.
విజయ్ దేవరకొండ… లాస్ట్ హిట్ ఇచ్చి ఎన్నేళ్లయిందో గుర్తుందా..? ఏమో, తనకూ గుర్తుండి ఉండదు… వరుస ఫ్లాపులు… అఫ్కోర్స్, ఎన్ని ఫ్లాపులున్నా సరే, తన పాపులారిటీకి ఢోకా ఏమీ రాలేదు… అదే గిరాకీ, అదే ఇమేజ్… అప్పట్లో గీతగోవిందం (2018)తో తనకు మంచి సూపర్ హిట్ ఇచ్చిన ఆ రష్మికనే పెళ్లి చేసుకున్నా సరే, ఇంకా గ్రహచారం మారలేదు పాపం… విధి ఇంకా ఎదురుతంతోంది…
ఆ రష్మికతోనే మళ్లీ తెరపై జతకట్టి… రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ స్టోరీని ప్రజెంట్ చేసి… ఎలాగైనా హిట్ కొట్టాలని ఆశపడ్డాడు- కష్టపడ్డాడు విజయ్ దేవరకొండ… పాపం, తన ఎఫర్ట్కు ఢోకాలేదు… ఆ పాత్రకు తగినట్టు తన మ్యాగ్జిమం తను ఇచ్చేశాడు… కానీ ఎటొచ్చీ ఫలితమే..! పాపం…
Ads
బ్రిటిష్ పాలనలోని మరుగునపడిన ఓ గతాన్ని ఆధారంగా చేసుకుని ‘రణబాలి’ తెరకెక్కింది… బ్రిటిష్ వారి అత్యాశ, క్రూరత్వం వల్ల భారతీయులు అనుభవించిన ఆకలి, నష్టాలను ఈ సినిమా చూపిస్తుంది… వారిని రక్షించడానికి రణబాలి అనే యోధుడిగా ఎలా ఉద్భవించాడనేదే ఈ కథ… నిజానికి సరిగ్గా ప్రజెంట్ చేసి ఉంటే కదిలించాల్సిన కథ ఇది…

ఈ సినిమా మమ్మల్ని బ్రిటిష్ కాలానికి తీసుకెళ్లి, ఆ కాలంలో ప్రజలు పడ్డ ఇబ్బందులు, ఆకలి బాధలను హృద్యంగా చెప్పే ఒక ప్రయత్నం మాత్రం చేసింది… స్క్రీన్ పై వచ్చే టెక్స్ట్, భావోద్వేగ సన్నివేశాల ద్వారా బ్రిటిష్ కాలపు బాధలను చూపిస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆ కష్టాలతో కనెక్ట్ అవుతారు… నిజంగా ఆ కథను అదే భావోద్వేగాల తీవ్రత కనిపించేలా కొనసాగించి ఉంటే 3 గంటల రన్ టైమ్ కూడా పెద్ద సమస్య కాదు… జనం కనెక్టయ్యేవారు…
సినిమాలో విపరీతమైన హింస ఉంది… బ్రిటిష్ వారిని ఎదుర్కొంటూ రణబాలి చేసే పోరాటం మనల్ని కదిలించాలి, తను బ్రిటిష్ వారిని అణచివేయాలని మనం కోరుకునేలా చేయాలి… కానీ దీనిని అలా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు… ఏ ఒక్క యాక్షన్ బ్లాక్ కూడా సరిగ్గా పండలేదు… ఇంటర్వెల్ బ్లాక్ అయినా, బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్న ఆహారాన్ని రణబాలి తిరిగి ప్రజలకు పంచే సీన్ అయినా… వాటి వెనుక బలమైన ఎమోషనల్ బిల్డప్ లేదు…
అక్కడక్కడా కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే పడ్డాయి… కానీ విసుగు పుట్టించే కథనం, నెమ్మదితనం, మరీ ఎక్కువ రన్ టైమ్ వల్ల వాటి ఇంపాక్ట్ కనిపించకుండా పోయింది… స్క్రీన్ పై చాలా సీన్లు వస్తుంటాయి, పోతుంటాయి… ఏమీ మన హృదయాలను తాకవు… నిజానికి ఈ చిత్రానికి సరైన ఎడిటర్ దొరికి ఉంటే బాగుండేది…
(ఈ సినిమా ఫంక్షన్లో ఓ ఫ్యాన్ షర్ట్ ఇది… నీయక్క, బాంచెన్ వంటి పదాల్ని నాని, విజయ్ వంటి స్టార్లు తక్షణం ఆపేయాలి, వాటి అర్థం తెలుసా వీళ్లకు..? తెలిసీ పెడపోకడా..? ఆ ప్రభావం ఫ్యాన్స్ మీద ఎలా ఉంటుందో చెప్పే ఉదాహరణ ఇది…)
‘రణబాలి’ చూస్తున్నంత సేపు విజయ్ “నీయక్క” అని ఎన్నిసార్లు అన్నాడో లెక్కపెట్టలేనంతగా వినిపిస్తుంది… ఒక దశ తర్వాత అది భరించలేనంతగా మారుతుంది, కానీ దర్శకుడు దానిని పట్టించుకోలేనట్లు కనిపిస్తాడు… మొత్తంగా చెప్పాలంటే, ‘రణబాలి’ ఒక హృదయ విదారక కథను చెప్పడానికి చేసిన నిజాయితీ ప్రయత్నమే అయినప్పటికీ, అన్ని ప్రయత్నాలూ విఫలమై విసుగు పుట్టించే, బోరింగ్ సినిమాగా మిగిలిపోతుంది…
విజయ్ దేవరకొండ ఇప్పటివరకు మనం చూసిన సినిమాలకంటే ఇందులో చాలా భిన్నంగా కనిపిస్తాడు… మొదట్లో తన లుక్, ముఖ్యంగా మాట్లాడే స్లాంగ్ కొత్తగా అనిపిస్తాయి… వాటికి అలవాటు పడడానికి మనకే కొంత సమయం పడుతుంది… రణబాలి పాత్ర కోసం తన నిజాయితీ గల ప్రయత్నం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది…
విజయ్ పర్సనాలిటీని బట్టి ఓ యోధుడి లుక్ను తీసుకురావల్సింది… అందులోనూ లోపమే… ఇక రష్మిక గురించి చెప్పాలి… తన నటన గురించి చెప్పడానికి వంకలేముంటాయి..? ఏ పాత్రనైనా ఆవాహన చేసుకునే నేషనల్ క్రష్ ఆమె… ఇందులో ఆమె ప్రజెన్స్ కొంత ఊరట… జయమ్మ పాత్రలో మంచిగా నటించింది… నో మైనస్ మార్క్స్…
అర్నాల్డ్ వోస్లూ క్రూరమైన బ్రిటిష్ అధికారి ఇమేజ్కి చక్కగా సరిపోయాడు… తన పాత్రకు న్యాయం చేశాడు… సినిమాలో మరో నిరాశ సంగీతం… అజయ్-అతుల్ నేపథ్య సంగీతం (BGM) మన విసుగును మరింత పెంచుతుంది… దాదాపు మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమాలో మనసులో నిలిచిపోయే ఒక్క పాట లేదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా లేదు… వెరసి విజయ్ దేవరకొండకు మళ్లీ నిరాశ…
జైలర్2 మీద మిక్స్డ్ ఒపీనియన్ వస్తున్న నేపథ్యంలో… రణబాలి ఏమాత్రం బాగున్నా వసూళ్లకు ఢోకా ఉండేది కాదేమో… ప్చ్, చాన్స్ మిస్…!!
Share this Article