ఒకరు… ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, బీజేపీ… రిప్డ్ జీన్స్ మీద నోరు పారేసుకుంటాడు… మరొకరు… బెంగాల్లో ప్రముఖ లీడర్, బీజేపీ… పొట్టి నిక్కర్లు వేసుకో అని ముఖ్యమంత్రి మమతను వెక్కిరిస్తాడు… ఆగండాగండి… బీజేపీయే కాదు, స్త్రీల మీద వెకిలి కామెంట్లు చేసే రోగం అన్ని పార్టీల్లోనూ ఉన్నదే… తాజా ఉదాహరణ కావాలా..? ఇది మరీ బీజేపీ లీడర్ల వాచాలత్వాన్ని మించిన చిల్లరతనం… డీఎంకే లీడర్ ఆయన… పార్టీ ప్రచార కార్యదర్శి కూడా… పేరు దిండిగల్ లియోనీ… కోయంబత్తూరులో ఓ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ… ‘‘మన లేడీస్ ఈమధ్య విదేశీ బ్రీడ్ ఆవుల పాలు తాగుతూ తాగుతూ ఫిగర్ కోల్పోతున్నారు… షేపులు మారిపోతున్నయ్… హిప్స్ బలిసి డ్రమ్ముల్లా తయారవుతున్నారు…’’ అని నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేసేశాడు… పక్కనే ఉన్నాయన ఆందోళనగా ఆపడానికి ప్రయత్నించినా ఆగలేదు… తన ధోరణిలో తను చెప్పుకుపోయాడు… విషాదం ఏమిటంటే..? అక్కడ చేరిన జనం చప్పట్లు కొడుతూ, నవ్వుతూ, ఆ వ్యాఖ్యల్ని ఎంజాయ్ చేయడం..!
కార్తికేయ శివసేనాపతి అని ఓ అభ్యర్థి తొండముత్తూరులో పోటీచేస్తున్నాడు… ఆయనకు Senaapathy Kangayam Cattle Research Foundation (SKCRF) అని ఓ ఎన్జీవో ఉంది… దానికి మేనేజింగ్ ట్రస్టీ తను… అది స్వదేశీ పశుసంపద వైవిధ్య పరిరక్షణకు పాటుపడుతూ ఉంటుంది… ఈ వాచాలుడు ఆయన తరఫున ప్రచారానికి వచ్చి ఈ చిల్లర వ్యాఖ్యలకు దిగాడు… ‘‘మీకు తెలుసు కదా… ఈ విదేశీ సంతతి ఆవులు వచ్చాక ఏ ఫామ్లో చూసినా అవే కనిపిస్తున్నాయి… పొదుగుకు మెషిన్ పెడతారు, అది స్విచాన్ చేయగానే గంటలో 40 లీటర్లను పితుకుతుంది… అదుగో ఆ పాలు తాగి మన ఆడవాళ్లు ఊరిపోతున్నారు… ఇంతకుముందు 8 నంబరులాగా కనిపించేవాళ్లు… పిల్లలను ఎత్తుకోగలిగేవాళ్లు… అబ్బే, ఇప్పుడు డ్రమ్ముల్లాగా ఉబ్బిపోతున్నారు కదా, పిల్లల్ని కూడా ఎత్తుకోలేకపోతున్నారు… పిల్లలు కూడా అంతేలెండి…’’ ఇలా సాగిపోయింది తన ప్రసంగం…
Ads
వార్నీ, ఈయన ప్రసంగం కొంప ముంచేట్టు ఉంది అనుకుని పక్కనే ఉన్న ఒకాయన కాసిన్ని రేషన్ బియ్యాన్ని ఆయన చేతికి ఇచ్చి, దాని పూర్ క్వాలిటీ మీద మాట్లాడు అని చెవుల్లో చెప్పాడు… ఒక నిమిషం రేషన్ బియ్యం నాణ్యత మీద మాట్లాడి మళ్లీ ఆడవాళ్లు షేపుల దగ్గరకే ప్రసంగాన్ని తీసుకొచ్చాడు ఈ దుండిగల్ లియోని… ఈ వీడియో పెట్టేసి ఇక ఇతర పార్టీలకు చెందిన సోషల్ మీడియా ఫ్యాన్స్ ట్రోలింగుకు దిగారు… కబడ్డీ ఆడుకున్నారు… ‘అమ్మా, తల్లీ, కనిమొళీ, నువ్వెందుకు మాట్లాడటం లేదు’ అంటూ ఆమెనూ ఈ వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు… సో, కథలో నీతి ఏమిటీ అంటే… ఇలాంటి హీనవ్యాఖ్యల మీద పేటెంట్ రైట్స్ విషయంలో అందరూ అందరే… ఏ పార్టీ వాడూ తక్కువ కాదు… అసలు లీడర్లు అంటేనే జనంలో ఏహ్యభావం పెరగడానికి ఇలాంటివాళ్లు కూడా కారణమే కదా…!!
Share this Article