మోడీకి స్వదేశంలో కాలు నిలవదు… గిరగిరా దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు…. ఇది కరోనాకు ముందు మాట… కరోనా ధాటికి సారు గారి విదేశీ పర్యటనలు కూడా ప్రభావితమయ్యాయి ఫాఫం… ఇప్పుడొక దేశం వెళ్లకతప్పడం లేదు… అబ్బే, ఇటు బెంగాల్ ఎన్నికల ప్రచార బిజీలో ఉన్నాడు, అటూ ఇటూ ఏం తిరుగుతాడులే అని తేలికగా తీసేస్తే ఎలా..? ఆ విదేశీ పర్యటనలోనూ తన బెంగాలీ ఎన్నికల లబ్ధి చూసుకుంటున్నాడు… అర్థం కాలేదా..? ఓ విదేశీ గడ్డ మీదకు వెళ్లి, స్వదేశీ బెంగాల్లో ఎన్నికల లబ్ధి కోసం ప్రయత్నించడం ఇది… విశేషమే కదా… అవును, విషయం ఏమిటంటే..? మోడీ సారు బంగ్లాదేశ్ వెళ్తున్నాడు… వెళ్లాలి, వెళ్లకతప్పదు… బంగ్లాదేశ్ తమ 50 ఏళ్ల స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలను జరుపుకుంటోంది… బంగ్లాదేశ్ జాతిపిత ముజిబర్ రెహమాన్ శతజయంతి ఉత్సవాల్ని కూడా జరుపుకుంటోంది… మనం ఇప్పించిన స్వాతంత్య్రం… మనం మద్దతు ఇచ్చి నిలబెట్టిన బంగబంధు రెహమాన్… మరి మనం ఆ ఉత్సవాల్లో పాలుపంచుకోకపోతే ఎలా..? అందుకే ఏకంగా ప్రధానియే తరలివెళ్తున్నాడు…
మన ఇరుగు పొరుగు దేశాలన్నింటినీ రకరకాల మార్గాల్లో వశపరుచుకుంటూ చైనా ఓ ప్రమాదకరమైన గేమ్ ప్లే చేస్తోంది మన మీద… మన విదేశీ వ్యవహారాలు కాస్త ఒడిదొడుకుల్లో పడుతున్నయ్… ఈ స్థితిలో బంగ్లాదేశ్‌తో సంబంధాలను దృఢతరం చేసుకోవడం కూడా మనకు ఇప్పుడు అవసరం… అందుకని ఈ పర్యటన ఈ కోణంలోనూ ముఖ్యమే… అందుకే ప్రధానియే వెళ్తున్నాడు… వెళ్లాలి… అయితే ఊరికే అలా వెళ్లి, ఇలా వచ్చేయడం కాదు… మోడీషా ఎన్నికల టీం ఇందులోనూ ఓ పొలిటికల్ లబ్ధి పొందే ఓ స్ట్రాటజీ రచించింది… అది ఇప్పటికిప్పుడు బీజేపీకి బెంగాల్లో ప్రయోజనాన్ని సాధించిపెట్టాలనేది ఆ ప్లాన్… ఎలాగంటే..?
Ads
బంగ్లాదేశ్‌లో మతువా కమ్యూనిటీ ఉంది… హిందువులు… పేరు నామశూద్రులు… ఎస్సీ… వీరందరూ తమ శాఖకు, తమ పరంపరకు మూలపురుషుడిగా అమితంగా ఆరాధించే హరిచంద్ ఠాకూర్ ఊరకండిలో నిర్యాణం చెందాడు… మోడీ అక్కడికి వెళ్తున్నాడు… అదేగాకుండా శిఖర్‌పూర్‌లోని సతీపీఠం (సుగంధ శక్తిపీఠం) గుడిని కూడా సందర్శించనున్నాడు… ఈ కమ్యూనిటీకి చెందినవాళ్లు బెంగాల్లో ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, నదియా, జలపాయ్‌గురి, కూచ్ బేహార్, బర్ధమాన్ తదితర ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు… కనీసం 30 అసెంబ్లీ స్థానాల్లో వీళ్లది నిర్ణయాత్మక పాత్ర… వాళ్లందరికీ పౌరసత్వ చట్టం ప్రకారం భారతీయ పౌరసత్వం కావాలి… మమత దాన్ని వ్యతిరేకిస్తోంది… బీజేపీ అధికారంలోకి వస్తేనే తమ కోరిక నెరవేరుతుందని వాళ్ల ఆశ… దానికితోడు ఊరకండికి వెళ్లి ప్రధాని దండాలు పెట్టడం ఆ కమ్యూనిటీకి మరింత చేరువ చేస్తుందని బీజేపీ ఆశ…
అసలు ఇవే కాదు… ముజిబర్ రెహమాన్ స్మారకస్థలిని సందర్శించి నివాళ్లు అర్పించడం బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందూయేతరులనూ చేరువ చేసుకునే ఎత్తుగడే… ఆయనకు మహాత్మాగాంధీ శాంతి పురస్కారాన్ని కూడా ప్రకటించారు నిన్న… నిజానికి రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకులకు చెందిన రబీంద్ర కుథిబారి సందర్శన… బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన బాఘా జతిన్ నివసించిన ఇల్లు సందర్శన కూడా మోడీ పర్యటన ప్లాన్‌లో చేర్చారు… కానీ సమయాభావం వల్ల ఈ రెండూ కుదరకపోయినా ఊరకుండి, సతీపీఠం సందర్శన మాత్రం తప్పనిసరి… కేవలం రాజకీయలబ్ది కోసం ఒకటీరెండు ప్రాంతాల్ని దర్శిస్తున్నాడా ప్రధాని మోడీ అని విలేకరులు బంగ్లాదేశ్ కీలక మంత్రి ఒకరిని ప్రశ్నిస్తే… ‘ఆయన మాకు ఓ విశిష్ట అతిథి… దేశంలోని నాలుగు ఎక్కువ ప్రాంతాల్ని సందర్శిస్తే మాకు నష్టం ఏముంది..? దీనివల్ల ఆయనకు ఏదైనా లాభం సమకూరితే మంచిదే కదా…’ అని కొట్టిపారేశాడు… ఒక విదేశీ గడ్డ మీద నుంచి ఎన్నికల పరోక్ష ప్రచారం చేసుకోవడం ఇంట్రస్టింగే..!!
Share this Article