మన భ్రమ… మనం ఖగోళాన్ని జయిస్తున్నామనీ… మనం నీచమైన పాత సంప్రదాయాల్ని బద్ధలు కొట్టుకుంటూ… వేగంగా ముందుకు దూసుకుపోతున్నామనీ… నవీనయుగంవైపు అడుగులు వేస్తున్నామనీ అనుకుంటున్నాం… శుద్ధ అబద్ధం…. మన అడుగులు కేవలం జిమ్‌లో కనిపించే ట్రెడ్‌మిల్‌పై మాత్రమేననీ… ఎంత చెమటలు పట్టినా మనం అక్కడే ఉండిపోయామనీ మనకు అర్థం కాదు, కావడం లేదు… ఆడ మనిషి రజస్వల అయితే ఇంకా ఊరి బయట గుడిసెల్లో ఉంచేస్తున్న రోజుల్లోనే ఉండిపోయామనీ… ఇప్పటికీ ఆడ పిల్లలకు వర్జినిటీ టెస్టులు చేసే రోజుల్లోనే ఉండిపోయామనీ మనకు అర్థం కాదు… కావడం లేదు… మన ట్రెడ్ మిల్ పురోగతికి మరో నిఖార్సయిన ఉదాహరణ ఇది… ఇంకా శీలం అంటే ఓ భౌతిక లక్షణమనే భ్రమల్లోనే ఉండిపోయిన సమాజంలోనే ఉండిపోయామనీ మనకు తెలియజేస్తున్నది ఈ వార్త…
కొల్లాపూర్…. మహారాష్ట్ర… ఇద్దరు అక్కాచెల్లెళ్లకు గత నవంబరులో ఇద్దరు అన్నాదమ్ములతో పెళ్లయింది… వాళ్లది కంజర్భట్ కులం… ఆ కులంలో ఈరోజుకూ ఓ దిక్కుమాలిన సంప్రదాయం కొనసాగుతూనే ఉంది… పెళ్లయ్యాక నవవధువుకు శీలపరీక్ష అంటే కన్యత్వపరీక్ష చేస్తారు… అంటే పెళ్లికి ముందు ఆమెకు ఎవరితోనూ సంభోగం లేదనీ తేలుస్తారన్నమాట… తొలిరాత్రి ఓ తెల్లటి వస్త్రం మీద సంభోగించాలి… తెల్లవారి నెత్తుటి మరకలు గనుక కనిపిస్తే ఆమెకు అంతకుముందు కన్నెపొర చిరిగిపోలేదని లెక్క… లేదంటే ఆమెకు గతంలోనే ఆ సుఖం తెలిసి ఉందనీ, కన్నెపొర ఎప్పుడో చిరిగిపోయిందనీ తేలుస్తారు… అనాగరికం… ఈ కథలో ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లలో ఒకరు ఈ కన్యత్వ పరీక్షలో ఫెయిలైంది.,.
Ads
ఇంకేముంది..? ఆమె పెళ్లికి ముందే ఆ సుఖం పొందినట్టు ఆ కులపెద్దలు తేల్చేశారు… అసలు ఆమె ఒక్కతే కాదు, అక్కాచెల్లెళ్లు ఇద్దరి శీలమూ సరికాదనీ, పది లక్షలు జరిమానా చెల్లించాలనీ ఆ ఇద్దరు భర్తలు డిమాండ్ చేశారు… లేకపోతే విడాకులే అని బెదిరించారు… కొట్టారు… తమ పుట్టింటికి తరిమేశారు… ఆ అక్కాచెల్లెళ్ల తల్లి లబోదిబోమంటూ ‘జాట్ పంచాయత్’ సభ్యుల్ని ఆశ్రయించింది… మీరే న్యాయం చెప్పి, సమస్యను పరిష్కరించాలని బతిమిలాడింది… వాళ్లు 40 వేలు ఇస్తే కేసు సెటిల్ చేస్తామన్నారు… ఎవడి దందా వాడిది… ఆమె అప్పోసప్పో చేసి ఆ డబ్బు చెల్లించాక మొన్నటి ఫిబ్రవరిలో ఓ గుడిలో ‘పంచాయితీ’ నిర్వహించారు ఈ కులపెద్దలు… తప్శా కాలేదు… అంటే తీర్పు వీళ్లకు అనుగుణంగా ఏమీ రాలేదు… పైగా ఆ పెళ్లిళ్లను రద్దు చేసుకోవడమే ఉత్తమం అని తీర్పు చెప్పారు… అంతేకాదు, ఆ నవవధువులిద్దరినీ కులం నుంచి బహిష్కరించారు… చేసేదేముంది..? ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది… ఇద్దరు భర్తలు, అత్త, పలువురు కులపెద్దలపై ఫిర్యాదులు చేశారు… ఆ రాష్ట్రంలో Maharashtra Prohibition of People from Social Boycott (Prevention, Prohibition and Redressal) Act ఉంది… అంటే సామాజిక బహిష్కరణను నేరంగా పరిగణించి, శిక్షించే చట్టం ఉంది… కేసు పెట్టారు… కానీ కన్యత్వ పరీక్షల్ని నిర్వహించినందుకు, వాటి ఆధారంగా విడాకులు ఇస్తున్నందుకు శిక్షించే చట్టం ఏది..? లేదు..! ఉండదు… మన నాగరిక ప్రభుత్వాలు కూడా ఆ కులపెద్దల స్థాయిని మించి ఏమీ ఎదగలేదు కదా… ఆ శీలయుగం అలియాస్ శిలాయుగంలోనే మనం ఆగిపోయాం గనుక…!!
Share this Article