దటీజ్ కేసీయార్… ఒక చక్రవర్తి… తనకు ప్రేమ కుదిరితే… తనను ఎవరైనా బాగా భజిస్తే, తన మీద పుస్తకాలు రాస్తే… పెద్ద కిరీటం పెట్టి, చంకకెక్కించుకుంటాడు… వైరాగ్యం కుదిరితే విసిరి, పాతవన్నీ మరిచి నిర్దాక్షిణ్యంగా రెక్కలు కత్తిరించి, ఓ పాడుబడిన బావిలో పడేస్తాడు… మహా నిష్కర్షగా ఉంటాడు… ఆలె నరేంద్ర, విజయశాంతి, డి.శ్రీనివాస్… ఎన్నో ఉదాహరణలు… నువ్వు ఏం సంపాదించుకుంటున్నవ్, ఏం వేషాలు వేస్తున్నావ్ అనేది ఒక దశ వరకూ ఆయన పట్టించుకోడు… కానీ తనకు కోపం వచ్చిన మరుక్షణం, తను సందేహించిన మరుక్షణం ఓ ఉగ్రనరసింహుడే అవుతాడు… ఈకలు, తోకలు అన్నీ కత్తిరించి బజారున పడేస్తాడు… తాజా ఉదాహరణ… సీఎంపీఆర్వో విజయకుమార్…!
ఆ పోస్టు నుంచి ఊడబీకడమే కాదు… ఆ పోస్టు కోసం అన్ని రకాల నిబంధనల్నీ బుల్ డోజ్ చేసి, అక్రమంగా ట్రాన్స్‌కోలో ఏ జనరల్ మేనేజర్ పోస్టు ఇచ్చాడో… దాన్నుంచి కూడా రాజీనామా చేయించాడు కేసీయార్… ఒక్క ముక్కలో చెప్పాలంటే…? వద్దులెండి, ఒక్కసారి బావిలో పడ్డాడంటే చాలు… అందరూ రాళ్లేస్తారు…!! అప్పటిదాకా నువ్వు తోపువు, నువ్వు కేసీయార్ కుడిభుజానివి అని కీర్తించిన నోళ్లే… మంచిగైంది అని మరో నాలుగు రాళ్లు ఎక్కువ వేస్తారు… ఇదే విజయకుమార్ ‘ముచ్చట’ పట్ల కేసీయార్ దగ్గర ఎంత దుష్ప్రచారం చేశాడో తెలిసినా సరే, ఇన్నాళ్లూ నవ్వుకుంది… ఇప్పుడూ అంతే… ఓ జాలితో కూడిన సానుభూతి నవ్వు… తన హోదా తీసుకొచ్చిన అతిశయం వంటి చాలా అవలక్షణాలకు విజయకుమార్ మొదటి ప్రతీక కాదు, చివరి ప్రతీక అంతకన్నా కాదు… కోపం అసలే లేదు ఇప్పుడు…
Ads
కేసీయార్ ఒక పాలకుడు… నాటి చక్రవర్తుల తరహా… తన ఆంతరంగిక సిబ్బందిపై ఎల్లవేళలా నిఘా ఉంటుంది… అదీ తెల్లారిలేస్తే తన పక్కనే కనిపిస్తూ… కేసీయార్ తెరవెనుక ఆఫీసులో కీలకమైన ఓ సీఎంపీఆర్వో మీద నిఘా ఉండకుండా ఎందుకు ఉంటుంది..? మామూలు జనానికి తెలియకపోవచ్చు, అవసరం లేకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు…. కానీ బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులు, పొలిటిషియన్లు, ఇతర ఎన్లైటెన్ సెక్షన్‌కు తెలుసు కదా విజయకుమార్ పోస్టు ప్రాధాన్యం ఏమిటో…! అందుకే తనను కేసీయార్ వెళ్లగొట్టాడనీ, చివరకు ఆ ట్రాన్స్‌కో జీఎం పోస్టు నుంచి కూడా తరిమేశాడనీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది వార్త… ఏదో భారీ స్కాం ఉందట, ద్రోహచింతనతో పొలిటికల్ ప్రత్యర్థి క్యాంపులకు ఉపయోగపడుతున్నాడు అట, ఆరు నెలల కిందటే హెచ్చరించాడట, కానీ తన ధోరణి మార్చుకోలేదట… చివరకు కరవాలం ఝలిపించాడట… ఇలాంటి సృజనాత్మక వార్తల జోలికి మనం పోవడం లేదు… బావిలో పడ్డవాడి మీద నాలుగు అదనపు రాళ్లు విసిరే బాపతు కాదు మనం… కానీ..?
కేసీయార్ వంటి పాలకుడి దగ్గర పనిచేసినప్పుడు అత్యంత జాగరూకతతో పనిచేయడమే కాదు… విధేయత చాలా ముఖ్యం… కేసీయార్ పక్కనే రోజూ కనిపిస్తున్నా సరే, ఎంత అత్యంత కీలకమైన పొజిజన్లో ఉన్నాసరే… తన వ్యవహార ధోరణిపై ఒక వేయి కళ్లు నిఘా వేస్తూ రోజురోజుకూ కేసీయార్‌కు సమాచారం చేరవేస్తాయనే కీలకాంశాన్ని విజయ్ ఎందుకు తెలుసుకోలేకపోయాడో తెలియదు… ఓ పాలకుడిగా కేసీయార్ చాలామంది వ్యవహారాలను తెలిసినా సరే పట్టించుకోడు… కానీ ఓ దశ వచ్చినప్పుడు తను ఎంత నిష్కర్షగా, ఎంత అమర్యాదగా బజారులోకి నెట్టేస్తాడో పార్టీలో చాలామందికి తెలుసు… ఐనాసరే, విజయకుమార్ ఎక్కడ తప్పు చేశాడనేది ఇక ఇక్కడ అప్రస్తుతం… చివరగా ఒక్కమాట… అజిత్ అనే ఓ పీఏ ఉండేవాడు కేసీయార్ దగ్గర… తన మీద కేసీయార్‌కు డౌటొచ్చింది, ఆధారాలు తీసుకున్నాడు, పక్కన పెట్టేశాడు… సింపుల్… అంతటి హరీశ్ రావుకే అంటకత్తెర వేయడానికి కేసీయార్ సందేహించలేదు… ఈ విజయకుమార్ ఎంత..? కానీ రోజూ కేసీయార్ క్యాంపులో, తన వెంటే తిరుగుతూ ఎందుకు తెలుసుకోలేకపోయాడు కేసీయార్లోని అసలు పాలకుడి తత్వాన్ని..? ఈ ప్రశ్నకు జవాబు లేదు… దొరకదు…!!
Share this Article