భద్రతా మండలి చెబుతున్నా వినిపించుకోవడం లేదు… ఇస్లామిక్ దేశాలు బెదిరిస్తున్నా ఖాతరు చేయడం లేదు… పిల్లలు, మహిళలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదు… మీడియా హౌజులు ఉన్నాయని మొత్తుకుంటున్నా భవనాల్ని కూల్చకుండా ఆగడం లేదు… ఇజ్రాయిల్ గాజా మీద విరుచుకుపడుతూనే ఉంది… ‘ఒక్కసారి ఫిక్సయ్యానంటే నామాట నేనే వినను’ అని అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా… అలా అన్నమాట..!
నిజానికి ఇజ్రాయిల్ తమకు పడనివాళ్లు, తమ జాతికి శత్రువులుగా భావించిన వాళ్లను వేటాడంలో ఓ కసిని, ఓ తెగింపును, ఓ మొండితనాన్ని కనబరుస్తుంది… ప్రత్యేకించి ఆ దేశ గూఢచార సంస్థ మొసాద్ ప్రపంచంలోకెల్లా నొటోరియస్… టార్గెట్ చేశారంటే ఏళ్ల తరబడి వేటాడైనా సరే ఖతం చేయాలనేది దాని సూత్రం… అలాంటిది తమ జాతికి చెందిన లక్షల మందిని ఊచకోత కోయించిన వ్యక్తిని ఏం చేయాలి..? అదే ఈ కథ… నిజానికి ఇది కొన్ని పుస్తకాల్లో వచ్చిందే… ఓ సినిమా కూడా వచ్చినట్టుంది… ఎందుకు ఈ అధ్యాయానికి ప్రాధాన్యం ఉందీ అంటే…… మీరే చదవండి…
Ads
ఈ ప్రపంచంలో యూదు జాతికి చెందిన ఒక్కడూ ఉండకూడదు… మిగలకూడదు……. ఇది హిట్లరేకే కాదు, లెఫ్టినెంట్ కల్నల్ అడాల్ఫ్ ఐష్మాన్కూ అదే కసి… ‘కోటీ 30 లక్షల మంది ఉంటారు యూదులు, మొత్తం నిర్మూలించాలి… కానీ అది చేయలేకపోయాం…’ అని బాధపడ్డాడు రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఈయన… ఇజ్రాయిల్ తనను వదిలిపెట్టదు అనుకున్నాడు… అర్జెంటీనా పారిపోయాడు… ఈ ఐష్మాన్ను ఎలాగైనా పట్టుకోవాలని ఇజ్రాయిలీ స్పై ఆర్గనైజేషన్ మొసాద్ ఏజెంట్లు ప్రపంచవ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు… తమ సమాచార మార్గాలన్నీ కదిలిస్తున్నారు… ప్రతి సోర్స్‌ను టచ్ చేస్తున్నారు… జర్మనీ నుంచి ఓ టిప్ అందింది… ఐష్మాన్ ఓ మారుపేరుతో అర్జెంటీనాలో ఉంటున్నాడు అని…
ఇంకేముంది..? దొరకబట్టుకుని ఖతం చేయాలని మొసాద్ నిర్ణయించేసుకుంది… కానీ ఓమాట ప్రధానికి చెప్పాలి కదా… మొసాద్ డైరెక్టర్ ప్రధానమంత్రికి చెప్పాడు… ‘వీలయితే ప్రాణాలతో పట్టుకురండి… రహస్యంగా చంపడం దేనికి..? చట్టబద్ధంగా తన తప్పు లోకానికి చెప్పి, తలెత్తుకుని శిక్షిద్దాం’ అన్నాడు ఆ ప్రధాని బెన్ గురియో… ఎక్కడో కాపుకాచి, కనిపించగానే టపాటపా నాలుగు బుల్లెట్లు కాల్చడానికీ, సజీవంగా ఒక దేశం నుంచి తమ దేశానికి పట్టుకుని రావడం కష్టం… అందుకని జాగ్రత్తగా ఓ ప్రణాళిక వేశారు…
అర్జెంటీనా నుంచి నాలుగు టీంలు రహస్యంగా వెళ్లి, ఓ ఇల్లు తీసుకుని అందులో చేరిపోయారు… ఐష్మ్యాన్ కదలికలు, రోజువారీ కార్యక్రమాల్ని సేకరిస్తున్నారు… అర్జెంటీనీ 150 వ స్వాతంత్ర్య ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి, దేశం తరఫున ఓ ప్రతినిధి బృందాన్ని ఓ ప్రత్యేక విమానంలో పంపాలని ప్లాన్ వేశారు… పేరుకు విద్యామంత్రి నేతృత్వం… కానీ తనకే తెలియదు… విమానంలో తనతోపాటు వచ్చేది మొత్తం మొసాద్ ఏజెంట్లు అని… ప్రతినిధుల పేర్లతో వస్తున్నారని…
ఈలోపు గెస్టులు ఎక్కువయ్యారంటూ అర్జెంటీనా వీళ్ల ప్రోగ్రామ్‌ను పది రోజులు వాయిదా వేయాలని నిర్ణయించింది… దీంతో ఈ ఆపరేషన్ కూడా ముందు అనుకున్నట్టు జరుగుతుందా లేదా అనే డైలమా ఏర్పడింది… కానీ ఏదేమైనా సరే, ముందు ఐష్మాన్ను పట్టుకుని, తాము గుట్టుగా ఉంటున్న ఇంట్లో బంధించి, స్వాతంత్ర్య ఉత్సవాలకు వచ్చే విమానంలో ఎక్కించి, ఇజ్రాయిల్ తీసుకుపోవాలని తీర్మానించేసుకున్నారు… అధికారిక విమానం అయితే ఈజీ… సో, రెండు కార్లు తీసుకున్నారు…
ఐష్మ్యాన్ రోజూ 203 నంబర్ బస్సు దిగి, నడిచిపోతాడు… అదే టైంలో ఎత్తుకుపోవాలని ప్లాన్… సాయంత్రం వీళ్లు ఓచోట కార్లు ఆపుకుని ఎదురుచూస్తూనే ఉన్నారు… కాస్త ఆలస్యంగా ఓ బస్సు దిగి వస్తున్నాడు… కారు హెడ్లైట్లను నేరుగా తన కళ్ల మీద పడేట్లు వెలిగించారు… వెంటనే వెనుక నుంచి మీదపడ్డారు… నోట్లో గుడ్డలు కుక్కి, కారు వెనకసీటులో పడేసి, తమ ఇంటికి తీసుకుపోయారు…
ఇంతకీ తాము పట్టుకుని ఐష్మానేనా..? తన భుజం కింద ఉన్న ఎస్ఎస్ (సెక్యూరిటీ సర్వీస్ గుర్తు) పచ్చబొట్టు చూసి నిర్ధారించుకున్నారు… తనతోనూ చెప్పించారు… తన పేరుతో ఓ ఫేక్ గుర్తింపు కార్డు తయారుచేశారు, ఇజ్రాయిలీ ఎయిర్‌లైన్స్ ఉద్యోగి బట్టలు తొడిగారు… మత్తు ఇంజక్షన్ ఇచ్చారు… దాంతో ఐష్మాన్ చూస్తున్నాడు, కదులుతున్నాడు గానీ మాట్లాడలేకపోతున్నాడు… విమానాశ్రయం దగ్గర తనిఖీలుంటయ్ కదా, ఇబ్బంది తలెత్తకుండా మాంచి జోష్‌లో తిరిగి వెళ్తున్నట్టు కలరింగ్ ఇచ్చారు… అందరూ ఎయిర్‌లైన్స్ డ్రెస్సుల్లో ఉన్నారు…
సో, తనిఖీ సిబ్బంది అనుమానించలేదు… విమానం దాకా కార్లు తీసుకుపోయి, ఐష్మాన్ను ఎక్కించారు… ఇజ్రాయిల్ చేరారు… సమాచారం తెలిసిన ఆ ప్రధాని ఫుల్ ఖుష్… అదేరోజు పార్లమెంటులో ప్రకటించాడు… ‘మనవాళ్లు 60 లక్షల మందిని చంపినవాడు దొరికాడు’ అని… ఏడాదిన్నర తరువాత అన్ని విచారణలూ పూర్తి చేసి ఉరితీశారు… ఇజ్రాయిల్ తొలి ఉరిశిక్ష అదే… విశేషం ఏమిటంటే… చివరి ఉరిశిక్ష కూడా అదే…!!
Share this Article