అవునండీ, మేం మొత్తుకుంటున్నదీ ఇదే… ‘ముచ్చట’ రాస్తున్నదీ ఇదే… కాకపోతే మేమేమైనా అంటే కోపాలు… తిట్లు, శాపనార్థాలు… ఇప్పుడు సుప్రీంకోర్టే అంటోంది… అచ్చం మేం అంటున్నట్టుగానే… దాదాపు ఎలాగంటే..? ‘‘ఏమయ్యా మోడీ… మీ ప్రభుత్వం కరోనాను ఎదుర్కొంటున్న తీరు ఏం బాగోలేదు… అసలు ఒకే టీకాకు వేర్వేరు ధరలేమిటి స్వామీ..? మీరు తీసుకునే నిర్ణయాలతో పేదలు ఏమైపోవాలి..? పేదప్రజలు వేక్సిన్ల కోసం కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటళ్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలా..? అసలు దేశమంతా ఉచితంగా టీకా వేసే ప్రణాళిక ఎందుకు ఉండకూడదు..? టీకా ధరల్ని ఉత్పత్తిదారులే నిర్ణయించుకునేందుకు ఎలా అనుమతిస్తున్నారు..? ఔషధాల ధరల్ని డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం ఖరారు చేసే అధికారం, బాధ్యత, విధి కేంద్ర ప్రభుత్వానివే కదా..’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది… ఇది సూమోటో విచారణ…
అంతేకాదు… ‘‘అమెరికాలో ఆస్టాజెనెకా వేక్సిన్ ధర ఇండియాలోకన్నా ఎక్కువ… మన దేశమే ఎందుకు ఎక్కువ ధర చెల్లించాలి…? ఐనా ఒకే టీకాకు వేర్వేరు ధరలేమిటి..? కేంద్రానికి 150 ధరేమిటి…? రాష్ట్రాలకు ఇస్తే అదే టీకా 300, 400 ఏమిటి…? ఈ తేడాను దేశప్రజలే కదా భరించేది..? మరి కేంద్రమే వందశాతం వేక్సిన్ ఎందుకు కొనుగోలు చేయకూడదు..? ఈ ధరల్లో తేడా 30, 40 వేల వరకూ వెళ్తుంది… ఇది ప్రజలే భరించాలా..? అసలు సమాఖ్య స్పూర్తిని గుర్తుంచుకోరా..? ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ… జాతీయ వేక్సిన్ విధానం అంటూ ఉండదా..? గుళ్లు, మసీదులు, హోటళ్లు ఇలా అందుబాటులో ఉన్నవాటిని కరోనా కేంద్రాలుగా మార్చినా తప్పేముంది..? గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటకలకు ప్లస్ ఢిల్లీకి ఆక్సిజన్ సప్లయ్స్ కూడా విచారిస్తాం…’’ అంటూ ప్రశ్నల పరంపర గుప్పించింది… వాస్తవంగా కొద్దిరోజులు కేంద్ర ప్రభుత్వపు వేక్సిన్ పాలసీ వార్తలు చదువుతున్న ప్రతి చదువరి మదిలోనూ మెదిలే ప్రశ్నలే ఇవన్నీ… అవే సుప్రీంకోర్టు కూడా అడిగింది…
‘‘కరోనా సంక్షోభంలో మందుల కోసం, బెడ్స్ కోసం సోషల్ మీడియాలో ప్రజలు రకరకాల సమాచారం కోసం మెసేజులు పంపించుకుంటూ ఉంటారు… దాన్ని కూడా నియంత్రించడం దేనికి..? వాళ్ల బాధలు చెప్పుకుంటారు తప్పేముంది..? వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయకండి, చేస్తే కోర్టు ఉల్లంఘనగా పరిగణిస్తాం, రాష్ట్రాల డీజీపీలు దీన్ని ఓ హెచ్చరికగా తీసుకోవాలి… అసలు డాక్టర్లకే బెడ్స్ దొరకని సిట్యుయేషన్ ఇది…’’ అని సీరియస్గా చెప్పింది… కరోనాపై కేంద్రానికి ఓ సరైన పాలసీ లేదనే విమర్శలు దేశం నలుమూలల నుంచీ వస్తున్న సంగతి తెలుసు కదా… ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దాదాపు అదే చెప్పింది…
Ads
Share this Article