అల్లుడు..! భారత రాజకీయాల్లో ఈ కేరక్టర్ ప్రభావితం చేయని లీడర్ లేడు, పార్టీ లేదు… లేదు… ఆ పదానికి ఉన్న పవర్ అది… ఆ బంధానికి ఉన్న పట్టు అది… ఆ స్థానానికి ఉన్న బలం అది… మేనల్లుడు కావచ్చు, సొంత అల్లుడు కావచ్చు… అయితే మామల్ని గెలుచుకుని పదవులు పొందడం… లేదా మామల్ని వెనుక నుంచి కసుక్కున పొడిచేసి కుర్చీ ఎక్కేయడం… బొచ్చెడు ఉదాహరణలు… అబ్బే, మా నిప్పులు కడిగే అరుణ పార్టీల్లో ఆ బంధుప్రీతి నడవదు… కుదరదు అంటారా..? తాజాగా ఓ ఉదాహరణ… ముఖ్యమంత్రి పినరై విజయన్ ఇంటికి అల్లుడై ఇంకా ఏడాది కూడా నిండినట్టు లేదు… మహమ్మద్ రియాజ్ అప్పుడే ఓ మెట్టు పైకి ఎక్కేసి, ఆయన గారి మంత్రివర్గంలో స్థానం సంపాదించేశాడు… ప్రపంచం గుర్తించిన శైలజ టీచర్ మంత్రి కొలువు ఊడింది… ఇదుగో ఈ అల్లుడికి మంత్రి పదవి వరించింది…
నిన్న చెప్పుకున్నాం కదా… శైలజ టీచర్ రికార్డు స్థాయి మెజారిటీతో గెలవడం, ప్రపంచమంతా ఆమెను ప్రశంసించడం, వైరస్ కంట్రోల్ విషయంలో ఆరోగ్యశాఖ మంత్రిగా మంచి పనితీరు కనబరిచి ప్రజల మెప్పు పొందడం…. ఇవేమీ పనికిరాకుండా పోయాయి ఇప్పుడు… మంత్రి పదవి తీసేసి, పేరుకు ఓ పార్టీ విప్ పదవి ఇచ్చి, ఇక చాలుపో అనేసింది పార్టీ… కేరళలో పార్టీ అంటేనే విజయన్ కదా… ఇదేమిటయ్యా అంటే యూత్‌ను తీసుకొస్తున్నాం అంటున్నాడు ఈ 75 ఏళ్ల ముఖ్యమంత్రి… ఫాఫం శైలజకు దక్కిన గుర్తింపు సంగతి అది… ‘పోతేపోనీలే, నాకన్నా బాగా పనిచేసేవాళ్లు బోలెడు మంది ఉన్నారు, అందరికీ దక్కాలి కదా అవకాశాలు’ అని హుందాగా స్పందించి, విజయన్ ఇగో మీద మరో దెబ్బ వేసింది ఆమె… అవున్లెండి, పార్టీకి, సీఎంకు దక్కకుండా బోలెడంత ఖ్యాతి ఆమెకే దక్కుతుంటే ఫాఫం, ముసలాయన ఇగో ఆల్ రెడీ బాగా దెబ్బతిని ఉంటుంది కదా… ఇక్కడ సీన్ కట్ చేస్తే…
Ads
రియాజ్… ఓ మాజీ ఐపీఎస్ అధికారి కొడుకు… ఎస్ఎఫ్ఐ నుంచే పార్టీలో ఎదుగుతూ, ఒక దశలో డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా కూడా చేశాడు… వీణ… సీఎం విజయన్ బిడ్డ… ఐటీ ప్రొఫెషనల్, కొంతకాలం ఏవేవో కంపెనీలో పనిచేసినా తరువాత సొంతంగా బెంగుళూరే కేంద్రంగా ఓ ఐటీ ఫరమ్ సొంతంగా పెట్టుకుంది… వీళ్లిద్దరికీ అంతకుముందే పెళ్లిళ్లయ్యాయి… రియాజ్‌కు ఇద్దరు పిల్లలు, వీణకు ఓ కొడుకు… సరే, వాళ్ల పెళ్లి వేరే కథ, అది వాళ్ల ఇష్టం… కానీ… జస్ట్, ఏడాది తిరిగేలోపు విజయన్ తన అల్లుడికి తన కేబినెట్లోనే చాన్స్ ఇవ్వడం మాత్రం కచ్చితంగా విశేషమే… మరి ఈ అల్లుడి మీద ప్రీతికి, ఈ కట్నకానుకలకు పార్టీ ఎలా అంగీకరించింది..? భలేవారే, విజయన్ ప్రతిపాదించాక కేరళ సీపీఎంలో కాని పని ఏముంటుంది..? ఆగండాగండి… మరో విశేషమూ చెప్పుకోవాలి…
లెఫ్ట్ పార్టీల్లో ప్రధానమైన పోస్టు పార్టీ కార్యదర్శి పదవి… కేరళ రాష్ట్ర పార్టీ కార్యదర్శి పేరు విజయరాఘవన్… ఆయన భార్య పేరు ఆర్.బిందు… పైన ఫోటోల్లో కనిపిస్తున్నది ఆమే… విజయన్ కేబినెట్లో ఆమె కూడా ఉండబోతోంది… వావ్… సీఎం అల్లుడు ఒక మంత్రి, పార్టీ కార్యదర్శి భార్య మరో మంత్రి… ఉన్న 12 మంత్రి కొలువుల్లో ఒకటి సీఎం, రెండు ‘బంధుప్రీతి’ ఖాతాలోకి చేరాయి… ఇక మిగిలిన తొమ్మిదిలో (లెఫ్ట్ కూటమిలో సీపీఎం కోటాకు వచ్చేవి 12 కేబినెట్ పోస్టులే, ఒప్పందాల మేరకు…) ఇక్కడ ఓ క్లారిటీ… రియాజ్ స్వతహాగానే ఏళ్లుగా సీపీఎం వర్కర్… తను మంత్రి పదవికి అనర్హుడు ఏమీ కాదు… అలాగే బిందు కూడా… కానీ శైలజ చెప్పినట్టు చాలామంది పనిచేసేవాళ్లు ఉన్నారు, వీళ్లకే ఎందుకు దక్కినట్టు మంత్రి పదవులు..? పైగా తెల్లారిలేస్తే ఫ్యూడల్ పార్టీల్లోని బంధుప్రీతిని ఎండగడుతూ ఉంటారు… ఇప్పుడు ఆ నైతిక హక్కు ఉన్నట్టా..? పోయినట్టా..? కారకులు ఎవరు..?!
Share this Article