తుఫాన్, భూకంపం, అగ్నిప్రమాదం, కరువు…. విపత్తు ఏదయినా సరే, అది ముంచెత్తడానికి ముందు అప్రమత్తత, సన్నద్ధత అవసరం… ముంచెత్తే సమయంలో ప్రాణాల్ని రక్షించడం, ఆస్తుల పరిరక్షణ ప్రధానం… అంతా అయ్యాక బాధితుల గుర్తింపు, పునరావాసం, పరిహారం, పునర్నిర్మాణం అన్నింటికన్నా పెద్ద పని… నిజానికి ఏ ప్రభుత్వమైన వీలైనంత ఔదార్యాన్ని కనబర్చాల్సింది కూడా ఇక్కడే..! అఫ్ కోర్స్, పాలకులు ఆ స్పృహ కోల్పోయి చాలారోజులైంది కాబట్టి ఏ ముఖ్యమంత్రి ఏ చిన్న సాయాన్ని చూపించినా విశేషంగా చెప్పుకోవాలనిపిస్తోంది… ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ (తీర్థసింగ్..?) చేసిన పని అదే… అది చిన్న రాష్ట్రమే కావచ్చు, జనాభా కూడా తక్కువే కావచ్చు, కానీ ఆ రాష్ట్ర ఖజానా స్థోమతతో పోలిస్తే మంచి ఉదార నిర్ణయమే అనుకోవాలి… అదేమిటంటే..?
కరోనా బారిన పడి కుటుంబ పెద్ద మరణిస్తే, తల్లిదండ్రులు చనిపోతే… అకస్మాత్తుగా ఆ పిల్లల బతుకులు బజారుపాలేనా..? అనాథల్ని రేప్పొద్దున ఎవరు చూస్తారు..? ముష్టెత్తుకోవాల్సిందేనా..? ఎవరి బతుకులు వాళ్లకు బరువైపోతున్న నేపథ్యంలో బంధుగణం కూడా పట్టించుకోరు… ఒకవేళ చేరదీసినా వాళ్ల బాగోగుల్ని సరిగ్గా పట్టించుకుంటారా..? దేశవ్యాప్తంగా ఇలాంటి పిల్లలు వేలల్లోనే ఉంటారు… అధికారిక లెక్కల మాట ఎలా ఉన్నా సరే…! ఇప్పుడు తీర్థసింగ్ ప్రకటించిన పథకం పేరు ముఖ్యమంత్రి వాత్సల్య యోజన… (పేరు బాగుంది…)… ఇందులో భాగంగా అనాథలుగా మారిన పిల్లల బాధ్యతను పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటుంది… 21 ఏళ్లు వచ్చేవరకు మొత్తం చదువు బాధ్యత, కడుపు నింపే బాధ్యత కూడా ప్రభుత్వానిదే… అంటే ఫ్రీ చదువు మాత్రమే కాదు, బతకడానికి నెలకు 3 వేల చొప్పున ఆ పిల్లలకు చెల్లిస్తుంది ప్రభుత్వం… బాగుంది… కొలువు సంపాదించే నైపుణ్య శిక్షణ కూడా ప్రభుత్వమే ఇప్పిస్తుంది… మరో విశేషం ఏమిటంటే… రేప్పొద్దున ఇలాంటి పిల్లలకు అయిదు శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేస్తారు…
Ads
తల్లిదండ్రులు ఇద్దరు మరణిస్తేనే కాదు, సంపాదించే వ్యక్తి మరణించడం వల్ల నష్టపోయే పిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది… అంతేకాదు, ఆ పిల్లల పూర్వీకుల ఆస్తుల్ని ఎవరు అమ్మినా, కొన్నా నేరంగా పరిగణిస్తారు… ఈ పిల్లలు పెద్దవాళ్లయ్యేదాకా ఈ నిషేధం అమలవుతుంది… బంధువులు మోసం చేసి, ఆస్తుల్ని అమ్మేసి, సొమ్ముచేసుకుని, పిల్లల్ని వీథుల్లోకి నెట్టేసినా దిక్కులేదు కదా… అందుకే ఈ కట్టుబాటు… గుడ్… అలాంటి లావాదేవీలు జరిగితే సంబంధిత జిల్లా కలెక్టర్లు జవాబుదారీ అవుతారు… ఇలాంటి పిల్లల పేరిట 10 లక్షల్ని డిపాజిట్ చేయాలనే ఏపీ సర్కారు నిర్ణయం కూడా అభినందనీయమే… అక్కడక్కడా కొందరు సీఎంలు ఇలాంటి విపత్తు సాయం ప్రకటిస్తున్నారు… కానీ ఓ ఏకరూప విధానాన్ని కేంద్రమే రచించి, సగం తను భరించి, సగం బాధ్యతను రాష్ట్రాలపై పెడితే బాగుండేది… అకస్మాత్తుగా అవ్వను, అయ్యను పోగొట్టుకుని దిక్కులేక విలపించే కొందరు పిల్లల కన్నీళ్లయినా తుడవగలిగితే అంతకుమించి ఈ ప్రభుత్వాలకు సార్థకత ఏముంటుంది..? అంతకుమించి ఇవి చేస్తున్నదేముంది..? చేయగలిగేదేమున్నది..!? మరి ఈ కోణంలో తెలంగాణ సర్కారు చేస్తున్నది ఏమిటి అంటారా..? సారీ… రాంగ్ నంబర్…!!
Share this Article