నిజానికి ఈనాడు ఎప్పుడైతే చప్పిడి పథ్యం వార్తలకు పరిమితం అయిపోయిందో… ఆ పత్రిక చదవబుద్ధి కావడం లేదు… పైగా అనేక ప్రొఫెషనల్ తప్పులు కూడా సాధారణమైపోయాయి… కానీ ఆ చీకట్ల నడుమ కూడా కొన్ని మెరుపులు… చుక్క తెగి రాలిపడ్డట్టు… అభినందించాలి… సోది, సొల్లు వార్తల నడుమ ఓ కొత్త యాంగిల్, ఓ కొత్త స్టోరీ కనిపించినప్పుడు తప్పకుండా అభినందించాలి… ఇది అలాంటి వార్తే… నిజానికి నమస్తే తెలంగాణకు ఈ వార్త దొరికితే… ‘‘తెలంగాణ వస్తే ఏమొస్తది అన్నారుగా… చూశారుగా… సారు పాలన, కాలేశ్వరం నీళ్లు, మిషన్ కాకతీయ దయ, మిషన్ భగీరథ కరుణ, రైతుబంధు ప్రభావం… ఎక్కడెక్కడికో వలస పోయినవాళ్లంతా మళ్లీ తెలంగాణకు వచ్చేస్తున్నారహో…’’ వంటి వాక్యాలతో ఓ ఫస్ట్ పేజీ బ్యానర్ కుమ్మిపారేసేది… నిజానికి తెలంగాణ జనం గోస, వలస ఓ నిత్యసత్యం… అయితే బొగ్గుబాయి లేదా దుబాయి… లేదంటే భీవండి సాంచాలు… ఇదేకదా దశాబ్దాల తెలంగాణ జనగోస… బతుకు ఆశ… ఇప్పుడు ఆ ఎడారి కూడా వాపస్ తరిమేస్తోంది… అదీ ఈ వార్త…
మంచి కోణం… గత అయిదేళ్లుగా గల్ఫ్ నుంచి ఎందరు కార్మికులు వచ్చేశారో సాధికారంగా, సర్కారీ గణాంకాలతో సహా రాశాడు ఆ రిపోర్టర్ ఎవరో గానీ…! అందుకే ఈ కథనానికి వాల్యూ ఎక్కువ… ఎందుకు గల్ఫ్ నుంచి వాపస్ రావల్సి వస్తున్నది… గల్ఫ్ ఎందుకు కార్మికులకు ఉపాధి చూపలేకపోతున్నదో కూడా చెప్పింది కథనం… ఈ అయిదేళ్లలో నాలుగున్న లక్షల మంది వాపస్ వస్తే… కొత్తగా వెళ్లింది కేవలం 5900 మంది మాత్రమే… గత ఏడాది అయితే మరీ 330 మంది మాత్రమే కొత్తగా గల్ఫ్ దేశాలకు ఉపాధి వెతుక్కుంటూ వెళ్లారు… ఈ వలసల వాపస్ ఇంకా కొనసాగనుంది… వాపస్ వచ్చినవాళ్లకు బతుకుతెరువు, ఉపాధికల్పన ఓ పెద్ద ప్రయాస కాబోతోంది… వీళ్లందరినీ వ్యవసాయరంగం ఇముడ్చుకోలేదు… పల్లెల్లో అది తప్ప వేరే ఉపాధి లేదు… కరోనా కారణంగా ఎకానమీ బాగా డిస్టర్బ్ అయిపోయింది… పట్టణాల్లోనూ ఉపాధి కల్పించగల ప్రతి రంగమూ దెబ్బతిని ఉంది… సో, కొత్త ఉపాధి అవకాశాలు కరువు… నిజానికి ఇది ఒక్క తెలంగాణ సమస్యే కాదు, గల్ఫ్‌కు వలసలు ఎక్కువగా ఉండే ప్రతి రాష్ట్రం సమస్య… ఈ సమస్య మీద బహుముఖ విధానం అవసరం… కేవలం రాష్ట్రాలతో కాదు, కేంద్రం- రాష్ట్రాలు కలిసి పూనుకోవాలి… కానీ మన కేంద్ర ప్రభుత్వం పనితీరు చూస్తున్నాం కదా… అంతా డొల్ల ఆత్మనిర్భరమే… కరోనా కష్టకాలంలోనే రూపాయి ఆదుకోలేదు, ఇక వీళ్లనేం ఆదుకుంటుంది…? రాష్ట్ర ప్రభుత్వాలు సరేసరి…!!
Ads
Share this Article