అది అసలే కాంగ్రెస్ ప్రభుత్వం… ఏదయినా చేయగలదు… కానీ పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిశోర్ అంగీకరిస్తే మటుకు ఆయన నైతికంగా ఓ వంద మెట్లు దిగిపోయినట్టే..! విషయం ఏమిటయ్యా అంటే… గత ఎన్నికల్లో పంజాబ్‌లో కాంగ్రెస్ విజయం కోసం పీకే టీం పనిచేసింది కాబట్టి, పార్టీ గెలిచింది కాబట్టి, వచ్చే ఎన్నికల్లో కూడా పీకే టీంతో ‘‘ఎన్నికల పని’’కి ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం అమరీందర్‌సింగ్ నిర్ణయం తీసుకున్నారట… ఏకంగా కేబినెట్ హోదా ఇచ్చి, సీఎం ముఖ్య సలహాదారు పోస్టు ఇచ్చి, రూపాయి జీతం ఇవ్వాలని కేబినెట్ తీర్మానించిందట… రూపాయి జీతం అనేది ప్రపంచంలోకెల్లా పెద్ద జోకు, దాన్నలా వదిలేస్తే, ఆ శుష్క ప్రహసనాల్లో చివరకు పీకే టీం కూడా చేరిపోతే ఏమీ చెప్పలేం… కానీ తెల్లారిలేస్తే చాలా నీతులు చెబుతుంటాడు కదా ప్రశాంత్ కిశోర్… మరి ఈ కేబినెట్ పోస్టు మీద స్పందించలేదు దేనికి..? అంటే అంగీకరిస్తున్నట్టేనా..? అదెందుకు అనైతికమో కూడా ఓసారి చెప్పుకోవాలి…
- అప్పట్లో కాంగ్రెస్ పార్టీతో పీకేకు ఒప్పందం ఉంది… ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలతో కలిపి పంజాబ్ కోసం కూడా పనిచేశాడు… యూపీలో కథ వేరు గానీ, పంజాబ్ వ్యవహారాల్లో పీకేను వేలుపెట్టనివ్వలేదు అమరీందర్… అక్కడ రకరకాల కారణాల నేపథ్యంలో కాంగ్రెస్ గెలిచింది, సహజంగానే మళ్లీ గెలవాలని అనుకుంటోంది… అప్పుడు పనికిరాని పీకే ఇప్పుడు విజయం సాధించిన పెడతాడని అమరీందర్ నమ్మడమే ఓ విశేషం… పైగా అధికారంలో ఉన్న పార్టీలు కూడా తాము చేసిన పాలన తీరుపై ఆధారపడకుండా… ఎన్నికల జిమ్మిక్కుల పీకేను నమ్ముకోవల్సి రావడం ఓ విషాదం… సేమ్, బెంగాల్లో మమత కూడా… చంద్రబాబు కూడా ఇదే పీకే టీంను మొదట్లో అపహాస్యం చేశాడు, ఆడిపోసుకున్నాడు… చివరకు తప్పనిసరై, ఇదే పీకేతో కలిసి పనిచేసిన రాబిన్ శర్మతో కోట్ల రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు…
- పీకే సంస్థ పేరు ఐ-ప్యాక్… అది ఓ ప్రైవేటు సంస్థ… ఎన్నికల స్ట్రాటజీలు, సోషల్ మీడియా ప్రచారాలు, సర్వేలు గట్రా దాని నేచర్ ఆఫ్ వర్క్… కాంగ్రెస్ గనుక దాంతో ఒప్పందం కుదుర్చుకోవాలీ అనుకుంటే అది పార్టీకి, ఈ ప్రైవేటు సంస్థకూ నడుమ యవ్వారం… దానికీ ప్రభుత్వానికీ సంబంధం ఏమిటి..? ప్రభుత్వంలో ఓ పోస్టు ఇచ్చి, జనం నవ్వేట్టుగా రూపాయి జీతం ఏమిటి..? పార్టీ కోసం వర్క్ చేస్తాడు అని బహిరంగంగానే చెబుతూ, ప్రభుత్వం నుంచి ఈ ప్రొటోకాల్ పోస్టులు ఇవ్వడం ఏమిటి..? దాన్ని పీకే అంగీకరించడం ఏమిటి..? అనైతికం కాదా..?
- పార్టీ ఎలా గెలవాలో చెప్పడానికి… సీఎం ముఖ్య సలహాదారు పోస్టు ఇవ్వాలా..? ఇచ్చారుపో, ఒప్పందం మేరకు చెల్లించాల్సిన కోట్ల రూపాయల్ని కూడా ప్రభుత్వం ఖర్చు కిందే ఇస్తారా..? ఎలా ఇవ్వగలరు..? సో, ఎలా చూసినా అమరీందర్, పీకే నడుమ ఈ కేబినెట్ హోదా పోస్టు ఉత్త నాన్సెన్స్ యవ్వారమే అని తేలుతుంది… సర్లెండి, జగన్ ప్రభుత్వంలోని సలహాదారులు ప్రభుత్వానికి చేసేదేముంది..? పీకే తరహా పార్టీ పనులే కదా అంటారా..? నో కామెంట్…!! చివరగా :: పార్టీ వ్యవహారాల్లో పీకే పాత్ర పెరిగి, పెరిగి, బెంగాల్లో చాలామంది నేతలు మమతకు గుడ్‌బై చెప్పారు, అమరీందర్ పెద్దగా వార్తలు చదవడు కావచ్చు..!!
Share this Article
Ads