నెల్లూరు కరోనా మందు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు, జాతీయ స్థాయిలో చర్చను రేపుతోంది… మహావిపత్తులో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ కూడా ఆధారమే అన్నట్టుగా జనం వేలాదిగా ఆ మందుకోసం ఎగబడ్డారు… ఒక్కరు కూడా నెగెటివ్‌గా చెప్పలేదు, చాలామంది సంతృప్తిని వ్యక్తం చేశారు… మంచి ఫలితాలు కనిపించాయి… అబ్బురంగా…! సరే, సిద్ధవైద్యం గురించి తెలియని గుడ్డి శాస్త్రీయులు ఎప్పటిలాగే దీన్ని వ్యతిరేకించి, తమ ఘన మేధస్సుకు ఇప్పటికీ ఢోకా లేదని చెప్పడానికి నానా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు… శాస్త్రీయ నిరూపణ అనే ఓ బ్రహ్మపదార్థాన్ని ముందుపెడతారు… ఓ పరంపరగా సిద్ధించే విద్యకు శాస్త్రీయ ఆధారాలు ఉండవనీ, ఇన్నివేల మంది వాడటమే గొప్ప ట్రయల్ అనీ అర్థం కాదు వాళ్లకు… ఆఫ్టరాల్ మూడునాలుగు వందల మంది రోగులపై ప్రయోగాలు చేస్తేనేమో అది సూపర్, శాస్త్రీయం…. ఇన్ని వేల మంది వాడితేనేమో అది అశాస్త్రీయం… ప్రత్యామ్నాయ వైద్యం, సంప్రదాయ వైద్యం విశిష్టత, అవసరం, ప్రాధాన్యం తెలియని బుర్రల గురించి కాసేపు పక్కన పెడదాం… ఆ చర్చ లోతుల్లోకి వెళ్తే అది ఒడవదు, తెగదు… కానీ జిల్లా అధికార యంత్రాంగం లోకాయుక్తకు పంపించిన ఓ ప్రాథమిక నివేదిక కొంత ఆసక్తికరంగా ఉంది…
ఈ మందు నేపథ్యం, వివాదం తెలియనివాళ్లు ఒకసారి ఈ లింకు చదివితే బెటర్…
లోపలేయండి, కుమ్మేయండి… పనికొచ్చే కరోనా వైద్యం ఫ్రీగా చేస్తున్నాడట…
Ads
ఓసారి ఆ నివేదికలోని ముఖ్యాంశాలు చూడండి…
ఆర్డీవో, డీఎంహెచ్‌వో, డీపీవోలతో పాటు కాయచికిత్స, రసశాస్త్ర, ద్రవ్యగుణ డాక్టర్లు కూడా చెప్పింది ఒకటే… ఈ మందు వల్ల ఎవరికీ ఏ చెడు ప్రభావాలూ లేవు అని… అలాగని దీన్ని వాళ్లు వెంటనే రికమెండ్ చేయలేదు… ల్యాబ్‌కు పంపించారు… ఆ రిపోర్టు వచ్చాక అధికార యంత్రాంగం ఏం చెబుతుందో చూద్దాం… అయితే సిద్ధవైద్యుడు తన పరంపరగా సిద్ధించిన ఫార్ములాను వెల్లడించాల్సిన అవసరం లేదు… కానీ సదరు నెల్లూరు సిద్ధవైద్యుడు ఆనందయ్య తన ఫార్ములాను చెప్పాడు, తను వాడే ముడిపదార్థాలు చెప్పాడు, అవన్నీ సురక్షితంగా ఆయుర్వేదంలో వాడేవే… ఆయన రూపాయి తీసుకోవడం లేదు, ధనకాంక్షతో చేస్తున్న దందా కాదు ఇది… కోవిడ్ నిబంధనల్ని అనుసరించి సోషల్ డిస్టెన్స్ లేదు, మాస్కుల్లేవు అనేది వేరే సంగతి…
నిజానికి ల్యాబు ఏం చెబుతుంది..? ఆ మందు కెమికల్ లక్షణాల్ని చెబుతుంది… సదరు వైద్యుడు వాడిన మూలికలు, ముడిపదార్థాలతో అంతిమంగా తయారయ్యే మందు ఏమైనా ప్రమాదకరమైన రసాయనంగా మారితే చెప్పగలరు… అంతేకదా… ల్యాబు ఈ మందు వాడొచ్చా లేదా చెప్పలేదు… దాని ఫలితాల్ని చెప్పలేదు… మరి అధికారయంత్రాంగం ఏం చేయాలి..? మాకెందుకు రిస్క్ అనుకుని, కేంద్ర ఆయుష్ విభాగానికి పంపించి చేతులు దులుపుకుంటారు… హస్తినలోని ఆయుష్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది… నొటోరియస్ అధికారులు… నిజానికి దేశీవైద్య పద్ధతులు వేరు ఉంటయ్… అవి అల్లోపతి పద్ధతుల్లో ఇమడవు… ఇవి పనిచేస్తున్నా సరే, ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి ఓ ఆధారంగా మారినా సరే….. లక్షల కోట్ల డ్రగ్, వేక్సిన్, ఫార్మా, హాస్పిటల్ మాఫియాల ముట్టడిలో… ఇలాంటివి కాస్త ఎంకరేజ్ చేసి చూద్దామనే సోయి కూడా ఉండదు ఎవరికీ… మళ్లీ చెబుతున్నా… నెల్లూరు వైద్యుడికి ఇది డప్పుకొట్టడం కాదు… గుడ్డిగా వ్యతిరేకించకూడదు అని చెప్పడం… పోనీ, ఈ జిల్లా స్థాయి అధికార్ల నివేదికలో చెప్పినట్టు నాలుగు రోజులు క్వారంటైన్, ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లకు మందు ఇచ్చి చూడండి… ఫలితాన్ని అధికారికంగా రికార్డు చేయండి… మరో నాలుగు రోజులు ఇతర వైద్యవిధానాల నిపుణుల పర్యవేక్షణలో ఉంచండి… అంతేతప్ప మోకాలడ్డకండి… అంతే… సిద్ధవైద్యం అంటే భూతవైద్యమో, తాయెత్తు దందాయో కాదు…!! ఆనందయ్య రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన దొంగ వైద్యుడు కాదు… ఏళ్లుగా అక్కడ మూలికా వైద్యం చేస్తున్నవాడే… తాజా అప్డేట్ :: మందును యథాతథంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని సమాచారం..!!
Share this Article