హిందూ దేవుళ్లపై, గుళ్లపై, ఆస్తులపై, ఆగమాలపై, ఆదాయంపై, ఆచారవ్యవహారాలపై…. కోర్టులు, బ్యూరోక్రాట్లు, లీడర్ల నిర్ణయాలు, తీర్పులేమిటి..? ఒక గుడిలో ఏ పూజ ఎలా ఉండాలో కోర్టులు నిర్దేశిస్తుంటయ్… దేవుడిని ఆదాయవనరుగా ఎలా మార్చాలో లీడర్లు ఆలోచిస్తుంటరు… తమ ఆదాయం పెంచుకోవడానికి అవినీతి అధికారులు ప్రయాసపడుతుంటరు…….. మఠాలు, పీఠాలు నడిపేవాళ్లకు మాత్రం.., ఆధ్యాత్మికరంగంలో కృషిచేసేవాళ్లకు మాత్రం హిందూ గుళ్లపై కనీసం అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ కూడా ఉండదు…… ఇదేకదా కొందరి వాదన… అందుకే కదా ఈ దిక్కుమాలిన పెత్తనాల నుంచి వాటిని విముక్తం చేయాలనే డిమాండ్లు… కానీ ఏ ప్రభుత్వమూ పెత్తనాన్ని వదులుకోదు… వీలయితే ఇంకాస్త ఎక్కువ ఆంక్షల్లో ఇరికిస్తుంది… దీనికి సోకాల్డ్, వీర హిందుత్వ బీజేపీ ప్రభుత్వాలు కూడా అతీతం ఏమీ కాదు… మిగతా కుహనా సెక్యులర్ ప్రభుత్వాలకన్నా పిసరంత ఎక్కువే పెత్తనాన్ని చేస్తయ్…
అంతెందుకు..? ఆమధ్య ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ ఏం చేశాడు..? హిందువులు అత్యంత పవిత్ర దర్శనీయ స్థలాలుగా భావించే భద్రినాథ్, కేదారనాథ్, గంగోత్రి, యమనోత్రి వంటి చార్ధామ్ సహా మొత్తం 51 గుళ్లను సర్కారు పెత్తనం పరిధిలోకి తీసుకొచ్చేశాడు… ఓ ఐఏఎస్ అధికారిని పెడతాను, తనే అన్ని వ్యవహారాలూ పర్యవేక్షిస్తాడు అని చెప్పాడు… చార్ ధామ్ దేవస్థానం యాక్ట్ అని కొత్తగా బిల్లు తెచ్చి, అసెంబ్లీలో పెట్టి, ఆమోదింపజేసి గుళ్ల పగ్గాల్ని తన చేతుల్లోకి తీసేసుకున్నాడు… ప్రతి గుడి బోర్డుకూ నేనే ఛైర్మన్, ఈ ఐఏఎస్ సీఈవో అన్నాడు… ఏటా లక్షల మంది యాత్రికులు భక్తిగా దర్శించుకునే ఈ గుళ్లలో ఇక చీమచిటుక్కుమనాలన్నా సదరు ఐఏఎస్ అధికారిదే నిర్ణయాధికారం అన్నమాట… దాంతో ఆయా గుళ్ల అర్చకులు, అక్కడి వ్యాపారులు గట్రా ఆందోళనలకు దిగారు… ఈ తలకుమాసిన సర్కారీ పెత్తనాల నుంచి మీరే కాపాడాలి మహాప్రభో అంటూ ఆయా గుళ్లలో దేవుళ్లకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు…
Ads
రాజకీయాధికారం తప్ప మరో ఆలోచన పట్టని మోడీషా ద్వయం, బీజేపీ హైకమాండ్ సహజంగానే ఏమీ పట్టించుకోలేదు… హిందుత్వ ఎమోషన్స్ ప్రేరేపించడం తప్ప, తమ నిర్ణయాధికార పరిధిలో ఉన్న సానుకూల నిర్ణయాలు కూడా దానికి చేతకాలేదు… ఇలాంటి చిన్న చిన్న అంశాల్ని మేం పట్టించుకోవడం ఏమిటి అనుకున్నారు..? ఈలోపు అదే పార్టీకి చెందిన లిటిగెంట్ లీడర్ సుబ్రహ్మణ్యస్వామి ఈ చట్టంపై హైకోర్టుకు వెళ్లాడు… కోర్టుల్లో కేసులే కదా ఆయనకు తెలిసిన రాజకీయం… సరే, వేశాడు… అసలు మతసంస్థల మీద సెక్యులర్ ప్రభుత్వాల పెత్తనాలు ఏమిటి అనేదే కేసు కాన్సెప్టు… ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సవాల్ చేశాడు… హైకోర్టు ఈ కేసులో మెరిట్ లేదని రిజెక్ట్ చేసింది… ఈ స్వామి ఊరుకునేరకం కాదు కదా… సుప్రీంకోర్టుకు వెళ్లాడు… కేసు ఇంకా లిస్టు కాలేదు, పెండింగ్…
ఈలోపు సదరు ముఖ్యమంత్రే బోలెడు ఆరోపణల కారణంగా కుర్చీ దిగాల్సి వచ్చింది… కొత్తగా తీర్థసింగ్ రావత్ (తీరత్ సింగ్…) కుర్చీ ఎక్కాడు… వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది విశ్వహిందూ పరిషత్… మరోవైపు హిందూ సమాజం సర్కారు చట్టాన్ని చీదరించుకుంటోంది… దాంతో కొత్త ముఖ్యమంత్రి విశ్వహిందూపరిషత్ కేంద్రీయ మార్గదర్శక మండల్ పెద్దలతో భేటీ వేశాడు… సో వాట్..? బీజేపీ ప్రభుత్వం అయితేనేం..? ఉంటే ఉంటుంది, లేకపోతే ఊడుతుంది అనుకున్న హిందూ సంస్థలన్నీ ఒక్కటి కాసాగాయి… ఇది మొదటికే మోసం తెస్తుందనే సోయి అప్పటికిగానీ రాలేదు బీజేపీకి… వెంటనే ఈ 51 ఆలయాలపై సర్కారీ పెత్తనాన్ని వదులుకుంటున్నామనీ, ఆ కొత్త చట్టాన్ని అమలు చేయబోమనీ సీఎం ప్రకటించాడు… ఆహా, ఓహో అని సోషల్ మీడియాలో హిందుత్వవాదులు చప్పట్లు కొడుతూ అభినందిస్తున్నారు… అయితే..?
నిజానికి సమస్యకు కారణమే బీజేపీ ప్రభుత్వం… సర్కారు పెత్తనం కింద లేని గుళ్లను స్వాధీనం చేసుకున్నది బీజేపీ ప్రభుత్వమే… ‘సర్కారీ పెత్తనం నుంచి హిందూ గుళ్ల విముక్తి’ అనే దిశలో అది చేసిందేమీ లేదు… నిజానికి దానికి పూర్తిగా వ్యతిరేకంగా పోయింది… ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది తప్ప అది హిందూ సమాజం ఆశలు, కోరికల దిశలో ఉద్దరించింది ఏమీ లేదు… ఇప్పటికీ ఆ చట్టం అలాగే ఉంది… సో, సగటు హిందుత్వవాది కోరికల మేరకు, ప్రత్యేకించి హిందూ గుళ్లు, దేవుళ్లకు సంబంధించి బీజేపీ నడుచుకుంటుందనేది ఓ భ్రమ… దాని లెక్కలు, దాని ప్లాన్లు దానికుంటయ్, వాటి ప్రకారమే అది వెళ్తుంది… అంతే…
Share this Article