సీఎం మీద వ్యాఖ్యలు చేస్తున్నందుకు… బెయిల్ రద్దు పిటిషిన్లు వేసినందుకు… ఎంత కోపమొస్తే మాత్రం అలా ఒక ఎంపీ మీద రాజద్రోహం కేసు పెట్టేసి, కస్టడీలో పడేసి కొట్టేస్తారా..?
హేమిటి..? పోలీసులు కాదా..? ఎవరో ఆగంతకులు వచ్చి పోలీస్ కస్టడీలో ఉన్న ఓ ఎంపీని కొట్టిపోతారా..? ఇదేం అరాచకం..? రేప్పొద్దున ఎవరు ఏం మాట్లాడినా ఇదే గతి అని చెబుతున్నారా ఏం..?
రెండు మీడియా చానెళ్లనూ ఇరికించి, ఇకపై ఎవడు ప్రభుత్వం మీద విమర్శలు చేసినా మర్యాద దక్కదు అని సంకేతం ఇస్తున్నారా..? అంటే దేశంలో అభిప్రాయాలు చెప్పే హక్కు, అనగా భావ వ్యక్తీకరణ హక్కుకు చోటులేదా..?
Ads
ఎహె, ఆపండి… ట్రాష్… లిమిట్స్ క్రాస్ చేశాడు, కేసు తప్పలేదు… ఆయన్ని ఎవరూ కొట్టలేదు, పొద్దున బాగానే ఉన్నాడు, మధ్యాహ్నానికి మాట మార్చి ఏవేవో చెబుతున్నాడు… బెయిల్ కోసం ఏవేవో ప్రయత్నాలు అంటారా..?
సరే, వైద్యుల కమిటీ ఏం చెబుతుంది..? హైకోర్టు ఏం స్పందిస్తుందనేది పక్కన పెడితే… జగన్ ప్రభుత్వ అసహనం స్పష్టంగానే కనిపిస్తోంది… ఈ స్పందనకు ఎంపీ రఘురామకృష్ణంరాజు వాడే భాష, చేసే వ్యాఖ్యల తీరు కూడా ఓ కారణమే కావచ్చు గాక… ఆయన మాటల్ని ప్రజలు కూడా పెద్ద సీరియస్గా తీసుకోకపోవచ్చుగాక… కానీ బెయిల్ రద్దు పిటిషిన్ వేస్తే అది ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అవుతుందా..? రాజద్రోహం అవుతుందా..? ఆయన చెప్పింది ప్రజలకు చేరవేస్తే మీడియా చానెళ్లు కూడా ఆ కుట్రలో భాగస్వాములేనా..? వాటి వృత్తే అది కదా…? ఈ ప్రశ్నలు కొన్నాళ్లు చర్చల్లో మాత్రం ఉంటయ్… అయితే… ట్రిపుల్ ఆర్ మీద పెట్టిన సెక్షన్లు నిలుస్తాయా..? లేదానేది వేరే సంగతి… అరెస్టు చేసి, జైలుపాలు చేసి, ఓ సంకేతం ఇచ్చి, ఖబడ్దార్ అని చెప్పినట్టయింది జగన్… కానీ…
ఎప్పుడో బెయిల్ అయితే రాకపోదు కదా… ట్రిపుల్ ఆర్ సైలెంటుగా ఉంటాడా..? ఉండక చేసేదేముంది..? ఇది మరో డిబేట్… ఆయన తత్వానికి లోకసభను ఆశ్రయిస్తాడా..? తనపై పెట్టిన కేసుల తత్వం మీద… తనను కొట్టడం మీద… అంతేనా..? తన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు గండి, తన మీద పెట్టిన 124A వంటి సెక్షన్లు (124A (sedition), 153A (promoting enmity between different groups), 505 (statements conducing public mischief) read with 120B (conspiracy) ఉద్దేశపూర్వక దుర్వినియోగం అంటూ సుప్రీంను ఆశ్రయిస్తాడా..? ఒక ఎంపీ స్వీయ అనుభవాలు కాబట్టి, ఇవి విచారణ జరపాల్సిన అంశాలే అని సుప్రీం స్వీకరిస్తుందా..? ఇవన్నీ మనం ఊహించడమేనా..? లేక జరిగింది ఇక చాల్లే అని తనంతట తనే సైలెంట్ అయిపోతాడా ఇక..? సో, ఈ పరిణామాలు జరిగితే చూడాలి… కానీ… ఒక పరిధి దాటి విమర్శలకు వెళ్తే ఇక డైరెక్ట్ యాక్షన్ తప్పదు అని జగన్ సంకేతాలు ఇచ్చినట్టుగానే భావించాలి… ఆల్రెడీ టీవీ5, ఏబీఎన్ చానెళ్లు ఫైర్ జోన్లోనే ఉన్నయ్… టీడీపీ ముఖ్యనేతల మీద ఫైరింగ్ సాగుతూనే ఉంది… కేసులు, అరెస్టులు నడుస్తూనే ఉన్నయ్… ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ మీద ఇలాంటి కేసులే పెట్టబడ్డయ్… జగన్ తత్వానికి చంద్రబాబును కూడా స్పేర్ చేయడు… తనది ‘అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ డిఫెన్స్’ అనే పాలసీ… తను ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, ప్రమత్తంగా ఉన్నా… టీడీపీ, యెల్లో మీడియా తదితర శక్తుల పవర్ ఫుల్ కూటమి తనను అమాంతం మింగేస్తుందని బాగా తెలుసు… సో, ఏపీ సినిమా ఇప్పుడిప్పుడే రసకందాయంలో పడుతోందా..?!
Share this Article