ఇదిగో తలుపేసుకో!
విమానమేసుకుని దుబాయ్ వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుని మధ్యాహ్నం భోజనానికి వస్తా!
——————–
ఎవరి సమస్యలు వారివి. పీత కష్టాలు పీతవి. సీత కష్టాలు సీతవి. సరిగ్గా పోయిన సంవత్సరం ఇదే వేళకు లాక్ డౌన్ నిర్బంధాల్లో దేశమంతా వలస కార్మికులు కనీసం అయిదు కోట్ల మంది కత్తి అంచు మీద నెత్తురు చిట్లుతున్నా నడిచి సొంత ఊళ్లకు వెళ్లారు. “ఇంటికాడ పిల్ల జెల్ల ఎట్ల ఉన్నరో?”
అని ఆ సందర్భానికి వైవిధ్యమయిన తెలంగాణ కవి ఆదేశ్ రవి అనన్యసామాన్యమయిన పద చిత్రం ఫ్రేమ్ కట్టి ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ అదే పాట అదే బాధతో అలాగే పాడుకోవాల్సిన రోజులొస్తున్నాయి. లేనివారి కష్టాలకు కన్నీళ్లు కూడా ఇంకిపోతాయి.
Ads
ఉన్నవారి కష్టాలకు విమానాలకు రెక్కలొస్తాయి. ఎలా అంటే- ఈ వార్త చదవండి. భారత దేశంలో కరోనాకు అందుబాటులో ఉన్నవి రెండు వ్యాక్సిన్లు. ఒకటి- కోవి షీల్డ్. రెండు- కోవాగ్జిన్. నిజానికి కోవి షీల్డ్ బ్రిటన్ ఆవిష్కరణ. భారతీయ కంపెనీ సీరం ఆ హక్కులను కొనుక్కుని ఇక్కడ తయారు చేస్తోంది. కో వాగ్జిన్ భారత్ బయోటెక్ తెలుగువారి కంపెనీ. ఇంకో రెండు వ్యాక్సిన్లు దారిలో ఉన్నాయి. అమెరికాలో ఫ్రైజర్ వ్యాక్సిన్ కు ఆదరణ ఎక్కువ. ఆ ఫ్రైజర్ దుబాయ్ లో దొరుకుతుంది. ఆ దుబాయ్ లో కొన్ని రకాల వీసాలున్న వారికి వేస్తారు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే సంపన్నులకు ఎన్ని దేశాల వీసాలు ఉంటాయో, ఎన్ని దేశాల పౌరసత్వం ఉంటుందో వారికే తెలియదు. ఈ సగటు భారతీయులు వేసుకునే కోవి షీల్డ్, కో వాగ్జిన్ వేసుకోవాల్సిన అవసరం వారికి లేదు. సొంత విమానంలోనో, అద్దెకు తీసుకున్న చార్టర్డ్ విమానంలోనో దుబాయ్ వెళుతున్నారు. ఫ్రైజర్ టీకా వేయించుకుంటున్నారు. వస్తున్నారు. నెలరోజులకు మళ్లీ వెళ్లి రెండో డోసు వేయించుకుని వస్తున్నారు. కొందరు అక్కడే ఒక నెల ఉండి, రాచకార్యాలు చక్కబెట్టుకుని వ్యాక్సిన్ పని, వ్యాపారం పని చూసుకుంటున్నారు. ఒకసారి చార్టర్డ్ విమానంలో పోను- రాను ముష్టి అరవై లక్షల రూపాయలే అట. రెండు డోసులకు కోటీ ఇరవై లక్షలు. చిల్లర ఖర్చులు ఇంకో యాభై లక్షలు. వ్యాక్సిన్ ఎవరికీ ఊరికే రాదు. అందులో సంపన్నులకు వ్యాక్సిన్ చాలా ఖర్చుతో కూడుకున్న పనిగా మారితేనే వారి హోదాకు ఒక విలువ. ఒక తృప్తి.
“ఇడిసిపెడితే నడిచి మేము పోతాం సారూ!” అని ఆదేశ్ రవి పేదల కష్టాల మీద బాధపడ్డాడు. సొంత విమానాల్లో దుబాయ్ కి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకునే ధనవంతులను చూస్తే ఏమంటాడో?…….. By……… -పమిడికాల్వ మధుసూదన్
Share this Article