సినిమాల్లో చూపించినట్టు… టెర్రరిస్టులో, సంఘవిద్రోహ కేరక్టర్లో దొరకగానే టపీటపీమని ఎన్కౌంటర్ చేసే పోలీసు అధికారులు నిజాయితీపరులనీ, దేశభక్తులనీ, ఆదర్శవంతులనీ అనుకోకండి… అసలు వాళ్ల యవ్వారాలే అధికంగా ఉంటయ్… నానా అవలక్షణాలుంటయ్… దేశాన్ని అమ్మడానికి కూడా సిద్ధంగా ఉండేవాళ్లూ ఉంటారు… మీకు తాజా ఉదాహరణ కావాలి, అంతే కదా… పదండి, మనమూ ముంబై వెళ్దాం… అడిగినంత డబ్బు ఇస్తావా లేకపోతే నీ పిల్లల్నీ, నిన్నూ సఫా చేసేయమంటావా అని అంబానీకి బెదిరింపులు రావడం, బాంబుల వాహనం ఒకటి శాంపిల్‌గా ఇంటిముందు వదిలేయడం కేసు తెలుసు కదా… తీహార్ జైలు నుంచే ఆపరేట్ చేస్తున్నారని నిన్న మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నాం కదా… ఇప్పుడు ఇంకో ట్విస్టు… ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న సచిన్ వాజే అనే ఓ పోలీస్ ఆఫీసర్ ఈ ముఠా భాగస్వామిగా దొరికిపోయాడు… ఆగండి… ఇంకా చాలా కథ ఉంది…
డిటొనేటర్లు ఉన్న వెహికిల్ ఎవరిది..? మన్సుఖ్ హీరేన్ అనే వ్యక్తిది… తను ఆటో పార్ట్ డీలర్… మొన్న అకస్మాత్తుగా శవమయ్యాడు… ఆత్మహత్య చేసుకున్నాడా..? ఆధారాలు బయటికి రాకుండా ఈ ముఠాయే సఫా చేసిందా తెలియదు… మిస్టరీ డెత్… రెండో కారణమే కరెక్ట్ కావచ్చు… దాన్ని దర్యాప్తు చేస్తూ, తీహార్ జైలులో దొరికినవాడిని ఇంటరాగేట్ చేస్తూ తవ్వేకొద్దీ ఈ సచిన్ వాజే దొరికిపోయాడు… మరణించిన హీరేన్ భార్య కూడా ఆ వెహికిల్‌ను ఈ పోలీస్ అధికారి సచిన్ వాజే లీజుకు తీసుకున్నట్టు చెప్పింది… దొంగతనానికి గురైందనడం అబద్ధమనీ, తన భర్తను ఈ పోలీసే చంపేశాడని ఆరోపించింది… తనకు చుట్టుకుంటోందని గమనించిన సచిన్ థానే సెషన్స్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్‌కు ప్రయత్నించాడు… కానీ ఫలించలేదు…
Ads
తరువాత దర్యాప్తు టీం తనను తీసుకెళ్లి… పదీపన్నెండు గంటలపాటు ‘‘ప్రశ్నించింది’’… ఇక తప్పు అంగీకరించక తప్పలేదు… ఎన్కౌంటర్ స్పెషలిస్టు కదా, ఇలాంటి కేసుల్లో ఏం జరుగుతుందో తెలుసు కదా… తనను ఎన్కౌంటర్ చేయడం గ్యారంటీ అనుకున్నాడు… ఈ ప్రపంచానికి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది అంటూ ఓ వాట్సప్ స్టేటస్ కూడా పెట్టుకున్నాడు… కానీ దర్యాప్తు టీం తుపాకీకి పనిచెప్పలేదు, కేసు పెట్టారు… అరెస్టు చూపించారు… రకరకాల సెక్షన్లు కుమ్మేశారు… ఈ కేసుతో సచిన్ సంబంధాలు బయటపడగానే… బుధవారమే ముంబై క్రైం బ్రాంచ్ నుంచి తనను తొలగించారు… ఫైనల్ ట్విస్టు ఏమిటంటే..? ఈ సారు గారి గతం కూడా సజావుగా ఏమీ లేదు… ప్రాబ్లమాటిక్ పర్సనాలిటీయే… క్వాజా యూనిస్ అనే నిందితుడి కస్టోడియల్ డెత్ కేసులో సస్పెండయ్యాడు కూడా… సస్పెండ్ కాగానే నేరుగా వెళ్లి శివసేనలో చేరిపోయాడు… ఎంచక్కా పార్టీ కార్యక్రమాల్లో మునిగిపోయాడు… ఇప్పుడు శివసేన ప్రభుత్వం వచ్చింది కదా… వెంటనే మళ్లీ సర్వీసులోకి వచ్చేశాడు… అర్ణబ్ ని అరెస్ట్ చేసింది ఈయనే… చూశారు కదా… లింకులు ఎక్కడెక్కడికి పాకిపోయాయో… అదీ సంగతి…!!
Share this Article