సిగ్నల్ లేని ఆన్ లైన్ చదువులు!
——————
పాడు కరోనా తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. నెలలు దాటి, సంవత్సరం దాటినా కరోనా బాధ తప్పింది అని చెప్పడానికి లేదు. వ్యాక్సిన్ లు వచ్చినా ఏవో అనుమానాలు అలాగే ఉన్నాయి. మాస్కులు తొలగలేదు. కేసులు వస్తూనే ఉన్నాయి. కొత్త స్ట్రెయిన్ ఉత్పరివర్తనల వార్తలు వస్తూనే ఉన్నాయి. కరోనా దెబ్బలు అందరికీ తగిలాయి. అన్ని రంగాలకు తగిలాయి.
విద్యారంగానికి కరోనా కొట్టిన దెబ్బ చిన్నది కాదు. ఆన్ లైన్ క్లాసులు ఆఫ్ లైన్ వేళలను మించి ఆన్ లో ఉంటాయి. ఆన్ లైన్ క్లాసులకు ఒక స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ తప్పనిసరి. ఆపై ఇంటర్నెట్ ప్రాణావసరం. కరెంట్ ఉండి తీరాల్సిందే. మారుమూల పల్లెల్లో కూడా ఫోన్లు ఉన్న మాట నిజమే కానీ- అది స్మార్ట్ ఫోన్ అయి, ఫోర్ జి లాంటి మొబైల్ నెట్ ఉండాలి. ఇంతా చేస్తే- సెల్ ఫోన్ సిగ్నల్ పూర్తి స్థాయిలో ఉంటే తప్ప ఆన్ లైన్ వీడియో పాఠాలు ప్లే కావు.
Ads
ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి గ్రామం గిరిజన గూడెంలో సెల్ సిగ్నల్ ఉండదు. ఆ గూడెంలో సరస్వతి ఓ ప్రయివేటు స్కూల్లో చదువుతోంది. ఆ పేరుగొప్ప స్కూల్ వారి ఆన్ లైన్ క్లాసులు మొబైల్లో వినడానికి సరస్వతిని అయిదు కిలోమీటర్లు బైక్ మీద ఆ అమ్మాయి తండ్రి శ్రద్దగా తీసుకెళుతున్నాడు. సాక్షాత్తు సరస్వతి రోడ్డుమీద ఎండలో కూర్చుని బుద్ధిగా చదువుకుంటున్నట్లు ఈ ఫోటో చాలా ముద్దుగా ఉంది. చిన్న వార్త, చక్కటి ఫోటో.
కానీ- కరోనా వేళ చదువులు నిరుపేదలకు ఎంత దుర్భరంగా మారుతున్నాయో అద్దం పట్టే వార్త ఇది. ఆన్ లైన్ తరగతుల పేరిట పిల్లలను పిండుకుంటున్న ప్రయివేటు విద్యాసంస్థలకు ప్రతిబింబం ఈ వార్త. దొరకని చదువుల సిగ్నల్ కోసం సరస్వతులు రోడ్లపాలయిన డిజిటల్ పేదరికానికి సంకేతం ఈ వార్త.
ఎండా వాన గాలి దుమ్ము ధూళి లెక్కచేయక నాలుగు అంగుళాల ఫోన్లో పాఠాలు వినడానికి మైళ్లకు వెళుతున్నందుకు ఆనందించాలో? బాధపడాలో? తెలియడం లేదు. దేశమంతా సెల్ స్పెక్ట్రమ్ వేలం వేస్తే లక్షల కోట్లు వస్తూ ఉంటుంది. సెల్ సిగ్నల్ ఒక గీత కూడా రాని ఊళ్లు మనపక్కనే ఉంటూ ఉంటాయి. సిగ్నల్ రాని ఊరి సరస్వతికి ఆన్ లైన్ పాఠం విధించిన ఆ ప్రయివేటు పాఠశాలకు మెదడు ఎక్కడుందో చెప్పగలిగినవారెవరు?………. By…. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article