కొన్ని వార్తలు చదివితే నవ్వాలో, ఏడవాలో… మన చుట్టూ ఉన్న పరిస్థితులకు మనమీద మనమే జాలిపడాలో అర్థం కాదు… ఇదుగో ఇదీ అలాంటి వార్తే… దేశం మొత్తమ్మీద కరోనాకు విరుగుడు రెమ్‌డెసివర్ తప్ప వేరే మందు లేదన్నట్టుగా కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటళ్లు లక్షలకులక్షలు గుంజుతూ ఎడాపెడా కుచ్చేశాయి కదా… ఎక్కడ చూసినా బ్లాక్ దందా… ఉత్పత్తి ధర నాలుగైదువందలు కూడా ఉండదు… మన డ్రగ్ కంట్రోల్ జలగలు ఇష్టారాజ్యం రేట్లు ఖరారు చేసుకోవడానికి అనుమతించేశారు… (మోడీ ప్రభుత్వం డ్రగ్, వేక్సిన్ పాలసీ ఫ్లాప్, ఫ్లాపున్నర, మరీ ఈ విపత్తుకాలంలో ఇది దేశాన్ని తీవ్రంగా నష్టపెట్టింది… పెడుతూనే ఉంది…) కంపెనీని బట్టి, బ్రాండ్‌ను బట్టి ధర… అవీ సరిగ్గా దొరకవు… బ్లాక్ మార్కెట్…
ఎహె, బ్లాక్ చేసి, అమ్మడం దేనికి అనుకున్న కొందరు కేట్లు, డూప్లికేట్లు… ఫేక్ వయల్స్ తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చారు… ఏమీలేదు, కాసిన్ని గ్లూకోజు, ఉప్పు నీళ్లను నింపి అదే రెమ్‌డెసివర్ అని అంటగట్టడం… అవీ లక్షల రేట్లకు… మధ్యప్రదేశ్‌లో ఇలాంటిదే ఓ రాకెట్ బయటపడింది… వాళ్లందరి మీద మర్డర్ కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింహ్ చౌహాన్ ఆదేశించడంతో… ఈ ఫేక్ ఇంజక్షన్లు కొని వేయించుకున్న బాధితుల వివరాల సేకరణలో పడ్డారు పోలీసులు… విచిత్రం ఏమిటంటే… ఈ ఫేక్ ఇంజక్షన్లు చేయించుకున్నవారిలో 90 శాతం సేఫ్… పది మంది మాత్రమే ఇన్ఫెక్షన్లు విషమించి మరణించగా, వంద మంది దాకా సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నారు… వేసుకున్నది గ్లూకోజు నీళ్లే కదా, ప్రమాదమేముంది అంటారా..? ఓ 10 ఎంఎల్ సెలైన్ సూటిగా ఎక్కించుకున్నట్టు, అంతే కదా…
Ads
హైదరాబాద్ బేస్డ్ ఓ ఫార్మా కంపెనీ ద్వారా తమిళనాడులో ఇలాంటి దందా నడిపిస్తున్న మరో రాకెట్‌ను కూడా అక్కడి పోలీసులు చేధించారు ఈమధ్యే… వాళ్లపై గూండా యాక్ట్ సెక్షన్లు పెట్టాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదేశించాడు… నిజానికి 90 శాతం దాకా రోగులు ఆ ఇంజక్షన్లతో ‘కోలుకున్నారు’ అని బాష్యం చెప్పేవాళ్లూ ఉన్నారు… ఎలాగంటే..? నిజానికి రెమ్‌డెసివర్ పెద్దగా కరోనా చికిత్సకు పనిచేయదు… అది అంత పవర్ ఫుల్ యాంటీ వైరల్ డ్రగ్ ఏమీ కాదు… కాకపోతే కార్పొరేట్ డ్రగ్ మాఫియా హైప్ క్రియేట్ చేసింది… (కరోనా తొలి వేవ్ సందర్భంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలకూ ఇలాంటి మహత్తే ఆపాదించి, దేశదేశాలకు పంపించింది ఇండియన్ ప్రభుత్వం)… ఆ రెమ్‌డెసివర్ కృత్రిమ డిమాండ్ ఆధారంగా వేల కోట్లను కుమ్మేసింది హాస్పిటళ్లు, ఫార్మా మాఫియా…
కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిజమేమిటో లేటుగానైనా తేల్చేసింది… అదసలు పనిచేయదు, అందుకని మీ చికిత్స ప్రోటోకాల్ నుంచి దాన్ని తీసేయండి అని చెప్పింది… అదేకాదు, ప్లాస్మా థెరపీ కూడా వేస్టని చెప్పింది… అంటే ఈ మధ్యప్రదేశ్ కేసులో ఒరిజినల్ రెమ్‌డెసివర్ వేసుకోకుండా, ఫేక్ రెమ్డెసివర్లు వేయించుకోవడం వల్ల…. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 90 శాతం రోగులు బయటపడ్డారన్నమాట… (ఇంజక్షన్లు వేసుకున్నాం కదా, ఇక సేఫ్ అనే ధైర్యం పెరిగి క్రమేపీ కోలుకున్నారేమో….) మిగతా 10 శాతం మందికి సీరియస్ కావడానికి వేరే కారణాలు ఉండవచ్చు… చేదు నిజం చెప్పమంటారా..? ఈరోజుకూ ఇంకా రెమ్‌డెసివర్ దందా సాగుతూనే ఉంది… డాక్టర్లు పొడుస్తూనే ఉన్నారు… కోట్లకుకోట్లు పీల్చేస్తూనే ఉన్నారు..!!
Share this Article