గుజరాత్ అసెంబ్లీలో టీ షర్ట్ నిషేధం!
——————–
భారత దేశంలో రాజకీయం అన్న మాట నిందార్థంలోకి ఎప్పుడో మారిపోయింది. రాజకీయం చేయకు. ప్రతిదాన్ని రాజకీయాలకు వాడుకోవడం…ఇలా రాజకీయం అంటే అర్థమేమిటో ఇప్పుడు కొత్తగా వివరించాల్సిన పని లేదు. అదే ఇంగ్లీషులో అయితే politically correct – అని రాజకీయంగా సరయినదే అనే అర్థం వచ్చేలా మాట కూడా ఉంది. రాజనీతి శాస్త్రాన్ని- రాజకీయాన్ని ఒకేగాట కట్టేస్తుంటారు. రాజనీతి శాస్త్రం పుస్తకాల్లో ఉంటుంది. అది చదువుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. రాజకీయం పుస్తకాల బయట ప్రజా క్షేత్రంలో ఉంటుంది. అది పుస్తకాలకు అందని మహా బ్రహ్మ పదార్థ విజ్ఞానం.
రాజకీయ స్వరూప స్వభావాలు, దాని డ్రెస్ కోడ్, గుణ గణాలు పది మార్కుల ప్రశ్నకు రాసే సమాధానం కాదు. ఎంత రాసినా ఇంకా ఎంతెంతో మిగిలి ఉండేదే రాజకీయం. భారత దేశంలో రాజకీయం ఎప్పుడూ వైట్ అండ్ వైట్ కాటన్ బట్టలనే వేసుకోవాలి. గంజి పట్టి, ఇస్త్రీ చేసిన ఆ తెల తెల్లటి బట్టలు కత్తి అంచులా గుచ్చుకోవాలి. రాజకీయ నాయకులు ఇలా వైట్ అండ్ వైట్ వేసుకోవాలి అని రాజ్యాంగంలో ఎక్కడా నియమం లేదు. నిజానికి ఆ తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్ మెయింటైన్ చేయడానికే సగం మంది రాజకీయనాయకులు సగం ఆస్తులు అమ్మేసుకుంటూ ఉంటారు. కొందరు ఈ డ్రెస్సుల కోసమే సంపాదనలో ఉంటారు. యూరోప్, అమెరికాల్లో రాజకీయనాయకులకు సూటు, బూటు మొదటి నుండి అలవాటు. మన దగ్గర ఎందుకో తెల్లబడింది. బహుశా శ్వేత పత్రాలు డిమాండు చేసి చేసి డ్రెస్ కూడా తెల్లబడినట్లుంది. ఉత్తరాది వారి కుర్తా, పైజామా అయినా, దక్షిణాది వారి ప్యాంట్ చొక్కా అయినా, తమిళనాడువారి అడ్డ పంచె చొక్కా అయినా…అంతా తళ తళలాడే తెలుపే అయి ఉండాలి. హిందూ సంప్రదాయంలో ఆ రంగు వస్త్రాలు ఎందుకు ఎప్పుడు ఎవరు వాడాల్సి వస్తుందో ఇక్కడ అనవసరం. అమంగళము ప్రతిహతమగుగాక!
——————–
Ads
గుజరాత్ సముద్ర తీరంలో సోమనాథ్ పవిత్ర క్షేత్రం గురించి పరిచయం అక్కర్లేదు. ఆ సోమనాథ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే విమల్ ను అసెంబ్లీ నిండు సభలో నుండి బయటికి పంపడం పెద్ద వార్త అయ్యింది. విమల్ గొడవ చేయలేదు. కాగితాలు చించి స్పీకర్ మీద వేయలేదు. మైకులు విరగ్గొట్టలేదు. టేబుల్ మీద ఎక్కి చిందులు వేయలేదు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోలేదు. సభ జరుగుతుండగా సెల్ ఫోన్లో బూతు వీడియోలు చూడలేదు. సభలోపలి శీతల గాలులకు గుర్రుపెట్టి నిద్ర పోలేదు.
మరి విమల్ ను ఎందుకు సభ నుండి బహిష్కరిస్తూ స్పీకర్ ఆదేశాలిచ్చినట్లు? ఆయన కాలర్ లేని నలుపు రంగు టీ షర్ట్ వేసుకుని సభలోకి వచ్చినందుకు. సభా మర్యాదను మంటగలిపినందుకు.
ఒంటి మీద బట్టల్లేకుండా సభలోకి వస్తే తప్పు కానీ- ఒళ్లంతా కప్పుకున్న టీ షర్ట్ ఏ రకంగా దోషమో చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు సభను చాలా సేపు స్తంభింపజేశారు.
నిజమే. గిట్టుబాటు ధర దొరకని రైతులు, కరోనా సెకెండ్ వేవ్ లాక్ డౌన్లు, ఉపాధి లేని కోట్ల మంది బాధలకంటే- సభలో రంగుల చొక్కాలు తీవ్రాతి తీవ్రమయిన సమస్య. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని రాష్ట్రాల స్పీకర్లతో పార్లమెంట్ స్పీకర్ అత్యవసర, ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి-
1 . సభ్యులు ఏ రంగు చొక్కా, ఏ రంగు ప్యాంట్ వేసుకోవాలి?
2 . లింగ వివక్షకు తావు లేకుండా ఆ డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి?
3 . కాలర్ ఎన్ని అంగుళాలు ఉండాలి?
4 . చొక్కాకు ఎన్ని గుండీలు ఉండాలి?
5 . గంజికి కూడా దిక్కులేని దేశంలో చొక్కాలకు గంజి పెట్టడం నైతికంగా సరయినదేనా?
6 . పంచాయతీ వార్డు మెంబరు నుండి ప్రధాని దాకా స్థాయిని బట్టి డ్రెస్ కోడ్ ఉండాలా?
అన్న విషయాలను లోతుగా చర్చించి ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాలి!
-పమిడికాల్వ మధుసూదన్
Share this Article