ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయి… నాటి ఉద్యమ వ్యతిరేకులను చేర్చుకుని, అందలాలు ఎక్కించి… దేశంలోని అనేకానేక ప్రాంతీయ పార్టీల్లాగే తన నడతను, తన నడకను ప్రజాబాహుళ్యం నిజ ఆకాంక్షలకు భిన్నంగా మార్చేసుకున్న పార్టీ టీఆర్ఎస్… ఈమాట వాళ్లో వీళ్లో కాదు, పార్టీలో ఉన్నవారే చెబుతుంటారు… అసంతృప్తిని వెళ్లగక్కుతుంటారు… ఇప్పుడు విషయం ఏమిటంటే ఈటల మళ్లీ తిరుగుబాటు స్వరం వినిపించాడు… ఇదేమీ కొత్త కాదు… గతంలోనూ కనిపించింది… ఎప్పుడంటే..? కేసీయార్ తనను దూరం పెట్టిన ప్రతిసారీ ఈటలలోని తిరుగుబాటు స్వరం వినిపిస్తుంది… అయితే తన అసంతృప్తి బాసుకు అర్థమైతే చాలు… ప్రజలకు మాత్రం తన ఉద్దేశం ఏమిటో సరిగ్గా చెప్పడు… ఓ మార్మిక భాషలో మాట్లాడతాడు… ప్రజలు, ప్రజాప్రయోజనాలు, సమర్థ పాలనవిధానాలు గట్రా అన్నీ చెప్పేస్తాడు… టీవీలు, పత్రికలు ఎవరికి ఇష్టం వచ్చిన బాష్యం వాళ్లు చెప్పుకోవచ్చు…
కేటీయార్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రయత్నాలు జోరుగా సాగినప్పుడు అకస్మాత్తుగా ప్రతిపక్షాలు, తెలంగాణలోని డిఫరెంట్ సెక్షన్లు ఈటల పేరును ప్రాచుర్యంలోకి తెచ్చాయి… కేటీయార్ దేనికి..? సీఎం పదవి ఏమైనా కుటుంబ వారసత్వ ఆస్తియా..? ఇవ్వాలనుకుంటే ఈటల బెటర్ కదా..? మలిదశ ఉద్యమం తొలినాళ్ల నుంచీ ఉన్నవాడే కదా..? అనే వాదనను తలకెత్తుకున్నాయి… అది ఈటల మీద ప్రేమ కాదు… కేసీయార్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నం… ఈటల మీద కేసీయార్‌కు పలుసార్లు కోపమొచ్చింది… కానీ పూర్తిగా కత్తిరించలేడు… కత్తిరించడు… పక్కకు పెడతాడు… నా పార్టీ నా ఇష్టం అన్నట్టుగానే ఉంటుంది ధోరణి… నో, నో, టీఆర్ఎస్ జెండాకు అందరమూ ఓనర్లమే అని ఈటలకు అకస్మాత్తుగా గుర్తొస్తుంది ఇలాంటి సందర్భాల్లో… మంత్రిపదవి ఎవరి భిక్షా కాదు, అది హక్కు అన్నట్టుగా కూడా గుర్తొస్తుంది… తరువాత నాలుగు రోజులే… ఇదేమీ తాడోపేడో తేల్చేసుకునేది కాదు…
Ads
కేబినెట్ మీటింగుకు పిలవకుండా కేసీయార్ కావాలనే హ్యూమిలియేట్ చేశాడు… మళ్లీ తేడా కొడుతోందని ఈటలకు అర్థమైంది… వెంటనే ధర్మం, న్యాయం గుర్తొచ్చాయి… తనకు ఇబ్బంది కలిగినప్పుడు, తన మనస్సు గాయపడుతున్నప్పుడే అన్నీ గుర్తొస్తున్నాయి.., కులం, డబ్బు, పార్టీ, జెండా కాదు, మనిషిని గుర్తుపెట్టుకోవాలి…, ఈ కల్యాణలక్ష్మి, ఈ పెన్షన్లు ఉద్దరించేవి కావు… పరిగె ఏరుకునేవి… కానీ పంట పండించేవి కావు అని నిజాలు మాట్లాడుతున్నాడు… నిజమే, ఈటల చెప్పినవన్నీ నిజమే అనుకుందాం… కానీ కేసీయార్‌తో సంబంధాలు బాగున్నప్పుడు మాట్లాడకుండా తనకు పార్టీలో ఇబ్బంది కలిగినప్పుడే ఇవన్నీ మాట్లాడితే ఎలా..? ఉన్నది ఆ క్యాంపులోనే… నమ్మకాలు ఇంకా ఆ క్యాంపుపైనే… కేసీయార్ ఓసారి కాల్ చేసి, రమ్మంటే చాలు… అన్నీ మళ్లీ గప్‌చుప్ అయిపోతాయా…? మళ్లీ ఆ తానులో ముక్కే… మళ్లీ ఆ చెట్టు కొమ్మే కదా…!!
‘‘నాలాంటివాడు కూడా పదే పదే జనం దగ్గరకు వచ్చి దేహీ అనే పరిస్థితి వస్తే అది మంచిది కాదు… నేను మీ బిడ్డను…’’ వంటి వ్యాఖ్యలు జిల్లాలో, నియోజకవర్గంలో తనకు ఎదురవుతున్న పొలిటికల్ ఇబ్బందుల నేపథ్యంలో చేసి ఉండవచ్చు… కేసీయార్‌తో సంబంధాలు మరింతగా చెడిపోవచ్చు… నిజానికి మనసు కుతకుతలాడుతూ ఉంటే… అక్కడే ఉండి అసంతృప్తి స్వరాలాపన దేనికి..? అన్నీ బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, ఇబ్బందుల్లో పడ్డప్పుడు విలువలు మాట్లాడితే ఎలా సార్..? అని ఏదో సినిమాలో ఓ పాపులర్ డైలాగ్… అదెందుకో గుర్తొస్తోంది… కేకే, జానా భాష దేనికి..? సూటిగా జనానికి సమజయ్యేట్టు చెబితే, ఫీడ్ బ్యాక్ వస్తుంది… అక్కడే ఉండాలా..? ప్రయాణదిశ మార్చుకోవాలా..? క్లారిటీ వస్తుంది…! చివరగా…… తనకు తెలియదని కాదు… కానీ తెగబడి కొట్లాడటమే తెలంగాణ నైజం…!!
Share this Article