ఒక గద్దర్, ఒక నారాయణ, ఒక గోరటి, ఒక సుద్దాల……. చెప్పే నీతులు వేరు… ఓ సమయం వస్తే, తమ ధోరణులకు భిన్నంగా రాజ్యం ఎదుట, పాలకుడి ఎదుట సాగిలబడటం వేరు… చాలామందిని ఈ కాలప్రవాహం చూసింది, జాలిపడింది, నవ్వుకుంది, వదిలేసింది… వీళ్లు కొత్తా కాదు, ఇలాంటోళ్లు ఇక రారనీ కాదు… అంతటి శ్రీశ్రీయే ఎమర్జెన్సీకి అనుకూలంగా రాసిన పదాలూ చూశాం, వీళ్లెంత..? హైదరాబాద్ రోడ్లపై నూనె ఒలికితే ఎత్తుకునేంత నునుపుదనం చూశాడు గోరటి… సుద్దాల, గోరటి వీర తెలంగాణవాదులు… ఇప్పుడు తెలంగాణ సమాజం మోస్తున్న ప్రజాకవులు, వాగ్గేయకారులు ఎట్సెట్రా… విషయం ఏమిటంటే… ఈరోజు ఓ వార్త… సరిగ్గా ఏడేళ్ల క్రితం… మన దుష్ట, దుర్మార్గ, నీచ, నికృష్ట ఉమ్మడి పాలనలో హైదరాబాద్ ర్యాంకు నాలుగు… అదేనండీ నివాసయోగ్య నగరాల్లో దీని ర్యాంకు… ఇప్పుడు 24వ ర్యాంకు… పిలవండి గోరటిని… చటాక్ నూనె ఒలకబోసి గిన్నెలోకి ఎత్తమనండి… ఎమ్మెల్సీ పదవి ఆమాత్రం ప్రావీణ్యాన్ని ఇవ్వలేదా ఏం..?
అయిదేళ్ల క్రితం మన పాలకుడే విశ్వనగరం చేస్తానన్నాడు… ఇప్పుడు చినుకు పడితే చాలు నగరం స్తంభించిపోతోంది… ఆ దుర్గం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జి తప్ప ఇంకేదీ చెప్పుకోవడానికి లేదు… ఆక్రమణలు, కాలుష్యం, ట్రాఫిక్, డ్రైనేజీ, వరద నీటి నియంత్రణ… ఏ అంశం తీసుకున్నా మనకే స్పష్టంగా అర్థమవుతోంది… ఇది విశ్వనగరం కాదు, దానికి వంద మైళ్ల దూరంలో ఉండిపోయిన, ఉండిపోబడిన… మన పాలనలోనూ మంచి జరగని అధ్వానపాలన అని… ఇప్పుడూ అంతే… పెంపుడు కుక్కతో సేమ్ ప్లేటులో తనూ టిఫిన్ చేసే మేయర్ పాలన వచ్చింది… కేసీయార్ ఇంకా ఇలాంటి ఆణిముత్యాలను ఇంకా ఇంకా ఇవ్వబోతున్నాడు… తలసాని, మల్లారెడ్డి ఎట్సెట్రా ఎన్నెన్ని జయకేతనాలు..? జయహో కేసీయార్… విషయానికొస్తే… కేంద్రం తాజాగా నివాసయోగ్య నగరాల జాబితా ప్రకటిస్తే… హైదరాబాద్ ర్యాంకు 24కి పడిపోయింది… వావ్, ఘనకీర్తి, భుజకీర్తి… విశ్వనగర ఖ్యాతి….!!
Ads
ఇంకా ఎవరూ మొదలుపెట్టలేదు అనుకుంటా… కనీసం నమస్తే తెలంగాణ, నమస్తే ప్రభ, మనతెలంగాణ, నమస్తే సాక్షి తదితర సాగిలబాటు దాస్య పత్రికల్లో వస్తుందనుకుంటే ఎక్కడా కనిపించలేదు… ‘‘ఈ దుర్మార్గ మోడీ గాడు… కావాలనే చేశాడు, తమ పాలన ఉన్న బెంగుళూరును ఫస్ట్ ప్లేసులో పెట్టాడు, శివసేన మహారాష్ట్ర కాబట్టి పూణెను రెండో ప్లేసులోకి తోసేశాడు… టాప్ టెన్‌లో గుజరాత్ సిటీలను పెట్టాడు… అంతా పొలిటికల్ స్ట్రాటజీ… అసలు హైదరాబాదే ప్రపంచంలోని టాప్ టెన్‌లో ఒకటి’’ అంటూ ఏ వ్యాసాలూ కనిపించలేదు… రేపు కనిపిస్తే హాశ్చర్యం లేదు… దొరికింది కదాని వెలుగు పత్రిక వాడు ఫస్ట్ పేజీలో కుమ్మిపారేశాడు… ఏం..? గోరటి కళ్లతో, నమస్తే చెవులతో, టీన్యూస్ మెదడుతో ఆలోచించొచ్చు కదా… ఐనా వీటితో వచ్చేదేముందిలే… జయశంకర్ స్మృతివనంలో పెద్ద సారు బొమ్మలు భలే చెక్కారట కదా… అక్కడక్కడా మొహమాటానికి, మర్యాదకు జయశంకర్ సార్ బొమ్మలు కూడా కనిపిస్తున్నాయట కదా… అవి చాలు మన జీవితానికి… మన మీడియాకు… ఎవర్రా అక్కడ…? సుద్దాలకు, గోరటికి చెప్పి నాలుగు జయగీతాలు అర్జెంటుగా పాడించండి… సారు, నారాజుగా ఉన్నాడు…!! పీఆర్వో విజయకుమార్ లేకపోతేనేం… ఇంకొకడిని వెతకండి అర్జెంటుగా…!! మనం నమ్మేది, చంకకెక్కించుకునేది, కిరీటాలు పెట్టేది అలాంటోళ్లే కదా…!!!
Share this Article