భైంసా… భయంసా… హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనే ఏళ్లుగా ఏ చిన్న గొడవా లేదు… అంతకుముందు క్షుద్ర రాజకీయాలు ప్రేరేపించిన మతకల్లోలాలు, కర్ఫ్యూలు, దాడులు, దహనాలు, కత్తిపోట్ల సంఘటనలు బోలెడు… మరి తెలంగాణ, పాత ఆదిలాబాద్ జిల్లాలోని ఆ మారుమూల భైంసా ఎందుకు తగలబడిపోతోంది..? కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశాడుట… దాంతో జాతీయ మీడియావర్గాలు కూడా భైంసా మీద ఓ కన్నేశాయి… వీటి వెనుక రాజకీయ ప్రేరణ ఏమైనా ఉందా అని జాతీయ పాత్రికేయం తెగ పరిశోధనలు చేస్తోంది… నిజమే… ఆ ఒక్క భైంసాలోనే ఎందుకు సమస్య వస్తోంది..? తెలంగాణ పోలీసులకు చేతకావడం లేదా..? ఇదీ ప్రశ్న…! కాదు… పోలీసులకు చేతకాక కాదు…! ఒక్కసారి ఫ్రీహ్యాండ్ ఇచ్చి చూడమనండి… ఒక్కొక్కడినీ తొక్కి నారతీస్తారు… జస్ట్, గుప్పెండు మందే ప్రాబ్లమాటిక్ ఉంటారు ఎక్కడైనా… టాకిల్ చేయలేరా..? చేయగలరు… ఇప్పుడంటే రాజకీయ నాయకులకు ఎక్కడికక్కడ సొంత బలగాలుగా మారిపోయాయి గానీ ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అంటే హడల్ కదా… నక్సల్ ఉద్యమం కణకణమండిన నిత్య ప్రాణగండం రోజుల్లోనే పోలీసులు ప్రాణాలకు తెగించి, పోరాడి, చివరకు సక్సెస్ అయ్యారు కదా… ఈ ఒక్క భైంసా వాళ్లకు ఎందుకు మింగుడుపడటం లేదు..?
రాష్ట్రంలో ప్రాబల్యం పెంచుకోవడానికి మజ్లిసో, బీజేపీయే వీటి వెనుక ఉందా..? లేదు..! అది నిజం కాకపోవచ్చు… తమ వర్గాల నిందితులకు మద్దతుగా ఉండవచ్చుగాక… కానీ అవి కావాలని ఎగదోస్తున్నట్టుగా లేదు… తాము చెప్పినట్టు వినే సర్కారు ఉంది రాష్ట్రంలో.., శాంతిభద్రతల సమస్యల్ని తీసుకొచ్చి, కేసీయార్‌ను డిస్టర్బ్ చేయాలని మజ్లిస్ ఎందుకు భావిస్తుంది..? ఆ ఒక్క భైంసాలో పెట్రోల్ పోస్తే బీజేపీకి వచ్చేది ఏముంటుంది..? సైలెన్సర్లు తీసేసిన బైకులపై కొన్ని ఏరియాల్లో కావాలని తిరగడం ఖచ్చితంగా మరోవర్గం వారిని కయ్యానికి ఆహ్వానించడమే… గత ఏడాదీ చిచ్చు స్టార్టయింది అలాగే కదా… అయితే ఎవరు చేయిస్తున్నారు..? గత ఏడాది కల్లోలాలు జరిగినప్పుడు ‘చిన్న చిన్న గొడవలు’ అని కేసీయార్ తేలికగా తీసిపారేశాడు ఒక ప్రెస్మీట్లో… ఆనాడే సీరియస్ ఎఫెర్ట్ పెట్టి ఉంటే, మళ్లీ ఇప్పుడు ఇవి జరిగేవా..? ఇప్పటికైనా భైంసా ఉద్రిక్తతలకు మూలకారణాల్ని తెలుసుకోగలిగిందా ఈ సర్కారు..? ఎస్.., మత ఉద్రిక్తతల్లో ఎవరూ మరింత పెట్రోల్ చల్లకుండా, రాజకీయాలకు వాడుకోకుండా బీజేపీ నేతల్ని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు, గుడ్… మరి భయం బాధితులకు దక్కిన భరోసా ఏది..? ఏ రాత్రి ఎవరు విరుచుకుపడి నిప్పుపెడతారో అనే భయం, ఆందోళనల నుంచి వారికి విముక్తి ఏది..? మాకేమీ కాదు అనే అలుసు కల్లోలకారులకు ఎలా దక్కుతోంది..? ఎక్కడో ఏదో తేడా కొడుతోంది… ఏడాది క్రితం గుర్తుందా..? కరోనా కమ్మేస్తున్నప్పుడు, ఎహె, ఆఫ్టరాల్ పారాసెటమాల్ చాలు అని సభలోనే తేలికగా కొట్టేశారు… అదెంత పనిచేసిందో చూశాం కదా… చేస్తూనే ఉంది కదా… ఏదైనా పుండు దశలోనే మందు పూయాలి, రాచపుండు అయ్యేదాకా చూడొద్దు… చూడొద్దు… భైంసా చిన్న కురుపు కాదిప్పుడు… కేసీయార్‌కు తెలియక కాదు… కాదు…!! అవునూ… దిగువ స్థాయి దాకా పోలీసులు ఏం ఫీలవుతున్నారో ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం జరుగుతోందా అసలు..?!
Ads
Share this Article