రీసెంటుగా నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా ట్రెయిలర్ రిలీజ్ చేశారు కదా… మన గోకుల్ చాట్ పేలుళ్ల సీనూ పెట్టారు… ఓ టెర్రరిస్టు ‘అరెస్టు చేస్తావా, చేసుకో’ అంటుంటాడు… నాగార్జున సరిగ్గా కనుబొమల నడుమ కాలుస్తాడు… ‘‘ఏమవుద్దిరా..? కేసు పెడతారు, రెండు పూటలూ బిర్యానీ పెడతారు, జెడ్ సెక్యూరిటీ ఇస్తారు’’ అని ఒకడు చెబుతుంటాడు… నిజమే, ఎన్ని చూడలేదు..? హోం మంత్రి బిడ్డను కిడ్నాప్ చేస్తే, పట్టుబడిన ఉగ్రవాదులను వదిలేస్తే, వాళ్లు ప్రపంచ స్థాయి టెర్రరిస్టు సంస్థల్ని నడిపిస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం కదా… అంతెందుకు..? ఇప్పుడు తీహార్ జైలులో ఉన్న తెహసీన్ అక్తర్ అనే టెర్రరిస్టు ఆ జైలు నుంచే ఏకంగా ముఖేష్ అంబానీ మీద దాడులకు ప్లాన్ చేశాడు… అవును, తనే ఇండియన్ ముజాహిదీన్ వీర టెర్రరిస్టు… గతంలో ఏకంగా మోడీ పాట్నా ర్యాలీని టార్గెట్ చేసింది తనే… హైదరాబాద్ సహా పలుచోట్ల బాంబు పేలుళ్ల బాధ్యుడూ తనే… తనకు ఏమైంది..? ఏమీ కాలేదు… ఎంచక్కా జైలులో కూర్చుని హాయిగా తన కార్యకలాపాలను సాగిస్తున్నాడు… ఇదీ మన భారతం…
ముఖేష్ అంబానీ ఇల్లు అంటానియా ఎదుట డిటొనేటర్లతో ఓ కారు పట్టుబడటం, అందులో ముఖేష్ సెక్యూరిటీ వెహికిల్స్ ఫేక్ నంబర్ ప్లేట్లు దొరకడం, తరువాత క్రిప్టోకరెన్సీలో తాము అడిగినంత డబ్బు జమచేయాలనీ, లేకపోతే ఈసారి డిటొనేటర్లున్న వెహికిల్ మీ పిల్లల కాన్వాయ్ నడుమకు వెళ్తుందని టెలిగ్రామ్ యాప్ ద్వారా బెదిరింపులు రావడం, ఇజ్రాయిలీ గూఢచార సంస్థ మొసాద్ సాయం కూడా తీసుకుని మన ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుండటం జరిగిన కథ… తాజా ఎపిసోడ్లు ఏమిటంటే..? అంతటి అంబానీకి బెదిరింపులు వస్తే మొత్తం అధికార యంత్రాంగమే కదులుతుంది కదా… కదిలింది… ఓ ప్రైవేటు టెక్ సంస్థను ఎంగేజ్ చేశారు… అది ఏం చేసిందంటే..? టెలిగ్రాం యాప్ ద్వారా ఏ ప్రాంతం నుంచి ఆ మెసేజ్ వచ్చిందో తవ్వడం మొదలుపెట్టింది… జాడలు తీస్తూ పోతే అది తీహార్ జైలుకు తీసుకెళ్లింది… జైలు నుంచి ఆపరేట్ కావడం ఏమిటంటూ వాళ్లు హాశ్చర్యపోయారు… కానీ..?
Ads
(ఇది ముఖేష్ ఇంటి గేటు)
మన జైళ్లలో చాలామంది సెల్ ఫోన్లు మెయింటెయిన్ చేస్తారనీ… జైలు నుంచే చాలా సెటిల్మెంట్లు, దందాలు, తమ యాక్టివిటీస్ సాగిస్తుంటారనీ… మందు, ఇతర విలాసాలూ నడుస్తుంటాయనీ బహిరంగ రహస్యం కదా…… ఈ అంబానీ కేసులో మరోసారి తేలిందీ అదే… అధికారులు గాలించి ఈ తెహసీన్ అక్తర్ దగ్గర సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు… టెర్రరిస్టులు ఎంత టెక్నికల్‌గా వెళ్తున్నారంటే…? మామూలుగా గూఢచారవర్గాలకు ఇతర వెబ్ సెర్చింగ్ ఇంజన్ల ద్వారా దొరకని రీతిలో డార్క్ వెబ్ వాడుతున్నారు.,. టీఓఆర్ ద్వారా డార్క్ వెబ్ తీసుకుని, టెలిగ్రాం యాప్ ఇన్స్టాల్ చేసుకుని, దాని ద్వారా అంబానీకి బెదిరింపు మెసేజులు పెట్టారన్నమాట… ఇతనేమో నొటోరియస్ ఇండియన్ ముజాహిదీన్ కదా… మరి అంతకు ముందు జైష్-ఉల్-హింద్ అనే సంస్థ ఇది తమ పనే అని ఎందుకు క్లెయిమ్ చేసుకుంది..? దర్యాప్తు సంస్థల్ని తప్పుదోవ పట్టించడం కోసమా..? లేక నిజంగానే అది ఓ కొత్త టెర్రరిస్టు సంస్థా..? రెండూ కలిసి పనిచేస్తున్నాయా..? అవన్నీ ఇకముందు తేలాల్సి ఉంది… ఎటొచ్చీ మనం చెప్పుకునేది ఏమిటంటే..? టెర్రర్ కేన్సర్ కణితులను ఆపరేట్ చేసి తొలగించడమే దేహానికి, దేశానికి మంచిది… జైళ్లు, నిర్బంధాలు వారికి కొత్త అడ్డాలుగా ఉంటయ్… అంతే… వైల్డ్ డాగ్ దాకా దేనికి, అంబానీ కేసు చెబుతున్నదీ అదే కదా…!!
Share this Article