.
బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ అండ్ ఫైనల్లీ…. అంటూ ఆ సంక్రాంతికి వస్తున్నాం అనబడే ఓ పిచ్చి కామెడీ సినిమాలో వెంకటేష్,.. (బాలయ్యను బాల అనాలట, వెంకటేష్‌ను వెంకీ మామ అనాలట… మధ్యలో ఇదో దరిద్రం మనకు…) ఓ పాట పాడాడు కదా, బాలును బీట్ చేస్తూ,…
సరే, ఎవడి పని చేయాలి వాడు చేయాలి అనే సూత్రాన్ని కాస్త పక్కన పెడితే, ఈ పాట హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… ఓ వార్త… ఏందయ్యా అంటే..? విషాదకరమైన హత్రాస్ తొక్కిసలాట కేసులో సదరు దైవాంశ సంభూతుడు భోలేబాబుకు ఓ రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలోని ఓ త్రిసభ్య కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చిందట…
Ads
అంతేకదా మరి… దేవుడి తప్పేముంటుంది ఫాఫం..? తన పాదధూళి పవిత్రం అని తనేమైనా చెప్పాడా..? తొక్కిసలాట జరిగేలా ఎగబడండీ అని చెప్పాడా..? కరుణాంతరంగుడు, కటాక్షవీక్షణుడు, అపర పరమేశ్వరుడు జనహననం కోరుకుంటాడా..? ఏదో అలా జరిగిపోయింది… అంతే… తప్పు నిర్వాహకులది, పోలీసులది తప్ప దేవుడి తప్పెలా అవుతుంది..? అవును, కమిషన్ కూడా అదే చెప్పింది… నిజాయితీగా…
80 వేల జనం వస్తారనుకుంటే రెండున్నర లక్షల మంది వచ్చారట… తప్పు భక్తులది గానీ దేవుడిది ఎందుకు అవుతుంది మరి… ఎప్పుడైనా జనమే కదా ఎడ్డిగాడిదలు… నాటి పుష్కర మృతుల్లో కూడా బోయపాటి తప్పు లేదు, చంద్రబాబు తప్పు అసలే లేదు… వెళ్లండి, అదే ముహూర్తానికి స్నానాలు చేయండర్రా అని ప్రబోధించిన చాగంటి తప్పు ఏమాత్రం లేదు… వాళ్లేమైనా స్నానాలకు అంతగా ఎగబడాలని చెప్పారా ఫాఫం… సో, టెక్నికల్లీ, బేసికల్లీ, లాజికల్లీ… అండ్ లీగల్లీ వాళ్లందరూ శుద్ధపూసలు…
అంతెందుకు మొన్నటి ఢిల్లీ రైల్ స్టేషన్‌లో తొక్కిసలాట గానీ, కుంభమేళా ప్రాంగణంలో తొక్కిసలాట గానీ… ఆ ప్రాణనష్టాలకు ఎవరు బాధ్యులు అవుతారు..? సింపుల్… భక్తజనానిదే తప్పు… ఎవడు పొమ్మన్నాడు..? అంతేనా ఎవరితో కమిషన్ వేసినా, వెలువడే అంతిమ తీర్పు..?
ఎస్, రేప్పొద్దున తిరుపతి తొక్కిసలాటకూ ఇదే సూత్రం వర్తిస్తే హాహాశ్చర్యపోకండి… ష్, మరో విషయం చెప్పుకుందాం… సంధ్య థియేటర్ తొక్కిసలాటకూ మరో దైవాంశ సంభూతుడు, మరో భోలేబాబా బన్నీకి కూడా సంబంధం లేదు ఫాఫం… ఎస్, బేసికల్లీ, లాజికల్లీ, టెక్నికల్లీ, లీగల్లీ బన్నీ అత్యంత స్వచ్ఛుడు… నేరగాడు కాదు…
ఈ రేవంత్ రెడ్డికే ఈ లీగల్ నిజాలు, సూత్రాలు, నైతికతలూ ఏమీ తెలియక… ఒరేయ్, వాడిని లోపలేయండర్రా అని ఆదేశించాడు… నాలుగు బాదలేదు గానీ జైలులో ఓ రాత్రంతా పండబెట్టారు… హెంత హన్యాయం..? ఒక భోలేబాబాకు ఒక బన్నీబాబా ఏం తక్కువ..? ఆ పాదధూళి కోసం ఎగబడే ఎన్ని లక్షల హృదయాలు ఉన్నాయో రేవంత్ రెడ్డికి తెలియకపోవడం అల్లు అర్జున్ తప్పు కాదు కదా పాపం..!!
Share this Article