అభ్యర్థులకు ఎన్నికల ఇంటర్వ్యూలు!
——————
రెండు మూడు దశాబ్దాల కిందటి రాజకీయాలకు- ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడానికి సాంకేతిక విధానాలు, శాస్త్రీయ పద్ధతులు, సర్వేలు, ఇంటర్వ్యూలు, పరీక్షలు ఇలా ఎన్నెన్నో వచ్చాయి. దేశ రాజకీయాలన్నీ ఒక ఎత్తయితే- తమిళ రాజకీయమే ఒక ఎత్తు. ద్రవిడ ఉద్యమాలు, సినిమా వ్యామోహాలు తమిళ రాజకీయాల్లో కలగలిసి ఉంటాయి. ఎన్నికల ప్రచారంలో పాటలు, స్లోగన్లు, మిమిక్రీ హాస్యసంభాషణలు ఇలా తమిళ రాజకీయం ఒక సినిమా స్క్రిప్ట్. ఒక మ్యూజిక్ సిటింగ్. ఒక సినిమా విడుదల. భాష, వేషం, ప్రచారాల్లో తమిళులను అందుకోవడం ఇంకెవరికీ సాధ్యం కాదు. దాదాపుగా తమిళ ఎన్నికల ప్రచార సూత్రాలనే అన్న ఎన్ టి ఆర్ అధ్యయనం చేసి, అదే శైలిలో జనసామాన్యానికి దగ్గరయ్యాడు.
రాజకీయాల్లో చేయడం కంటే చేస్తున్నట్లు లేదా చేసినట్లు కనిపించడం, అనిపించడం చాలా ముఖ్యం. ఒక నాయకుడు నవారా కుర్చీలో పచ్చటి లాన్ లో కూర్చుని మాట్లాడుతుంటాడు. ఆయన పక్కన టేబుల్ మీద రాగి చెంబు, కొన్ని పుస్తకాల పేర్లు కనపడేలా ఫోటో ఒకటి విడుదల అవుతుంది. అంటే- ఆ నాయకుడు ఆ మూడు వందల కోట్ల ఇంట్లో కాకుండా, రాష్ట్ర ప్రజలకోసం ఎర్రటి ఎండలో రాగి చెంబు నీళ్లు తాగుతూ, అనేక గ్రంథాలను ఔపోసన పడుతున్నాడని మనం అనుకోవాలి. ఇదొక సంకేత భాష. అభిమానులు ఈ ఫోటోను, వీడియోను వైరల్ చేసి అంతులేని ఆత్మానందాన్ని పొందుతూ ఉంటారు.
Ads
ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేయడానికి తమిళనాడులో మొదటినుండి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. డి ఎం కె ప్రస్తుత అధిపతి స్టాలిన్ ను అప్పుడు కరుణానిధి బృందం ఇంటర్వ్యూ చేసింది. స్టాలిన్ కొడుకు నటుడు ఉదయనిధిని స్టాలిన్ బృందం ఇప్పుడు ఇంటర్వ్యూ చేసింది. ఈ రెండు ఫోటోలను కలిపి ఒక వార్తగా డి ఎం కె విడుదల చేసింది. యువజన నాయకుడిగా రాష్ట్రమంతా ప్రచారం చేయాలి కాబట్టి ఉదయానిధికి ఎమ్మెల్యే టికెట్టు ఇవ్వలేదట. ఇంటర్వ్యూ జరిగినంత సేపు కుర్చీలో కూర్చోమన్నా ఉదయనిధి కూర్చోలేదట. ఎంత వినయం? ఇదంతా వార్తగా ఎలా రావాలని వారు కోరుకున్నారో అలాగే వచ్చింది. అలాగే వస్తుంది. అదే స్క్రిప్ట్ మహిమ.
ప్రాంతీయ పార్టీల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలి? ఎవరికి ఇవ్వకూడదన్నది పూర్తిగా పార్టీ అధినాయకుడి/నాయకురాలి ఇష్టం. వారి దయ దాక్షిణ్యాల మీదే అభ్యర్థిత్వాలు ఆధారపడి ఉంటాయి. పూజా విధానంలో సంకల్పం మొదట్లో “మమ” అని ఒక తప్పనిసరి మాట ఉంటుంది. మమ అనుకోండి అని పూజారి చెబుతాడు. మమ అని మనం అనుకున్న తరువాత ఇక పూజంతా పూజారి చూసుకుంటాడు. లేదా చేసుకుంటాడు. అందువల్లే ఇష్టం లేకుండా, ఏదో ఒకటి అయ్యిందనిపించే సందర్భానికి “మమ అనిపించడం” అన్న సామెత పుట్టింది. రాజకీయాల్లో కూడా ఎన్నో “మమ” అనిపించడాలు ఉంటాయి. ఒక పార్టీ సర్వం సహా అధినేత కుమారుడయినా ఇంటర్వ్యూకు రావాల్సిందే. ప్రశ్నలకు తగిన సమాధానాలు చెప్పి మార్కులు తెచ్చుకోవాల్సిందే. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే ఎంతటి వారికయినా టికెట్టు రాదు- అని మనం అనుకోవాల్సిందే. అందుకోసం ఇలాంటి “మమ” అనిపించడాలు జరగాల్సిందే!…..
కొసమెరుపు :- రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలన్న కారణంతో మొదట ఉదయనిధికి టికెట్టు నిరాకరించారు. చివరి నిముషంలో మద్రాస్ చెపాక్ నియోజకర్గ అభ్యర్థిగా ప్రకటించారు. Blood is thicker than water. అంతా అనుకున్నట్లుగానే పక్కాగా స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది! …… By…. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article