పాతికేళ్ళ కింద రాజీవ్ మీనన్ అనే మళయాల దర్శకుడు కాజల్, అరవిందస్వామి, ప్రభుదేవాలతో ‘మెరుపు కలలు’ అనే సినిమా తీసాడు. తమిళంలో ఆ సినిమా బిగ్ హిట్, విషాదం ఏమిటంటే తెలుగులో ఆ సినిమా అసలే ఆడలేదు. దానికి కారణం ఒక మాలోడు, మాదిగోడు, మంగలోడు అందాల రాశి కాజోల్ ప్రేమలో పడడం నాన్సెన్స్ అనుకున్నారు. కాజోల్ తో ఎగరాలి అంటే బాబుల డాబుసరి ఉండాలి అన్నమాట… అందుకే తెలుగు సినిమా హీరోలు తమ తాతలు తండ్రులు అక్రమంగా పోగేసిన సంపాదన మీద పేరుపక్కన ఉన్న తోకల వెలుగులో ప్రకాశించే డూబులు మాత్రమే. నేనెప్పుడూ చెబుతూనే ఉంటా, తెలుగు సినిమా ఇప్పటికీ రెండున్నర జిల్లాల, మూడున్నర కులాల పడక గది దాటి బయటకు రాలేదు అని… ఒకవేళ అది దాటి పొరుగింటి పుల్ల కూర కోసం బయటకు వచ్చినా బుచ్చిబాబులా అబాసుపాలు అవుతారు. ఈ జబ్బు బుచ్చిబాబుతో మొదలు కాలేదు, అతనితో అంతం కాదు. తెలుగు సినిమా ఒక ఎంబసైల్ వ్యక్తిత్వాలతో నిండిపోయి ఉంది. ఇలా మీరు జాతి జాతి అంటూ బీజమూ క్షేత్రమూ అంటూ ఆడొక్క మాట ఈడొక్క మాట అతుకేసి తీస్తాం అంటూనే ఉంటారు. మనం వాళ్ళ కుల గౌరవాలకి కటౌట్ లు కడుతూనే ఉంటాము… డొక్క తీసి డోలు కట్టే నాలాంటి వాడు ఒకడు ఉంటాడు అనే స్పృహతో ఉండండి రా సావీ, మీకు దండవెడతా….
Ads
Share this Article