రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వారి వార్త ఒకటి చదివితే నవ్వొచ్చింది, తరువాత జాలేసింది… అవలక్షణ రాజకీయ వాతావరణం అందరినీ ప్రభావితం చేస్తుంది సహజంగానే… పైగా ప్రపంచంలో ఎవరికీ అంతుపట్టని తెలుగు రాజకీయాలు కదా మరి… ఉద్యోగధర్మంగానే కావచ్చుగాక, తెల్లారిలేస్తే రాజకీయ నాయకులతో తిరిగీ తిరిగీ బ్యూరోక్రాట్లు కూడా అలాగే తయారవుతున్నట్టున్నారు… ఈమధ్య ప్రతి చిన్న విషయానికీ సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేయడం ఓ అలవాటుగా మారిపోయింది రాజకీయ నాయకులకు… అక్కడికి సీబీఐ అంటే ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు, అదేదో నిష్పాక్షిక-నీతిమంతమైన దర్యాప్తు సంస్థ అన్నట్టు..! అందులోనూ ఉండేది పోలీసులే, వాళ్లూ తమ బాసులు చెప్పినట్టే వింటారు… జస్ట్, అలవోకగా నిమ్మగడ్డ కూడా ఓ సీబీఐ దర్యాప్తు అడిగేశాడు… దేనికి..? తను గవర్నర్కు రాసిన లేఖలు లీక్ అవుతున్నాయట… బాధ్యులెవరో తేల్చేయడానికి అర్జెంటుగా సీబీఐని ఆదేశించి, అంతే అర్జెంటుగా 72 గంటల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని కూడా గడువు పెట్టాలట..! మన సమస్య మనకు జాతీయ సమస్య… హహహ…
ఎందుకయ్యా ఇలా అంటే..? స్టేట్ పోలీసుల మీద నమ్మకం లేదట… వీలయితే తననే ఇరికిస్తారట… (మొన్నటి ఎన్నికల్లో బాగా పనిచేశారని ఈయనే ఏపీ పోలీసులకు కితాబు ఇచ్చినట్టున్నాడు, మరిచిపోయినట్టున్నాడు)… అందుకని సీబీఐ దర్యాప్తు కావాలట… బీజేపీ-జగన్ పార్టీ దోస్తులు కాబట్టి, సీబీఐని కూడా మేనేజ్ చేయలేడా జగన్..? మరి ఎలా..? అందుకని ఇంటర్ పోల్ దర్యాప్తు అడిగితే బాగుండేది… దాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించలేదు కాబట్టి అర్జెంటుగా ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించడం బెటర్ కదా… ఎలాగూ ఖర్చులన్నీ తెలుగు ప్రజల సొమ్మే కదా… మనదేం పోయింది..?! ఎన్నికల కమిషనర్ గవర్నర్కు లేఖ రాశాడు సరే, అవి లీకయ్యాయి, తప్పే… గవర్నర్ కార్యాలయం నుంచి లీక్ కాలేదని చెప్పారట, తన సొంత ఆఫీసు నుంచి లీక్ కాలేదట… మరెలా లీకవుతున్నాయి..? ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గానీ, డీజీపీ గానీ కుట్ర పన్ని, జగన్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా నిమ్మగడ్డ ఆఫీసు, గవర్నర్ ఆఫీసు కంప్యూటర్లను హ్యాక్ చేయించి, లేఖల సమాచారాన్ని తస్కరించి, దురుపయోగానికి పాల్పడుతున్నారా..? అవునా..? అదేనా తమరి డౌటనుమానం సారూ..?
Ads
నవ్వులాట కాదు గానీ… అసలు ఇందులో ప్రజోపయోగం ఏముంది..? సో వాట్..? ఒక ఎన్నికల కమిషనర్ ఒక గవర్నర్కు రాసే లేఖల్లో అంతటి అత్యంత రహస్య సమాచారం ఏముంటుంది..? రాష్ట్ర ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తోంది కాబట్టి, ప్రతి దానిలో జోక్యం చేసుకుంటున్నది కాబట్టి లేఖలు రాశాడట… అదేదో అధికారికంగానే రాయొచ్చు కదా… మరి అంతకుముందు ఉద్దేశపూర్వకంగా కొన్ని లేఖలు మీడియాకు లీక్ చేసిందెవరు..? ఉదాహరణ :: కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ..! ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో వాటిని కూడా చేర్చితే బెటరా..? ఐనా 72 గంటల్లో మధ్యంతర నివేదిక అట… ఇదేమైనా అబ్రకదబ్ర అనగానే కళ్లెదుట నిజాలు ప్రత్యక్షమయ్యే మాయాజాలమా..? ప్రతి అడుగూ ఇలాగేనా… కరోనా వేక్సిన్ వేయించుకున్నాను కాబట్టి రాలేను అని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసుకు జవాబు ఇచ్చినట్టు వార్తలొచ్చాయి..? మరి వేక్సిన్ వేయించుకుని ఎల్టీసీ మీద ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తానని అనుకున్నట్టు..? ఐనా వేక్సిన్ వేయించుకుంటే మరింత నిర్భయంగా, స్వేచ్ఛగా తిరగొచ్చు గానీ… ఎటూ కదలొద్దని ఏమీ లేదు కదా… హేమిటో… బ్యూరోక్రాట్లు ముదిరితే అచ్చం రాజకీయ నాయకుల్లాగే రూపాంతరం చెందుతారా..?!
Share this Article