ముందుగా ఒక నేరకథ చదవండి… సంక్షిప్తంగానే… 2009, ఆగస్టు… కేరళ, అలప్పుజా… పాల్ జార్జి… యంగ్… ఓ రెస్టారెంట్లో చిల్ అయ్యాడు… కారులో వేరే రెస్టారెంట్ వైపు బయల్దేరాడు… వందల కోట్ల అధిపతి వారసుడు… ది గ్రేట్ ముత్తూట్ ఫైనాన్స్ ఓనర్ జార్జి రెండో కొడుకు… అడుగు తీసి అడుగేస్తే విలాసం… మార్గమధ్యంలో ఏం జరిగిందో గానీ టూవీలర్ పైన వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కారు ఆపారు… తిట్టేసుకున్నారు… అందులో కరి సతీష్ అనే వాడు కత్తి తీసి జార్జిని కసకసా పొడిచేశాడు… జార్జి అక్కడిక్కడే మరణించాడు… సదరు సతీష్, మరొకడు హడావుడిగా వెళ్లిపోయారు… ఎందుకంటే..? ఇంకెవరినో మర్డర్ చేయడానికి వెళ్తున్నారు వాళ్లు… ఆల్రెడీ సుపారీ తీసుకున్నారు… మధ్యలో ఈ డిస్టర్బెన్స్… ఆల్రెడీ బోలెడు కేసులున్నయ్ తనమీద… అవును, అయితే ఏంటట, నేనే పొడిచేశాను అని సతీష్ బహిరంగంగానే అంగీకరించాడు… అయితే నిజం ఏమిటి..?
ఏమో… ఈ స్వీయనేరాంగీకారం తప్పనీ, అసలు హంతకులు వేరే అనీ ప్రచారం… ఆ కుటుంబం మీద కుట్ర లేదా ఆ పాల్ జార్జి మీద కుట్ర అనే ప్రచారం… పోలీసుల నుంచి తండ్రి కోరిక మేరకు సీబీఐకి వెళ్లింది కేసు… సీబీఐ కోర్టు సతీష్‌తోపాటు మరో పదిమందికీ 2015లో యావజ్జీవం వేసింది… 2019లో హైకోర్టు కేసు కొట్టేసి, వాళ్లను విడిచిపెట్టింది… నేను సుప్రీంకోర్టుకు వెళ్తాను అన్నాడు తండ్రి… తరువాత ఆ కేసు ఏమైందో తెలియదు… ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం… ఆ పాల్ తండ్రి జార్జి అసాధారణ స్థితిలో ప్రాణాలు వదిలాడు… అది సహజ మరణం కాదు… డెబ్బయ్ ఏళ్ల వయస్సున్న ఆయన ఢిల్లీలోని తన సొంత ఇంటి టెరేస్ (నాలుగో అంతస్థు) నుంచి పడి మరణించాడు మొన్న… కానీ ఆయన మరణం మీద ఆ కుటుంబం కూడా పెద్దగా సందేహాలు వ్యక్తం చేయడం లేదు… అయితే అది ఆత్మహత్యా..? హత్యా..? ప్రమాదవశాత్తూ జారిపడ్డాడా..? లేక సంఘటనకు ముందు ఏమైనా విషప్రయోగం వంటివి జరిగాయా..? మీడియా కూడా లైట్ తీసుకుంది… అదే కాఫీడే సిద్ధార్థ మరణం మీద ఎంత హడావుడి జరిగింది..?
Ads
జార్జి హైప్రొఫైల్ బిజినెస్ టైకూన్… తన తాతలు, తండ్రుల నాటి బంగారం కుదువ వ్యాపారంలో ఓ ఆఫీసు అసిస్టెంటుగా చేరాడు తను 1979లో… నిజానికి తను చదివింది మణిపాల్ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్… ఈ వ్యాపారానికి పోటీగా తమ దాయాదులే వేరే సంస్థ ఓపెన్ చేశారు… మెల్లిమెల్లిగా ఈ కుదువ వ్యాపారం జార్జి చేతుల్లోకి వచ్చేసరికి 4 రాష్ట్రాల్లో 35 శాఖలుండేవి… 1993లో తను మేనేజింగ్ డైరెక్టరయ్యాడు… వ్యాపారం పెరిగీ పెరిగీ 4500 శాఖలకు… ఏటా 50 వేల కోట్ల టర్నోవర్‌కు చేరింది… వ్యాపారం భిన్నరంగాలకు విస్తరించింది… ఫోర్బ్స్ ధనిక జాబితాలో ఒకడు… ఫిక్కీ జాతీయ కార్యవర్గసభ్యుడు, కేరళయూనిట్ అధ్యక్షుడు, ఇండియన్ ఆర్తడాక్స్ చర్చి మాజీ ట్రస్టీ… భార్య, ఇద్దరు కొడుకులు తన కంపెనీ డైరెక్టర్లు… దేశంలోకెల్లా బంగారంతో లింకై ఉన్న అతి పెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ… అంతటి హై ప్రొఫైల్… పోలీసులు కేసయితే నమోదు చేశారు…
అసలు ఆయన ఆ టైమ్‌లో నాలుగో అంతస్థుకు ఎందుకు పోయినట్టు..? రాత్రి 9.30 దాకా ఏం చేస్తున్నట్టు..? అక్కడ రిలాక్స్ కావడం తనకు అలవాటే అనుకుందాం… ఎలా జారిపడ్డాడు..? పడ్డాడా..? పడవేయబడ్డాడా..? ఆల్రెడీ కొడుకు మర్డర్ మిస్టరీ ఇప్పటికీ తేలలేదు… అసలు మళ్లీ ఏమైనా కుట్ర జరిగిందా..? ఆ కుటుంబం పెదవి విప్పడం లేదు… పోలీసులయితే అసాధారణ మరణం కేసుగా నమోదు చేశారు… పోస్ట్ మార్టం జరిగింది… ఎయిమ్స్ ఫోరెన్పిక్ వైద్యులు భిన్నకోణాల్లో రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నారు..? ప్రాథమిక రిపోర్టు మెదడు నరాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల మరణం అంటున్నారు… అంత పైనుంచి పడితే తగిలే గాయాలు ఇవీ ఒకేరకంగా ఉన్నాయా..? దేహంలో ఏమైనా రసాయన అవశేషాలున్నాయా..? ఏమైనా తేలుతుందా..? అదీ డౌటే… ఎందుకంటే మన దేశంలో చాలా క్రైం కథలు కంచికి చేరవు… పలు దశల్లో అకస్మాత్తుగా జీవం కోల్పోయి, కదలికల్ని కోల్పోతాయి కదా..!! హై ప్రొఫైల్ కుటుంబాల్లో జరిగే యవ్వారాల కథలు ఏమైపోతాయో అస్సలు అర్థం కావు… ఉదాహరణ :: శశిధరూర్ భార్య సునంద పుష్కర్ కేసు ఏమైంది..? పైగా అది దేశద్రోహంతో లింకైన కేసు…!!
Share this Article