.
డెస్టినేషన్ బ్రేకప్ పార్టీ… మా’విడాకుల’ మహోత్సవం
విలేఖరి:- చెప్పండి మేడం… మొదట మీరు ప్రపోజ్ చేశారా? సార్ ప్రపోజ్ చేశారా?
Ads
సెలెబ్రిటీ మహిళ:- నేనే ప్రపోజ్ చేశాను. ఒక సాయంత్రం సార్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు “ఫర్ సపోజ్ నేను నీకు విడాకులిస్తే నువ్ ఏం చేస్తావు?” అని డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా, కూల్ గా, ప్లెజెంట్ అట్మాస్ ఫియర్ లో ఫియర్ లేకుండా ప్రపోజ్ చేశాను.
వి:- సార్! అప్పుడు మీరు ఎలాంటి అనుభూతికి లోనయ్యారు?
సెలెబ్రిటీ పురుషుడు:- భూతాన్ని ఎలా వదిలించుకోవాలా? అని దిగులు పడుతున్న వేళ… భూతమే నిన్నొదిలేస్తాలే అని అభయమిచ్చిన అనుభూతితో ఉబ్బి తబ్బిబ్బులయ్యాను. గుండెలో కోటి వీణలు వాటంతటవే కదిలి మోగిన పారవశ్యానికి లోనయ్యాను. నెత్తిన కొండంత భారం దిగి తేలికపడిన పిచ్చ లైట్ ఫీలింగ్ కు లోనయ్యాను. ముక్కోటి దేవుళ్ళు నా మొర ఆలకించినట్లు అనుభూతి చెందాను. ఇప్పుడు ఎట్లున్నాయి పీలింగ్స్? అని ఆనందంతో పుష్ప-2 పాట పాడుకుంటున్నాను.
ఎందుకు సార్? మేడం మిమ్మల్ను కొట్టేవారా? తిట్టేవారా?
లేదు నాయనా! పెళ్లయిన ఈ మూడేళ్లలో మేడం ఏనాడూ నన్ను కొట్టలేదు. తిట్టలేదు. నన్ను తాకనే లేదు. నా వైపు కన్నెత్తి చూడనే లేదు. తాళి కట్టిన తరువాత తొలిరాత్రికి ముందు మందుపని ఉందని మా పనిమనిషికి చెప్పి వెళ్లిన మేడంను నేను మళ్లీ చూడ్డం ఇదే. ఆ తొలిరాత్రి రానే లేదనుకో… అది వేరే సంగతి. ఇక్కడ అనవసరం.
మేడం మీరు చెప్పండి. సార్ ఎందుకు మీకు నచ్చలేదు?
సార్ చాలా మంచివాడండి. అందువల్ల నాకు అస్సలు నచ్చలేదు. నేను సిగరెట్టు తాగితే సార్ యాష్ ట్రే పట్టుకు తిరుగుతాడు. నేను మందు తాగి వాంతి చేసుకుంటే సార్ క్లీన్ చేస్తాడు. నేను పబ్బులో గబ్బు పొడి పీల్చి స్పృహదప్పి పడితే సార్ కార్లో ఇంటికి తీసుకొస్తాడు. దాంతో మా ఇద్దరికీ పొత్తు కుదరదని మూడేళ్ల తరువాత నిర్ణయానికి వచ్చాము.
మరి మీ ఎంగేజ్మెంట్, పెళ్లి న భూతో- న భవిష్యతి అన్నట్లు జరిపారు?
అవును. ఇప్పుడు బ్రేకప్ పార్టీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. శంకర్ పల్లి ఫార్మ్ హౌస్లో ఒక శని, ఆదివారం ధూమ్ ధామ్ గా జరుపుతున్నాం. తరువాత ఇటలీ మిలాన్ ద్వీపం రిసార్ట్ లో డెస్టినేషన్ బ్రేకప్ నాన్ బ్యాచిలర్స్, డైవోర్స్ అప్లైడ్ బట్ వెయిటింగ్ క్యూట్ కపుల్ పార్టీ ఉంటుంది. దానికి చార్టర్డ్ విమానాలు దొరకగానే డేట్ ఫిక్స్ చేసి… సోషల్ మీడియాలో ప్రకటిస్తాం.
సార్… మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?
మేడం గ్రహణం వదలడమే దానికదిగా ఒక గొప్ప శుభ సందర్భం. నా పూర్వ జన్మ సుకృతం వల్ల మాకు పిల్లలు పుట్టలేదు. బతికి ఉంటే బలుసాకు తింటూ…శేష జీవితం గడిపేయాలని అనుకుంటున్నాను. మూడేళ్ళుగా నిద్రాహారాలకు మొహం వాచి ఉన్నాను. కనీసం మూడు నెలలు రాత్రిళ్ళు పడుకుని… పగలు సూర్యుడిని చూడాలనుకుంటున్నాను. ఇంకా ఇలాంటివే చాలా చాలా పెద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయి.
మేడం… మీ ప్రణాళికలేమిటి?
నేను రెండేళ్లుగా వేరే అతడితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి మీకు తెలియనిది కాదు. అయితే ఆయన వన్ ఇయర్ గా వేరే ఆమెతో లివ్ అవుట్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. అది క్లారిటీ తీసుకోమన్నాను. ఆ క్లారిటీ వస్తే నాక్కూడా క్లారిటీ వస్తుంది. ఒకవేళ రాకపోయినా వితవుట్ క్లారిటీతో లివింగ్ ఇన్ అండ్ అవుట్- ఆన్ అండ్ ఆఫ్- నాన్ కమిటల్ రిలేషన్ షిప్ లో ఉండాలని అనుకుంటున్నాం. ఇట్ డిపెండ్స్. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు థింక్ టూ మచ్ అబౌట్ దీస్ సిల్లీ థింగ్స్. మై మేనేజర్ విల్ లుక్ ఇన్ టు ఆల్ దోస్ పెట్టీ ఇష్యూస్.
మేడం… మీ మేనేజర్ నంబర్, మెయిల్ ఐడి ఇస్తారా?
ఇదిగోండి నంబర్. ప్రస్తుతం ఆయన బేగంపేట మహిళా పోలీసు స్టేషన్లో అరెస్ట్ అయి ఉన్నాడు. భార్యను బాటిల్ తో కొట్టాడట. పెట్టీ కేసే. మీరు ఫోన్ చేయండి. ఏది కావాలన్నా చెప్తాడు. ఏది కావాలన్నా చేస్తాడు. హీ ఈజ్ ఎ డిపెండబుల్ పర్సన్. ప్లీజ్ పర్డన్ మీ… హ్యావ్ టు క్యాచ్ గోవా ఫ్లయిట్… యూ కెన్ అస్క్ హిమ్. హీ ఈజ్ ఫ్రీ. హీ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. మోరోవర్ హీ స్పీక్స్ వెరీ గుడ్ టెల్గు. దో మై మదర్ ఈజ్ ఫ్రమ్ చీపురుపల్లి అండ్ మై ఫాదర్ ఈజ్ ఫ్రమ్ ఆముదాలవలస… యామ్ నాట్ కంఫర్టబుల్ విత్ టెల్గు…. బట్ ఐ లవ్ టెల్గు. ఐ యూజ్డ్ టు సింగ్ అన్నమయ్య పద్యమ్స్ అండ్ వేమన కీర్తనాస్ ఇన్ మై చైల్డ్ హుడ్…
వద్దులేండి మేడం. పాపం. ఆయనకు ఇప్పుడే మోక్షం కలుగుతోంది. మళ్లీ మా ప్రశ్నల బంధనాలు ఎందుకు? మా ఇన్నేళ్ల కెరీర్లో ఇంత పారదర్శకంగా సుహృద్భావ వాతావరణంలో జరిగిన ప్రెస్ మీట్ ఇదే మేడం. ఈ జన్మకిది చాలు మేడం! చాలు!!
సందర్భం:- (విడాకులకు కారణాలు అనేకం ఉండొచ్చుగాక… ఓ తరహా జీవితాలు గడిపే ఓ సెలబ్రిటీ కపుల్ విడిపోతే ఎలా ఉంటుందనేది సరదాగా…)
# ఝార్ఖండ్లో విడాకులు తీసుకున్న కూతురిని బ్యాండ్ మేళంతో వేడుకగా ఇంటికి తీసుకొచ్చాడో తండ్రి. తరువాత బంధుమిత్రులందరికీ న భూతో న భవిష్యతి అన్నట్లు భారీ విందు ఏర్పాటు చేశాడు.
# హరియాణాలో మంజీత్ అనే యువకుడు తన భార్యతో విడిపోయి ఏడాది గడిచిన సందర్భంగా స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. పైగా మాజీ భార్య సమక్షంలో బ్రేకప్ పార్టీ జరిగినట్లు ఉండాలని ప్రతీకాత్మకంగా మాజీ బొమ్మను తయారు చేయించి… ఆ బొమ్మ ముందు అతడు చేసిన ఆనందోత్సవం అంతా ఇంతా కాదు!
బ్రేకప్ పార్టీ నియమ నిబంధనలు:-
# ఇద్దరికీ పరిచయమున్న కామన్ ఫ్రెండ్స్ ను పిలవకూడదు.
# కలిసి ఉండాల్సింది అని నసిగే చాదస్తపు బ్యాచ్ ని పిలవకూడదు.
# కలిసి ఉన్నప్పటి పాత గుర్తులైన ఉంగరాలు, చెయిన్లు, ఫోటోలు, వీడియోలు, బట్టలు వాడడం నిషేధం.
# మాజీకి ఏది ఇష్టం లేదో బ్రేకప్ పార్టీలో దానికే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి.
# ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ… సభామర్యాద దృష్ట్యా చెప్పడం కుదరదు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
(గతంలో తెలుగులో ఓ సినిమా వచ్చింది… ఆహ్వానం… అందరి ఎదుట ఘనంగా ఎలా పెళ్లి చేసుకున్నామో, ఆ అందరినీ పిలిచి, వాళ్ల ఎదుటే విడిపోతున్నట్టు ప్రకటిద్దాం అనేది హీరోయిన్ ప్రతిపాదన…)
Share this Article