తన మాటల మాధుర్యాన్ని, పాటల హాయిని మన చెవులలో పోసి గుండెల్లో నింపేసిన వారు పింగళి నాగేంద్రరావు గారు.
ఆయన రాసిన సినీగీతాలలో కనీసం కొన్ని పల్లవుల మొదటి లైన్లైనా నోటికి రాని తెలుగువారుండరేమో!
ఆడువారి మాటలకు అర్థాలు వేరులే!
బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే!
రావోయి చందమామ మా వింతగాథ వినుమా
లేచింది నిద్రలేచింది మహిళాలోకం!
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో!
చూపులు కలసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరము!
అహ నా పెళ్ళియంట ఓహో నా పెళ్ళియంట!
లాహిరి లాహిరి లాహిరిలో!
ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు!
వినవే బాలా నా ప్రేమ గోలా!
కలవరమాయే మదిలో నా మదిలో !
ఎంత ఘాటు ప్రేమయో!
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా, గొప్ప నీతివాక్యమిదే వినరా పామరుడా!
జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయీలే హలా!
Ads
ఇలా చెప్పుకుంటూ వెళితే ఆయన రాసిన మొత్తం పాటల లిస్టంతా పెట్టాలి.
చందమామ చల్లగా మత్తుమందు చల్లగా వంటి వారి పదబంధాల గురించి చెప్పుకోవాలంటే కనీసం నాలుగైదు వ్యాసాలన్నా రాయాలి.
ఇక మాటల రచనలో కూడా ఆయన చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేసుండరేమో!
సాహసము సేయరా ఢింభకా!
జనం అడిగింది మనం చేయవలెనా? మనం చేసింది జనం చూడవలెనా?
పుట్టించక పోతే మాటలెలా పుడతాయి!
ఎంత చెబితే అంతేగాళ్లు!
నిక్షేపరాయుళ్ళు!
ఇలా తెలుగు సినీ భాషను కొత్త మార్గంలో నడిపించి సినిమా భాషకు పరిభాషగా మారారు పింగళి గారు.
పింగళి గారు సినీ రచన చేయడానికి ఎన్నో సంవత్సరాల ముందే నాటక రచన చేశారు. మొదట్లో అనువాద నాటకాలు రచించిన ఆయన తరువాత స్వతంత్ర నాటక రచనకు పూనుకొని అద్భుతాలు సృష్టించారు.
ఇప్పుడు అందుబాటులో ఉన్న వారి అనువాద, స్వతంత్ర నాటకాలు మొత్తం కలిపి తొమ్మిది.
వాటిలో జేబున్నీసా, నారాజు, వింధ్యరాణి మహోన్నతంగా అనిపిస్తాయి.
జేబున్నీసా…ఔరంగజేబు ముద్దుల కుమార్తె. విద్యావంతురాలు. తండ్రికి పాలనా వ్యవహారాలలో చేదోడు-వాదోడుగా ఉంటూ ఉంటుంది. ఛత్రపతి శివాజీ ధర్మపరిరక్షణాదీక్షను, అతని పరాక్రమాన్ని ఆరాధిస్తుంటుంది. ఈలోగా కపటనీతితో శివాజీని, అతని కుమారుడు శంభాజీని తన కోటలో బంధిస్తాడు ఔరంగజేబు. ఇలా కపటోపాయంతో ఒక మహావీరుడిని అవమానించడం తప్పు కదా! అని తండ్రిని నిలదీస్తుంది ఉన్నీసా. ఉన్నీసా శివాజీని ప్రేమిస్తుందని భావించి విచారగ్రస్తుడవుతాడు ఔరంగజేబు.
ఉన్నీసా శివాజీని ఎలా అయినా తప్పించాలనుకుంటుంది. ఆ క్రమంలో పొరపాటున ఔరంగజేబు చెల్లెలైన రోషనార దగ్గర బంధీ అవుతాడు శివాజీ. రోషనార శివాజీని మోహించి తన కోరిక తీర్చమంటుంది. పరస్త్రీలను తల్లిలా భావించే శివాజీ అందుకు అంగీకరించడు. దానితో రోషనారకు శివాజీ మీదనున్న మోహం ద్వేషంగా మారుతుంది. తన మేనకోడలైన ఉన్నీసా శివాజీని తన వలలో వేసుకోవడమే దీనికంతటికీ కారణమనుకొని అపోహ పడుతుంది. ఈలోగా ఉన్నీసా శివాజీని తెలివిగా చెరనుండి తప్పిస్తుంది. అంతేకాకుండా అక్కడ నుండి శివాజీ తన రాజ్యం చేరే మార్గంలో అతనికి ఎదురైన మరో ఆపదనుండీ పురుషవేషంలో వచ్చి రక్షిస్తుంది. తనను కాపాడుతున్న ఈ అపరిచితుడెవరో ఎందుకు తనను కాపాడుతున్నాడో తెలుసుకోవడానికి ఆమెను ఎంత ప్రశ్నించినా… నిజం బయటపెట్టదు ఉన్నీసా.
రోషనార తన అన్న అయిన ఔరంగజేబుతో… ఉన్నీసా శివాజీని తప్పించి అతనితో కలిసి పారిపోయిందని నమ్మిస్తుంది. శివాజీ రాజ్యం మీద దండయాత్రకు అన్నగారిని ఒప్పిస్తుంది. ఈలోగా ఉన్నీసా నుండి ఔరంగజేబుకు ఒక లేఖ వస్తుంది. తాను శివాజీ ధర్మనిరతిని, వీరత్వాన్ని అభిమానించానే తప్ప, అతనిని మోహించలేదన్నది ఆ లేఖ సారాంశం. ఔరంగజేబు ఆలోచనలో పడతాడు. తన కుమార్తె చేసినదానిలో తప్పేమీ లేదుకదా అన్న భావన మొదలవుతుందతనిలో.
మొఘలాయి సేనాపతులతో కలిసి, మగవేషంలో రోషనార కూడా యుద్ధ భూమిలో ప్రవేశిస్తుంది. గెలుపు శివాజీని వరిస్తుంది. శివాజీని వెనుకనుండి హతమార్చపోయిన మొఘల్ సేనానాయకుని నుండి శివాజీని మరోమారు రక్షిస్తుంది మారువేషంలో వచ్చిన ఉన్నీసా. యుద్ధంలో ఓడిపోయినా సరే వారందరినీ గౌరవంగా చూడమని, వాళ్ళ కోరికపై నగరం బయట వాళ్ళకు విడిది ఏర్పాటు చేయమని ఆదేశిస్తాడు శివాజీ. శివాజీ సుమనస్కతను, ఉన్నీసా హృదయాన్ని అర్థంచేసుకుంటుంది రోషనార. ఆత్మహత్య చేసుకోబోతున్న మేనకోడలిని వారించి ఓదార్చి అక్కున చేర్చుకుంటుంది. సన్యాసిని వేషాలలో శివాజీకి జయజయధ్వానాలు పలుకుతూ వారక్కడ నుండి నిష్క్రమించడంతో నాటకం పూర్తవుతుంది.
ఇదీ టూకీగా కథ.
ఒక హిందూ మహావీరునిపై ఒక ముస్లిం చక్రవర్తి కుమార్తెకు కలిగిన పవిత్రమైన ఆరాధనే ఈ నాటకానికి మూలకథ.
శివాజీ సేనాపతులలో ఒకడైనా ఆబాజీ ఒక ముస్లింరాజును ఓడించి, సౌందర్యవతి అయిన అతని కోడలిని శివాజీకి కానుకగా తీసుకువస్తాడు. అందుకు కోపంతోను, బాధతోను విలవిల్లాడతాడు శివాజీ. ఆమెను తల్లిగా భావించి, నమస్కరించి తిరిగి ఆమె రాజ్యానికి సగౌరవంగా పంపిస్తాడు. రోషనార వంటి అమితమైన అధికారం గల స్త్రీ తనను వాంఛించినా, తన కోరిక తీరిస్తే సామ్రాజ్యం కట్టబెడతానని ప్రలోభపెట్టినా లొంగడు.
పరస్త్రీలలో మాతృమూర్తిని చూసే శివాజీ ధర్మదీక్ష ఈ సందర్భాలలో కనపడుతుంది. ఔరంగజేబు చెరనుండి తప్పించుకోవడానికి శివాజీ పన్నిన ఉపాయం చూస్తే ఆతని తెలివితేటలు అవగతమవుతాయి. చేజిక్కిన శత్రువులను విడిచిపెట్టడంలోను, గాయపడిన శత్రుసైనికులకు కూడా వైద్యం చేయించడంలోను శివాజీ మానవీయకోణం వెలుగులీనుతుంది. తనను శరణుజొచ్చిన బహమనీ సుల్తాను సైనికులు 700 మందిని తన సైన్యంలో చేర్చుకోవడంలోను, తన రాజ్యంలో ఉన్న ముస్లింల కోసం మసీదులు కట్టించడంలోను శివాజీ పరమత సహనం ఎంత మహోన్నతమైనదో తెలుస్తుంది. ఇక యుద్ధంలో అతను చూపిన పరాక్రమం సంగతి సరేసరి.
ఇక జేబున్నీసా విషయానికి వస్తే… ఆవిడొక పవిత్రమూర్తి. శివాజీని ఎంతగా ఆరాధించినా ఆ విషయం బయటపెట్టాలనుకోదు. తన చెరలో బంధీగా ఉన్న శివాజీ మతం మారడానికి అంగీకరిస్తే నువ్వతనిని వివాహం చేసుకోవచ్చన్న తండ్రి మాటకు దుఃఖిస్తుంది. తను ప్రేమించినది…అతనిలో ఉన్న ధర్మపరాయణత్వాన్ని, స్వాతంత్రేచ్ఛను, తనమతానికి హానికలిగిస్తున్న పరిస్థితులను నిర్మూలనం గావించాలనే అతని సంకల్పాన్ని. అందుకే అతనిని తను ఎంతగా ఆరాధిస్తున్నా, తను ఎన్నిమార్లు అతనిని ప్రమాదాలబారి నుండి తప్పించినా తానెవరో కూడా అతనికి తెలియనివ్వదు.
జిజియా పన్ను వంటి వాటితో హిందువులను పీల్చిపిప్పిచేసిన తన తండ్రిలో కూడా మత సహనం అనే బీజాలు నాటి హిందూ దేవాలయాల జోలికి, హిందూ సంప్రదాయాల జోలికి తన సైనికులెవ్వరూ వెళ్ళరాదంటూ ఆజ్ఞ జారీ చేసేలా చేస్తుంది. ఇటువంటి అపూర్వమైన వ్యక్తిత్వాల ప్రేమకథే ఈ నాటకం.
పింగళిగారి ప్రేమపూరితమైన, వేదాంత గర్భితమైన సంభాషణలు, మధ్యమధ్యలో వచ్చే పద్యాలు, “నేను నీకుమారునివంటి వాడను” అని శివాజీ అంటే…”అవును నువ్వు నాకు మరుని వంటి వాడవు” అని రోషనార అనే వాక్యవిన్యాసాలు ఎన్నో ఉన్న నాటకం ఈ జేబున్నీసా.
ఈ నాటకం రాస్తున్నప్పుడే పింగళి వారిపై, కృష్ణా పత్రికపై ఎన్నో విమర్శలొచ్చాయి. ముస్లిం యువతి హిందూ వీరుణ్ణి ప్రేమించడమేమిటని అయ్యదేవర కాళేశ్వరరావు వంటివారు తమ స్వరాజ్య పత్రికలో తీవ్రంగా విమర్శించారు. చివరికి ఆ విమర్శలు బ్రిటీష్ ప్రభుత్వం ఈ నాటకాన్ని నిషేధించే వరకూ వెళ్ళింది. ఆ విమర్శకు కృష్ణాపత్రికాధిపతి ముట్నూరి కృష్ణారావు గారు ఘాటుగా జవాబిచ్చారు.
ధర్మశాస్త్రాలననుసరించి ప్రేమ పుట్టదని, రెండు వేర్వేరు మతాలకు చెందిన వారు ప్రేమించుకున్నట్టు రాయడమే నేరమైతే ఇక ప్రేమతత్వానికి చోటెక్కడని ఆయన ఆవేదనగా ప్రశ్నించారు.
అన్ని మతాలనూ నిర్జించి ఏదో ఒక మతము నిలబడటమన్నది కల్ల అని, పరమత సహనం అంటే ఎవరి మతాన్ని వారు గౌరువించుకుంటూనే అవసరమైనప్పుడు ఇతర మతాలవారికి బాసటగా నిలవడమని, ఈ నవలలో ఉన్న మహోన్నత ప్రేమతత్వాన్ని గ్రహించలేక ఇటువంటి విమర్శలు చేయడం తగదని పత్రికాముఖంగానే ఆయన సమాధానమిచ్చారు. ఆయన సమాధానం ఆసాంతం చదివితే ముట్నూరి కృష్ణారావుగారంటే అభిమానం ఇనుమడిస్తుంది.
పింగళిగారు రాసిన ఇటువంటి నాటకం ఒకటుందని చాలాకాలం క్రితం మల్లాది రామకృష్ణశాస్త్రిగారి “చలువ మిరియాలు” పుస్తకం చదివినప్పుడు తెలిసింది. తరువాత చాలా సంవత్సరాల తరువాత Bharadwaja Rangavajhala గారి FaceBook పోస్ట్ చదివినప్పుడు పింగళిగారి నాటకాలన్నీ రెండు సంపుటాలుగా వచ్చాయని తెలిసి, ఆ పుస్తకాల కోసం ఆయనను కలిసినప్పుడు వారే ఈ ప్రచురణకు ప్రధానకారకులన్న విషయం కూడా తెలిసింది. ఇటువంటి మరుగునపడిన ఆణిముత్యాలను వెలుగుచూసేలా చేసిన వారికి మనఃపూర్వక ధన్యవాదములు! స్వస్తి! -రాజన్ పి.టి.ఎస్.కె
Share this Article