ఓ వార్త కనిపించింది… కాంగ్రెస్ నాయకుడు చిన్నారెడ్డి ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయబోననీ, డబ్బులు పంచలేని వాళ్లు పోటీలో ఉండలేని స్థితి వచ్చేసిందని ఏదో అన్నాడు… రకరకాల వైరాగ్యాల్లాగే ఇదీ ఓ వైరాగ్యం… దీన్ని ఎన్నికల వైరాగ్యం అంటారు… ఆయన బాధలో కొంత నిజముంది… ఐతే కొంత మాత్రమే… ఎందుకంటే..? అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించిన తీన్మార్ మల్లన్న డబ్బులేమీ పంచలేదు కదా… డబ్బును కాదు కదా తను నమ్ముకున్నది… ఎస్, ఎన్నికల్లో డబ్బు పనిచేస్తుంది కానీ, అది మాత్రమే పనిచేయదు… అనేక కారణాలు, సమీకరణాలు, సంక్లిష్టతలూ ఉంటయ్… వాటన్నింటినీ దాటుకుని సాధించే గెలుపు గెలుపే… అది అంతిమం… యుద్ధాల్లో, రాజకీయాల్లో, ప్రేమలో ఎలా గెలిచావనేది ముఖ్యం కాదు, గెలిచావా లేదానేదే ముఖ్యం… అదీ అసలు సత్యం… అందుకని పల్లా రాజేశ్వరరెడ్డి, సురభి వాణిదేవి విజయాలను తేలికగా తీసేయడం, వెకిలిగా ప్రజాతీర్పు మీద వ్యాఖ్యలు చేయడం సరికాదు… అవసరం లేదు… సాధనసంపత్తి, కేసీయార్ పోల్ వ్యూహాలు, డబ్బు మాత్రమే కాదు, వాళ్లకు చాలా పరిస్థితులు అనుకూలించాయి…
అయితే… ఓ కీలకమైన డిస్‌క్లెయిమర్… టీఆర్ఎస్ రెండు సీట్లలోనూ గెలిచిందీ అంటే కేసీయార్ పాలన విధానాలకు విద్యావంతులు, ఉద్యోగులు పూర్తి స్థాయిలో ఆమోదముద్ర వేసినట్టేమీ కాదు… భేష్ అని మెచ్చుకున్నట్టు కూడా కాదు… కాకపోతే గెలుపు చప్పట్లు, టపాసుల మోత, గులాల్ మెరుపు, మిఠాయిల తీపి, తీన్మార్ డప్పు స్టెప్పుల విజయ కోలాహలంలో కొన్ని కప్పబడిపోతయ్… ఈ గెలుపు ఎంతగా కష్టమైందో, ఎంతగా ప్రయాసపడాల్సి వచ్చిందో, ఎన్ని కథలు పడాల్సి వచ్చిందో గెలిచినవాళ్లకు తెలుసు… నిలబెట్టినవాళ్లకూ తెలుసు… అయితే అసలు మన సిస్టంలో లెజిస్లేటివ్ కౌన్సిల్‌కే ప్రాధాన్యం లేదు కదా… మరి ఈ రెండు సీట్ల ఎన్నిక ఎందుకు ఇంతగా చర్చనీయాంశమైంది..? సాధారణ ఎన్నికలు జరుగుతున్న స్థాయిలో కథనాలు, ఉత్కంఠ, ప్రచారాలు ఎందుకు..? అసలు ఎవరు గెలిచారు..? ఎవరు ఓడిపోయారు..? ఎవరు ఓడి గెలిచారు..? ఏ పార్టీ సీన్ ఏంది ఇప్పుడు..? కేసీయార్ మీద జనంలో ఉన్న వ్యతిరేకత ఎంత..? బీజేపీ దుబ్బాక, గ్రేటర్ విజయాలు వాపా? బలుపా..? కాంగ్రెస్ భవిష్యత్తు ఏమిటి..? అనే ప్రశ్నలతో ఈ రెండు సీట్ల ఎన్నికలు చాలా కీలకం అన్నట్టుగా చిత్రించబడ్డయ్ కాబట్టి మనమూ చెప్పుకోవాల్సి వస్తోంది…
Ads
హైదరాబాద్ స్థానంలో అసలు నిలబెట్టడానికి అభ్యర్థి లేడు అనే స్థితి నుంచి… సొంత అభ్యర్థిని నిలిపి గెలిపించుకున్న కేసీయార్ది గెలుపు… నల్లగొండ సీటు నిలబెట్టుకోవడం మరో గెలుపు… బీజేపీ దూసుకొస్తోంది, కేసీయార్ చతికిలపడుతున్నాడు అనే ప్రచారాల్ని బ్రేక్ చేసి, ఇప్పుడప్పుడే మీకు అంత సీన్ లేదురా భయ్ అని బీజేపీవాళ్లకు చెప్పాడు తను…! మరి బీజేపీ ఏం చేసింది..? పోల్ వ్యూహాల్లో బోలెడు లోపాలు… దొంగ వోట్లను నామినేషన్లకు ముందే పట్టుకుని రచ్చ మొదలుపెట్టి ఉంటే ఏమయ్యేది..? నేతల మధ్య సమన్వయ రాహిత్యం, అంతర్గత కలహాలు…! హైదరాబాద్ నిలబెట్టుకోలేకపోవడం ఓటమే, కానీ… దీటైన పోటీ ఇచ్చింది కాబట్టి ఇది మరీ అవమానకరమైన ఓటమి ఏమీ కాదు… ఇప్పటికీ తన ప్రధానబలం హైదరాబాదే అని మరోసారి చాటుకున్నట్టయింది… కానీ నల్లగొండ ఓటమి రేంజ్ మాత్రం దారుణమే… కనీసం ఒక్క సీటు గెలిచినా దుబ్బాక, గ్రేటర్ విజయాల టెంపో కంటిన్యూ చేయవచ్చుననీ, అదే ఊపుతో సాగర్ ఉపఎన్నికకూ వెళ్లొచ్చని అనుకుంటే ఆ ఆశలు భంగపడ్డయ్… బీజేపీ వైపు గెంతాలని చూసేవాళ్లు పునరాలోచనలో పడతారేమో బహుశా…
ఈ ఎన్నికల్లో దారుణంగా భంగపడింది కాంగ్రెస్… జేసీ దివాకర్‌రెడ్డి మొన్న చెప్పినట్టు కేసీయార్‌ను తెలంగాణ కాంగ్రెస్ ఇక కొట్టలేదు… దానికి ఓ దశ, ఓ దిశ లేకుండా పోయాయి… నాయకత్వలేమి..! రెండుచోట్లా అభ్యర్థులు వ్యక్తిగతంగా కష్టపడ్డారే తప్ప పార్టీపరంగా వాళ్లకు దక్కిన సపోర్ట్ శూన్యం… ఆరేడేళ్లుగా అనేకానేక ఓటములు చవిచూస్తున్నందున ఈ రెండు సీట్ల ఓటమి దానికి పెద్దగా, కొత్తగా ఏమీ ఫరక్ పడకపోవచ్చు… ఓటమి అనేది అలవాటైంది కాబట్టి…! కానీ క్షేత్ర స్థాయిలో కూడా కేడర్, లీడర్ క్రమేపీ తీవ్ర నైరాశ్యంలోకి కూరుకుపోతున్న దుస్థితి… వచ్చే ఎన్నికలలోపు ఇంకా ఏ స్థాయికి దిగిపోతుందో తెలియని దురవస్థ…!!
మరి ఈ ఎన్నికల్లో ఓడి గెలిచిందెవరు..? తీన్మార్ మల్లన్న..! ఆ రేంజ్ పోటీ ఇస్తాడని మొదట్లో ఎవరూ ఊహించలేదు… కేసీయార్ పాలన విధానాల మీద తను నిరంతరం తెగింపుతో తన సొంత చానెల్ ద్వారా ఎక్కుపెట్టే వ్యంగ్యం, విమర్శలు విద్యావేత్తలు, ఉద్యోగుల్లోకి బాగా ఎక్కుతున్నాయని అర్థం… మరి కోదండరాం…? నిజానికి స్వచ్ఛందంగా చాలామంది విద్యావంతులు, ఉద్యోగులు తన కోసం వర్క్ చేశారు… చాలా పాజిటివ్ వోటు సమకూరింది… కానీ సరిపోలేదు… సమకూరిన బలానికి కొంతమేరకు తీన్మార్ మల్లన్న గండికొట్టాడు… బరిలో మల్లన్న లేకపోతే కథ వేరే ఉండేదేమో… అయతే కోదండరాం ఒక రాజకీయ నాయకుడిగా సక్సెస్ఫుల్ కాకపోవచ్చుగాక… కానీ ఉద్యమ సంధానకర్తగా, వ్యక్తిగా తనేమిటో అందరికీ తెలుసు కాబట్టి, తన ఓటమి మీద వెటకారాలు అసమంజసం, హుందారాహిత్యం..! నాగేశ్వర్ గురించి పెద్దగా చెప్పడానికి ఏమీలేదు…!! విజేతలు ఇద్దరికీ ‘ముచ్చట’ అభినందనలు..!! అవునూ, తెలంగాణ భవన్‌కు అంటుకున్న మంటల సంగతేమిటీ అంటారా..? ఆయుత చండీయాగం పూర్ణాహుతి దశలో యాగవాటికకు మంటలు అంటుకోలేదా..? ఇదీ అంతే…!!
Share this Article