సోషల్ మీడియా ఖాతాల్లో, పోస్టుల్లో 80, 90 శాతం ఫేక్ కావచ్చుగాక… కానీ ఈరోజు జనాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్నది సోషల్ మీడియా… ఎన్నికల్ని ఒకరకంగా శాసిస్తున్నది సోషల్ మీడియా… పార్టీల విధానాలు, ఆచరణ, ముఖ్యనేతల ముచ్చట్లు కాదు… వాటిని నిలదీసి విశ్లేషించే సోషల్ మీడియా ప్రజల్ని ఆలోచింపజేస్తున్నది… అది వోట్ల సరళినీ నిర్దేశిస్తున్నది…. మామూలుగా చూస్తే ఇది ఓ అతిశయోక్తి అభిప్రాయంలాగా కనిపించవచ్చుగాక… కానీ వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ సీటులో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ వోట్ల దూకుడు చూస్తే మన పాత ఛాందస భావాలకు భిన్నంగా ఆలోచనల్లో పడతాం… పడాలి… పడేలా చేశాడు నవీన్… తను అంతిమంగా గెలుస్తాడా, చివరకు ఓడిపోతాడా అనేది వేరే సంగతి… కానీ ఫస్ట్ ప్రయారిటీ వోట్లలో కోట్లకుకోట్లు ఖర్చుపెట్టిన అధికార పార్టీ అభ్యర్థికి సరైన సవాల్‌గా నిలిచాడు… రెండో స్థానంలో ఉంటున్నాడు… అపారమైన సాధనసంపత్తి, డబ్బు, అధికార పార్టీ, అధికార యంత్రాంగం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు… ఇవేవీ లేకపోయినా సరే… తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన కోదండరాంను సైతం దాటేసి అధికార పార్టీ అభ్యర్థికి చెమటలు పట్టిస్తున్నాడు నవీన్… రాటుదేలిన పొలిటికల్ అనలిస్టులు కూడా జుత్తు పీక్కుంటున్నారు… ఇలా… ఎలా..?
ఇదీ సోషల్ మీడియా ఇంపాక్ట్… తను గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి… కానీ సోదిలోకి లేకుండా పోయాడు… కానీ ఈసారి స్వతంత్రుడు… ఏ బంధాలూ లేవు, ఏ పార్టీ విధానాల ఒత్తిళ్లూ లేవు… కేవలం ‘ప్రశ్న’ను నమ్ముకున్నాడు… ‘నిలదీత’నే సిద్ధాంతంగా తీసుకున్నాడు… ఓ యూట్యూబ్ చానెల్, సోషల్ మీడియా… ప్రభుత్వ విధానాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో సరళంగా, వ్యంగ్యంగా చెప్పడం మొదలుపెట్టాడు… ఏం చేసుకుంటారో చేసుకొండి, కేసులు పెడతారా, పెట్టండి, జైలులో వేస్తారా, వేయండి… అనే రీతిలో తెగింపు, తెగువ, తెలివి… వాటికి తోడు సోషల్ మీడియా రీచ్… తనకు పెద్ద పెద్ద టీమ్స్ లేవు… పార్టీల మద్దతు లేదు… కోట్లకుకోట్ల డబ్బు లేదు… ఐనాసరే, ఫుల్ లైమ్ లైట్లో ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం అయ్యాడు… ఇక అసలు కథ చెప్పుకుందాం… ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ ఎన్నికల వ్యూహకర్తలు అనే దందా స్టార్ట్ చేశాక… అది వందలు, వేల కోట్ల బిజినెస్ అయ్యింది… పార్టీలు సోషల్ మీడియా ఇంపాక్ట్ తెలుసుకున్నాయి… జగన్ కొన్ని కోట్లు ఇచ్చాడు పీకేకు… ఈ తొక్కలో మెయిన్ స్ట్రీమ్ మీడియా మేనేజ్మెంటుకు వందల కోట్లు పెట్టినా ప్రజలు నమ్మడం లేదు… తనకు సొంతంగా పత్రిక, ఛానెల్ ఉన్నా సరే పీకేను నమ్మాడు… తనే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి ప్రధాన పార్టీ అదే బాట…
Ads
మొదట్లో ఎకసక్కేలు ఆడిన చంద్రబాబుకు కూడా అకస్మాత్తుగా కళ్లు తెరుచుకున్నయ్… ఎహెహె అని వెక్కిరించాడు… అదే పీకేకు ఒకప్పుడు సహచరుడిగా పనిచేసిన రాబిన్ శర్మను ఎంగేజ్ చేసుకున్నాడు… సేమ్, కోట్లకుకోట్ల డబ్బు… ఒప్పందాలు… నిజానికి ఈ వ్యూహకర్తలు చెప్పినట్టు ప్రజలు వింటారా..? వినరు… కానీ ఒక క్యాంపెయిన్ నడిపించగలరు… సోషల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తారు… లక్షల మంది ఫోన్ నంబర్ల డేటా… ఫేక్ పోస్టులు, వీడియోలు, ఆడియోలు, పోస్టర్లు, నినాదాలు, వార్తల్ని జనంలోకి తీసుకెళ్తారు… జనంలో చర్చను రేపుతారు… ఎవడు నమ్ముతాడు, ఎవడు నమ్మడు అనేది వేరే సంగతి… కానీ ఇష్యూను రగిలిస్తారు… జనం బుర్రల్లో ఆలోచనల్ని రేకెత్తిస్తారు… అంతేకాదు, రెగ్యులర్ సర్వేలు, స్లోగన్స్… అదొక ప్రొఫెషన్… అదొక డిఫరెంట్ వర్క్… అందరివల్లా కాదు… సరే, మళ్లీ తెలంగాణ విషయానికి వద్దాం…
ఇదే పీకే కేసీయార్ క్యాంపుతో ఎంత టచ్‌లో ఉన్నా సరే… తనను దగ్గరకు రానివ్వడం లేదు… ఈమాత్రం మేం చేసుకోలేమా అనేది ధీమా కావచ్చు… కానీ సోషల్ మీడియా వర్క్ అంటే నెగెటివ్ కోణంలో తమకు నచ్చని వ్యక్తులు, నాయకులు, పార్టీల మీద దుమ్మెత్తిపోయడం, ట్రోలింగ్ కాదు… వీలైనంతవరకూ తమ ఫోల్డ్‌లోకి తెచ్చుకోవడం… ప్రత్యర్థి పార్టీలపై, విధానాలపై ఇష్యూ బేస్డ్ క్యాంపెయిన్ భారీ స్థాయిలో రన్ చేయడం… గుక్క తిప్పుకోలేని, ఊపిరాడని స్థితిలోకి నెట్టేయడం… ((ఉదాహరణ :: బండి సంజయ్ 600 కోట్ల ఆస్తులు… అది ఫేక్… కానీ ఆ బురదను కడుక్కోవడానికే సంజయ్ తన టైం మొత్తం వెచ్చించే స్థితిలోకి తనను నెట్టేయడం… నమ్మేవాడు నమ్ముతాడు, లేకపోతే లేదు… కానీ ప్రత్యర్థి పార్టీని డిస్టర్బ్ చేయడం అన్నమాట…)) కొంతలోకొంత దుబ్బాక ఎన్నికల తరువాత సోషల్ మీడియా ఇంపాక్ట్ ఏమిటో టీఆర్ఎస్ పెద్దలకు కొంచెం అర్థమైంది… గ్రేటర్, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో కొంత సోషల్ హడావుడి క్రియేట్ చేయగలిగారు… కానీ తమ విధానంలో కన్సిస్టెన్సీ ఏది..? నిజానికి లాంగ్ టరమ్ సోషల్ మీడియా వర్క్ మాత్రమే పనిచేస్తుంది… జగన్ వాడుకున్నది అదే… మరిక్కడ నవీన్ చేసిందేమిటి..? ఇది కంప్లీట్ డిఫరెంట్… తను ఏకవ్యక్తి సైన్యంలా పోరాడాడు… ప్రభుత్వ విధానాలపై వెటకారాన్ని దట్టించాడు… అందులో తెగింపు ఉంది, తెగువ ఉంది, తెలివి ఉంది… ఇష్యూస్‌ను జనంలోకి తీసుకెళ్లిన సోషల్ తెలివిడి ఉంది… అది వర్కవుట్ అయ్యింది… చివరకు ఫస్ట్ ప్రయారిటీ వోట్లలోనూ కోదండరాంను దాటేయడం అంటే మాటలు కాదు… ఒక కొత్త బాటను చూపిస్తున్నాడు తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్… సోషల్ మీడియా ఎంత ప్రభావమంతమో నిరూపిస్తున్నాడు… ఇంట్రస్టింగ్…
Share this Article