ప్రాణవాయువు అందడం లేదు
——————
నిజమే. ప్రాణాలు పోతున్నాయి. ప్రాణవాయువు అందక ఊపిరులు పోతున్నాయి. వీధి కొళాయి ముందు క్యూలో బిందెలు పట్టుకున్నట్లు మానవ నాగరికతలో ఇదివరకు ఎప్పుడయినా, ఎక్కడయినా ఆక్సిజెన్ సిలిండర్లు నింపుకోవడానికి రోగుల బంధువులు క్యూలో నిలుచున్నారా? ఆక్సిజెన్ ట్యాంకులు ఎన్ని ఉన్నాయో ఇదివరకు ప్రభుత్వాలు ఎప్పుడయినా లెక్కలు చుశాయా?
ఆంజనేయుడు తిరుమల అంజనాద్రి కొండ జపాలిలో పుట్టాడని నిన్ననే టి టి డి ప్రకటించింది. ఆంజనేయుడు పుట్టీ పుట్టగానే ఉయ్యాల్లో ఏడుస్తుంటే- ఆకలిగా ఉన్నట్లుంది- పండు తెస్తాను ఉండు- అని తల్లి అంజనాద్రి తోటలోకి వెళ్లింది. ఆకలికి ఆగలేని ఆంజనేయుడు ఆకాశంలో సూర్యుడిని పండనుకుని ఎగిరి తినబోయాడు. ఆ సమయానికి సూర్యుడిని రాహువు మింగాలి. రాహువు వెళ్లి ఇంద్రుడికి ఫిర్యాదు చేశాడు. ఇంద్రుడు పరుగు పరుగున వస్తుంటే- ఆంజనేయుడు ఇంద్రుడి వైపు వెళ్లాడు. కొంప కొల్లేరు అయ్యేలా ఉందని ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమను కొట్టాడు. స్పృహదప్పి హనుమ అంతెత్తునుండి కింద పడ్డాడు. హనుమ కాబట్టి కొద్దిగా బుగ్గలు వాచాయి కానీ- ఇంకేమీ కాలేదు. కానీ స్పృహలో లేడు. హనుమ తండ్రి వాయుదేవుడికి కోపం వచ్చింది. అలిగి గాలి ప్రసరణను ఆపేసి సమ్మె చేశాడు. అంతే లోకాలన్నీ స్తంభించిపోయాయి. అప్పుడు బ్రహ్మతోపాటు దేవతలందరూ వాయుదేవుడి కాళ్లా వేళ్లా పడి- సమ్మెను విరిమింపజేశారు. లోకాలు ఊపిరి పీల్చుకున్నాయి. అప్పటినుండి ఇప్పటిదాకా మళ్లీ ప్రాణవాయువుకు ఢోకా రాలేదు.
Ads
కరోనా సెకెండ్ వేవ్ మొదలయ్యాక ఇప్పుడిప్పుడే ప్రాణవాయువు దొరకడం లేదు. ఆక్సిజెన్ సిలిండర్లు నీళ్ల ట్యాంకుల్లా రోడ్ల మీద తిరుగుతున్నాయి. ఇప్పుడు హనుమకు ఏ అపచారం జరిగి ప్రాణవాయు దేవుడు హర్ట్ అయ్యాడో చెప్పగలిగిన ప్రవచనకర్తలు ఎక్కడున్నారు?
——————–
మహారాష్ట్ర నాసిక్ ఆసుపత్రిలో ఆక్సిజెన్ సిలిండర్ లీకై- ప్రాణవాయువు అందక 24 మంది రోగుల ఊపిరి శాశ్వతంగా ఆగిపోవడాన్ని రాయడానికి మాటలేమి సరిపోతాయి? మృత్యువును జయించడానికి ప్రాణవాయువు గొట్టం పెట్టుకుంటే- ఆ గొట్టమే ఊపిరి తీస్తే ఇక దిక్కేది? మొక్కేది?
సకల గ్రహరాశుల్లో భూమి ఒక్కటే ప్రాణులకు నివాసయోగ్యం. దానికి గాలి, నీరు రెండే ప్రధాన కారణం. మిగతావన్నీ దాదాపు అన్ని గ్రహాల్లో సేమ్ టు సేమ్.
“భూగోళం పుట్టుకకోసం కూలిన సురగోళాలెన్నో?
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో?”
భూమ్మీద ప్రాణవాయువు దొరకక ప్రాణాలు ఆవిరయ్యే రోజులు వస్తాయని ఎవరయినా ఊహించారా? తుదిశ్వాస వదలడం కాదు. శ్వాస ఆడక చితిపై పడుకోవాల్సి వస్తోంది. రూకలు మిగిలి ఉన్నా; నూకలు మిగిలి ఉన్నా- నూకలు చెల్లుతున్నాయి. బతికి హాయిగా ఊపిరి పీల్చుకోవాల్సిన గుండెలు- అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. గాలి ఆడడం లేదు. శరీరాలు కదలడం లేదు. వల్లకాట్లో శవాలు క్యూలో నిలుచోలేక పడుకుంటున్నాయి.
శ్మశానవాటికలో జాషువా పద్యం:-
“ఇచ్చోట; నే సత్కవీంద్రుని కమ్మని
కలము, నిప్పులలో గఱిగిపోయె
యిచ్చోట ; నేభూములేలు రాజన్యుని
యధికార ముద్రికలంతరించె
యిచ్చోట ; నేలేత ఇల్లాలి నల్లపూసల
సౌరు, గంగలోగలసిపోయె
యిచ్చోట ; నెట్టి పేరెన్నికంగొన్న
చిత్రలేఖకుని కుంచియనశించె?
ఇది పిశాచులతో నిటలేక్షణుండు
గజ్జెగదలించి యాడురంగస్థలంబు
ఇది మరణదూత తీక్షణమౌ దృష్టులొలయ
నవని పాలించు భస్మ సింహాసనంబు!”
-పమిడికాల్వ మధుసూదన్
Share this Article