మన ఆనందం ముందు ఫిన్లాండ్ ఏపాటి?
——————-
పొద్దున్నే ఒక వార్త భారతీయుడిగా నా మనో భావాలను గాయపరిచింది. ప్రపంచంలో అత్యంత ఆనందమయ జీవనానికి ఫిన్లాండే ఈసారి కూడా మొదటి ఎంపికగా 149 దేశాల ప్రజలు ఏకగ్రీవంగా అంగీకరించారట. మన హైదరాబాద్ జనాభాలో సరిగ్గా సగం- యాభై అయిదు లక్షల జనాభా ఉన్న ఫిన్లాండ్ ఆనందం కాసేపు పక్కన పెడదాం. విశ్వనగరం హైదరాబాద్ లో మన ఆనందానికి ఏమి తక్కువయ్యింది? మన ఆనందం విశ్వ వేదిక మీద ఆనందం కాకుండా ఎందుకు ఆవిరి అయ్యింది? అన్నది మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం.
——————-
మా కాలనీలో ఒక భావి దేశ నాయకుడు స్వయంభువుగా ఉద్భవించాడు. మూడు పదులు దాటని అతడి జయంతులకు కాలనీ అంతా హోర్డింగులు మొలుస్తాయి. వీధులు తోరణాలు కట్టుకుంటాయి. పటాకులు పేలుతాయి. పూలు వర్షిస్తాయి. వీధులన్నీ భావి దేశ నాయకుడి అభిమానుల కోలాహలంతో నా కారు రోడ్డు మీదికి రావడానికి వీల్లేని ఉచిత ప్రాథమిక నిర్బంధ ఆనందానికి లోనవుతాను. ఇలాంటి అమేయ, అతులిత, నిరుపమాన ఆనందం ఫిన్లాండ్ లో ఉంటుందా?
Ads
కాలనీలో కొత్తగా వచ్చిన పేగులను పాడు చేసే బార్, ఆ పేగు రోగాలను నయం చేసే ఆసుపత్రి వల్ల నిత్యం నరకయాతనగా బయటివారికి అనిపించినా- నాకది ఆనందంగానే అనుభవమవుతూ ఉంది. ఈ అనుభవైకవేద్యమయిన ఆనందం ఫిన్లాండ్ లో దొరుకుతుందా?
మా ఆఫీసు గోడకు ఆనించి వాహనం పార్క్ చేసి పెడితే రాత్రిళ్లు ఆనందం కోసం తాగే చిల్లర బ్యాచ్ ఆనందంగా టైర్లు కోసి వెళితే- పోలీసులు వచ్చి టైర్లే కాపాడుకోలేని మీరు ఆఫీసు ఏమి నడుపుతారని తాత్వికంగా వేదాంత పరిభాషలో వైరాగ్యంగా అడిగితే మా కళ్లల్లో ఆనందాశ్రువులే కంటికి మంటికి ఏకధారగా వర్షించాయి. ఈ ఆనందం ఫిన్లాండ్ కళ్లల్లో చూడగలమా?
వరదలు వస్తే ఊరు మునిగినా చెక్కు చెదరని భాగ్యనగర ఆనంద నందన ముఖారవింద సందోహం- సకల ఆనందాలకు తలమానికం కాదా? అంతటి ఆనందం ఫిన్లాండ్ పొందగలదా? కనీసం కలలో అయినా ఊహించగలదా?
కరోనాతో దేశంలో కొత్తగా పదిహేను కోట్ల మంది పేదరికంలో పడి విలవిలాడుతున్నా- ఆనందం లోపించిందని గుండెలు బాదుకుంటున్నారా? ఈ పదిహేను కోట్ల సున్నాల్లో ఎన్ని శూన్యాలుంటాయో ఫిన్లాండ్ లెక్క కట్టగలదా? ఈ శూన్యాలను ఎన్ని ఫిన్లాండ్ లు పూడ్చగలవో చెప్పే ప్రపంచాలు ఉంటాయా?
——————
భారత్ లాంటి దేశాల్లో-
మెతుకు దొరికితే ఆనందం. ఉండడానికి గూడు దొరికితే ఆనందం. పని దొరికితే ఆనందం. రోగం రాకపోతే ఆనందం. మంచాన పడకుండా పొతే ఆనందం. ఫిన్లాండ్ ఆనందం ఫిన్లాండ్ ది. మన ఆనందం మనది. నిత్యం కత్తి అంచు మీద నడిచే మన ఆనందానికి ఈ పద్నాలుగు భువన భాండాల్లో పోలికే లేదు….. By….. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article