దర్శకుడు ఏది చూపిస్తే అది కళ్లప్పగించి చూస్తూ, విజిళ్లు వేసే తరం కాదు ఇది… ప్రతిదీ నిశితంగా పరిశీలించి, తప్పుల్ని సోషల్ బజారున నిలబెట్టి ఉతికేసు కాలం ఇది… అందుకే నిర్మాతలు, దర్శకులు కథ ఎంపిక, పోస్టర్ రిలీజ్, ట్రెయిలర్ రిలీజ్ దగ్గర్నుంచి సినిమా రిలీజయ్యేదాకా ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి… అవసరమైతే రీషూట్ కూడా చేసుకుంటున్న సందర్భాలు కూడా ఉంటున్నయ్… ప్రత్యేకించి బయోపిక్స్ తీసేవాళ్లు ఒకటికి వందసార్లు చెక్ చేసుకోవాలి… ఎందుకంటే, ప్రేక్షకుడు ఒరిజినల్‌గా తాము చదివిన, తమకు తెలిసిన చరిత్రతో పోల్చి చూస్తాడు… మనోభావాలూ మట్టిగడ్డలు సరేసరి… మీకు గుర్తుంది కదా… ఎంఎస్‌ధోనీ బయోపిక్‌లో ధోనిగా నటించడానికి దివంగత హీరో సుశాంత్ సింగ్ ఎంత కష్టపడ్డాడో… ధోనిలాగా ఫిజికల్ అప్పియరెన్స్ మాత్రమే కాదు… బాడీ లాంగ్వేజీని పట్టుకోవడమే కాదు… ధోనీ మాత్రమే అలవోకగా కొట్టే కొన్ని షాట్లను సిన్సియర్‌గా, సీరియస్‌గా ప్రాక్టీస్ చేశాడు సుశాంత్… అది డెడికేషన్…
ఇప్పుడు ఇదంతా చెప్పుకుంటున్నది దేనికంటే… పరిణీతి మన స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించనుంది… సినిమా పేరే సైనా… ఓ పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాతలు… టీసీరీస్ వాళ్లు తీస్తున్నట్టున్నారు… తారే జమీన్ పర్ సినిమాను తీసిన కథకుడు, స్క్రీన్ ప్లే రైటర్, దర్శకుడు అమోల్ గుప్త దీనికి దర్శకుడు… సో, ఈ బయోపిక్ తప్పుల్లేకుండా తీస్తారనే ఆశిస్తారు కదా అందరు… కానీ అలా జరగలేదు… ఆ పోస్టర్ చూడగానే నెటిజన్లు పట్టేసుకున్నారు… అందులో తప్పేమిటంటే..? టెన్నిస్‌లో సర్వ్ చేయడం ఒకరకంగా, బ్యాడ్ మింటన్లో మరోరకంగా ఉంటుంది… కానీ ఈ పోస్టర్ రూపకర్త ఎవరో గానీ తనకు టెన్నిస్కూ, బ్యాడ్ మింటన్కూ ఆడే విధానాల్లో తేడా తెలిసినట్టు లేదు ఫాఫం… లేక తెలిసీ ఎవడు చూడొచ్చాడులే అనుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించాడో తెలియదు… మొత్తానికి ఆ ఆటల గురించి తెలిసినవాళ్లకు, ప్రత్యేకించి క్రీడాభిమానులకు ఆ పోస్టర్‌లోని తప్పు ఆడ్‌గా అనిపించింది… ‘‘ఒరేయ్, నాన్నా, ఆటలో బేసిక్స్ కూడా తెలియకుండా ఓ క్రీడాకారిణి బయోపిక్ ఎలా తీస్తున్నావ్ తండ్రీ’’ అని ట్రోలింగుకు దిగారు… ట్రోలింగుల్లో ట్రెండింగ్ అది నిన్నంతా… కొందరయితే సైనా నెహ్వాల్..? సానియా నెహ్వాల్..? అని అద్భుతమైన శీర్షికలు కూడా పెట్టేశారు… బాబూ, తెలియకపోతే కనీసం సైనాను అడిగి తెలుసుకోవాలి కదా అని కొందరు… ఓహో, మాకు తెలిసి సైనా బ్యాడ్మింటన్ ప్లేయర్, టెన్నిస్ స్టార్ ఎప్పుడైందబ్బా అని మరికొందరు… కొంపదీసి సైనా బయోపిక్ తీయబోయి, సానియా బయోపిక్ తీయడం లేదు కదా అని ఇంకొందరు విరుచుకుపడ్డారు… ఈ టీజర్లో సైనా పాత్రధారి నోటి వెంట వినిపిస్తుంది ఓ డైలాగ్… ‘‘ఎదురుగా ఎవరున్నా సరే, కొట్టేస్తాను’’ అని… ఇప్పుడా పోస్టర్ చిత్రించినవాడు ఎదురుగా నిలబడితే పరిణీతి, సైనా కొట్టేసేట్టుగానే ఉన్నారు… పోస్టర్ డిజైనర్‌కు తెలియదు సరే, మరి సదరు దర్శకరత్నం కూడా చూసుకోవద్దా..?!
Ads
Share this Article