వాల్మీకి పద్య కావ్యం వ్రాస్తే , బాపు దృశ్యకావ్యంగా మలిచారు . ఆయన బుధ్ధిమంతుడు , ముత్యాలముగ్గు వంటి సాంఘిక సినిమాలను తీస్తేనే అవి రామాయణం , భాగవతంలాగా ఉంటాయి . ఇంక రామాయణమే తీస్తే ఎలా ఉంటుందో చెప్పవలసిన అవసరమే లేదు . వాల్మీకి కూడా మెచ్చుకోవలసిందే . 1976 లో వచ్చిన ఈ సీతాకల్యాణం దృశ్యకావ్యం వ్యాపారపరంగా విఫలమయింందని అంటారు . అది ఎలా ఉన్నా , ఈ సినిమాకు ఎన్నో పురస్కారాలు , గౌరవాలు , పండితుల చప్పట్లు వచ్చాయి .
బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూటులో తమ పాఠ్యాంశంలో ఒక అధ్యాయంగా ఈ సినిమాను చేర్చుకున్నారు . ఎన్నో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్సులో ప్రదర్శించబడింది . తెలుగులో ఉత్తమ దర్శకత్వానికి బాపుకి ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది . ఫిలిం ఫేర్ వారిదే గుమ్మడి నటనకు ప్రత్యేక పురస్కారం ఇవ్వబడింది . 48 సంవత్సరాల కింద తీయబడిన ఈ సినిమాలోని గంగావతరణం ఈరోజుకీ అబ్బురమే . రవికాంత్ నగాయిచ్ ట్రిక్ ఫొటోగ్రఫీ , బాపు కళాత్మక ఆలోచన ఓ గొప్ప విజ్యువల్ వండర్ . గంగ , శివుడు పాత్రధారుల పేర్లు నాకు తెలియవు కానీ ఒకరు అందంగా , మరొకరు గంభీరంగా చాలా బాగుంటారు .
సీతా స్వయంవరం , సీతారామ కల్యాణం కధాంశంగా చాలా సినిమాలు వచ్చాయి . మనందరం మరచిపోలేనిది NTR సీతారామ కల్యాణమే . ఆ సినిమాలో సీతగా గీతాంజలిని . ఆ తర్వాత స్వయంవర సీతగా జయప్రద చాలా అందంగా కనిపిస్తుంది ఈ సినిమాలో . 1976 జయప్రదకు కలిసొచ్చిన సంవత్సరం . ఈ సంవత్సరంలో వచ్చిన సినిమాలు ఆమెను సూపర్ స్టార్ చేసాయి . 1934 లో సీతాకల్యాణం అనే టైటిలుతోనే ఒక తెలుగు సినిమా వచ్చింది . బందరు మినర్వా టాకీస్ అధినేత పినపాల వెంకటదాస్ చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో తీసారు . కమర్షియల్ గా కూడా బాగా సక్సెస్ అయింది .
Ads
బాపు సినిమాలో ముందుగా చెప్పుకోవలసింది సత్యనారాయణ రావణుడి పాత్ర . S V రంగారావు లేని లోటుని తీర్చారు అని అనిపిస్తుంది . రావణుడు , దుర్యోధనుడు , ఘటోత్కచుడు ఇత్యాది అన్ని పాత్రలకు అపర యస్వీఆరా అని అనిపించారు . హేట్సాఫ్ . అయితే ఈ బాపు సినిమాలో హేండీకేప్ రామ పాత్రధారి . కల్యాణ రాముని వయసుకు NTR దాటిపోయారు . శోభన్ బాబుని తీసుకుని ఉండి ఉండాల్సింది . మరెందుకనో కొత్త నటుడు రవిని పెట్టుకున్నారు . ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు .
(సినిమాను ఎంత గొప్పగా తీసినా రాముడి పాత్రధారి ఎంపికలో లోపం సినిమాను ఆర్థికంగా దెబ్బతీసినట్టుంది… జనం ఆ నటుడిని యాక్సెప్ట్ చేయలేకపోయారు… రాముడికి డైలాగ్స్ కూడా చాలా తక్కువ…)
వశిష్ఠుడిగా ధూళిపాళ . ఆయన్ని శకునిగా పడేసి , పిజే శర్మనే వశిష్ఠుడిగా పడేస్తే బాగుండేదేమో ! డబ్బులు ప్రాప్తం లేకపోతే ఇలాగే ఇటూఅటూ అవుతుంటాయి . దశరధునిగా గుమ్మడి , కైకగా జమున , జనకుడిగా మిక్కిలినేని , విశ్వామిత్రుడిగా ముక్కామల అద్భుతంగా నటించారు . నారదుడిగా కాంతారావు గురించి చెప్పేదేముంది . ఆయన్ని తప్పించి మరొకరిని ఊహించుకోలేము . మండోదరిగా మమత బాగా నటించింది .
మేనకగా హలం చాలా అందంగా కనిపిస్తుంది . బాపు తన ముత్యాలముగ్గు సినిమాలో కూడా హలానికి జనం గుర్తుంచుకునే పాత్రనే ఇచ్చారు . ఇంక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది కె వి మహదేవన్ సంగీతాన్నే . భక్త రామదాసు , త్యాగరాజు , గబ్బిట వెంకటరావు పాటలకు , పద్యాలకు న్యాయం చేసారు . కల్యాణం చూతము రారండి అనే పాట వినిపించని లోగిలి ఉందా తెలుగునాట… ప్రతి పెళ్లి కేసెట్లలోనూ వినిపించే గీతమే…
బాపు పౌరాణికాలు అంటే భక్తి రసంతో నిండిపోతాయి . పోతన కూడా చప్పట్లు కొట్టాల్సిందే . ముఖ్యంగా చెప్పుకోవలసింది ఆరుద్ర వ్రాసిన కదిలింది కదిలింది గంగ పాట . సాహిత్యం , సంగీతం , చిత్రీకరణ , సుశీలమ్మ – బాలసుబ్రమణ్యం – పి బి శ్రీనివాస్ – రామకృష్ణ – వసంతల గాత్రం అత్యద్భుతం . మరో గొప్ప పాట సి నారాయణరెడ్డి వ్రాసిన మహావిష్ణు కధలు . ఈ పాటను కూడా అందరూ పాడారు . నాకయితే పాటలు కాసిని ఎక్కువ అయ్యావేమో అని అనిపించింది . మాటలు తగ్గి , పాటలు ఎక్కువ అయ్యావేమో !
ఈ సినిమాలో మెచ్చుకోవలసింది ముళ్ళపూడి వారి స్క్రీన్ ప్లే . అద్భుతం . రామాయణంలోని వేర్వేరు ఘట్టాలు , బాలకాండలోని ఘట్టాలను చక్కగా ఓ అందమైన దండగా కట్టారు . వేదవతి శాపం , సీతమ్మ జననం , తారకాసుర వధ , శివ ధనస్సు చరిత్ర , త్రిశంకుడు – ఆయన స్వర్గం , మహావిష్ణు అవతారాలు , ఇలా చాలా బాగా స్క్రీన్ ప్లేని తయారు చేసి తన మిత్రుడు బాపు కుంచెకు అప్పచెప్పారు .
బాపు ప్రకృతి ప్రేమికుడు . ఇండోర్ సెట్టింగుల కన్నా ఔట్ డోర్ సెట్టింగులలోనే తన దర్శక ప్రతిభను బాగా చూపించుకుంటారు . ఈ సినిమాలోనూ అంతే . కళా దర్శకుడిని కూడా ప్రత్యేకంగా అభినందించాలి . నాకు చాలా ఇష్టమైన సినిమా . టివిలో వచ్చిన ప్రతిసారీ కాసేపయినా చూడాల్సిందే . మాతరంలో చూడనివారు ఎవరూ ఉండరు . ఈతరంలో చాలామంది చూసి ఉండకపోవచ్చు .
కళారాధకులు , రసహృదయులు అసలు మిస్ కాకూడని సినిమా ఇది . యూట్యూబులో ఉంది . తప్పక చూడండి . ఆస్వాదించండి . ముఖ్యంగా సినిమా రంగంలోకి రావాలనుకునే సాంకేతిక వర్గం తప్పక చూడవలసిన పాఠ్యాంశం ఈ బాపు గారి సీతాకల్యాణం సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article